-
ఒకే ఒక్క మార్కుతో లక్షా 85వేల మంది ఫెయిల్
-
ఇంటర్మీడియట్ ఫలితాల్లో హృదయ విదారక పరిణామం
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఒక్క మార్కు తేడా లక్షలాది మంది విద్యార్థులను, వాళ్ల తల్లిండ్రులను తీవ్రంగా బాధపెట్టింది. విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్రంగా ప్రభావం చూపించింది. ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల ప్రకారం, ఈ యేడాది సుమారు 1.85 లక్షల మంది విద్యార్థులు ఒక్క మార్కు తేడాతో పాస్ కాకుండా ఫెయిల్ అయ్యారు. ఈ పరిణామం విద్యార్థుల్లోనే కాదు, వారి తల్లిదండ్రుల్లోనూ తీవ్ర ఆవేదనను, అసంతృప్తిని కలిగిస్తోంది. ఇంటర్మీడియట్ మొత్తం ఉత్తీర్ణత శాతం 71.37 గా నమోదు కాగా, గురుకుల విద్యాసంస్థలు అత్యుత్తమ ప్రదర్శనతో 83.17 శాతం ఉత్తీర్ణత సాధించాయి.
ఇక, కొందరు విద్యార్థులైతే విశిష్ట ప్రతిభను చూపించారు. బైపీసీ స్ట్రీమ్‌లో ఓ విద్యార్థిని 997 మార్కులతో టాప్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఎంపీసీలో నలుగురు విద్యార్థులు 996 మార్కులు సాధించి తల్లిదండ్రుల్లో, తాము చదువుతున్న కాలేజీల్లో మెరుపులు నింపారు. దేవరకొండ గిరిజన సంక్షేమ పాఠశాలలో చదువుతున్న ఓ బైపీసీ విద్యార్థిని కూడా 996 మార్కులు సాధించి గురుకులాలకే గర్వకారణంగా నిలిచింది.
విద్యావేత్తల ఆందోళన :
ఈ ఏడాది ఫలితాల్లో ఒక్కో మార్కు తేడాతో భారీగా విద్యార్థులు ఫెయిల్ కావడంపై విద్యావేత్తలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రేస్ మార్కులు, రీ–వాల్యూయేషన్ విధానాలపై మరింత స్పష్టత అవసరమని, విద్యార్థుల మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకుని హృదయపూర్వక పరీక్షా విధానం అమలు చేయలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, రీవాల్యూయేషన్, రీకౌంటింగ్ ద్వారా చాలా మంది విద్యార్థులు పాస్ అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
సప్లిమెంటరీ పరీక్షల ప్రకటన:
ఇక ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం మే 22 నుండి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. ఈ పరీక్షల షెడ్యూల్ మే మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు ఈ పరీక్షల ద్వారా మరో అవకాశం పొందే అవకాశముంది.