-
అమర్నాథ్ యాత్రను విచ్ఛిన్నం చేసేందుకేనా?
-
అమరనాథ్ యాత్రికులకు పెహల్గాం బేస్ క్యాంప్
-
పెహల్గాం, బైసరన్ వ్యాలీ పక్క పక్కనే
-
బైసరన్ వ్యాలీ అత్యద్భతమైన లాండ్ స్కేప్
-
మనుసును కట్టి పడేసే ప్రకృతి రమణీయత
-
సేద తీరేందుకు వచ్చే టూరిస్టులు,యాత్రికులు
-
ఆకట్టుకునే వెండి కొండలు, పైన్ ట్రీస్
-
మినీ స్విట్జర్లాండ్ అని ఈ లోయకు పేరు
-
టూరిస్టులు, యాత్రీకులే ఉగ్రవాదుల టార్గెట్..
-
భయోత్పాతం సృష్టించి రాకుండా చేయడమే లక్ష్యం
-
హిందువులనే టార్గెట్ చేసిన ఉగ్రమూకలు
-
ఇక్కడ దాడి చేస్తే తప్పించుకునే వీలుండదు
-
కశ్మీర్‌ను టూరిస్టు కేంద్రంగా ప్రకటించడంపై అసహనం
-
దాడికి బాధ్యత వహించిన టీఆర్ఎఫ్ సంస్థ
జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడి జరిగిన పెహల్గామ్ ప్రాంతం అనంతనాగ్ జిల్లాలో ఉంది. ఈ ప్రాంతానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో బైసరన్ లోయ ఉంది. ఈ పహల్గాం అటు అమర్నాథ్ యాత్రికులకు బేస్ సెంటర్ కూడా.. టూరిస్టులకు ఈ ప్రాంతం ప్రధానంగా ఆకర్షణీయంగా కనపడటానికి కారణం ఇక్కడుండే ప్రకృతి రమణీయతే. కశ్మీర్ అందాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు.. అత్యద్భుతంగా కనపడే పర్వతాలు, లోయ వాతావరణమే ప్రశాంతంగా ఉంటుంది. లోయ చుట్టూ పర్వతాలు మంచుతో కప్పబడి వెండి శిఖరాల్లా ఎండలో తళుకులీనుతూ అత్యద్భుతంగా కనిపిస్తాయి.
ఆకాశాన్నంటేలా కనపడే పైన్ వృక్షాలు ఈ నేలను, ఆ నింగినీ కలిపినట్లే ఉంటాయి. ఇంచుమించు స్విట్జర్లాండ్‌లో ప్రకృతి అందాలన్నీ ఇక్కడా కనిపిస్తాయి కాబట్టే పర్యాటకులు దీనిని మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తుంటారు. ఈ ప్రాంతానికి సరైన రహదారి కూడా లేదు. పచ్చని ప్రకృతితో ఆకుపచ్చగా అలరారే ఈ ప్రాంతానికి వెళ్లాలంటే కేవలం నడక మార్గం మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొండలు, గుట్టలతో ఉండే ఇక్కడకి టూరిస్టులు గుర్రాలపై చేరుకుంటారు. బైసరన్ లోయ అందాలను ఆస్వాదించాలంటే ఉదయం పది పదిన్నరకల్లా టూరిస్టులు నడక దారిన లేదా గుర్రాలపై చేరుకుంటారు. పచ్చిక బయళ్లు, పచ్చని తివాచీ పరిచినట్లుండే నేలలు, చుట్టూ కోటలా ఆకాశాన్నంటే పర్వత శిఖరాలు, మంచుకొండలు కనిపిస్తాయి.
అమరనాథ్ యాత్రకు వ్యూహాత్మక ప్రాంతం :
ఇది అమరనాథ్ యాత్రకు అనువైన దారి కూడా. పెహల్గామ్ నుంచే అమరనాథ్ యాత్రికులు వెళుతుంటారు. ఈ సీజన్లో పెహల్గామ్లో టూరిస్టులు, యాత్రీకుల సందడి కనిపిస్తుంది. విహార యాత్రకు వచ్చే వారు బైసరన్ లోయకు వెళతారు. అమరనాథ్ యాత్రకు వెళ్లే వారికి పెహల్గాం బేస్ క్యాంప్. కాబట్టి ఎలా అయినా ఇది ఒక వ్యూహాత్మక ప్రాంతం. వేసవి సీజన్ లో పెద్ద ఎత్తున టూరిస్టులు, యాత్రికుల రాక, ఒక జాతరను తలపించే హడావుడి కనిపించడం ఉగ్రమూకలు జీర్ణించుకోలేకపోతున్నాయి. పెహల్గాం నుంచి హిమ లింగ దర్శనం కోసం చందన్ వారీ, శేషనాగ్, పంచ తరణి లాంటి ప్రాంతాలన్నీ దాటుకుంటూ శివ నామస్మరణతో హోరెత్తిస్తూ భక్తులు వెళుతుంటారు. హిమ లింగం ఉన్న అన్నిరోజుల్లోనూ ఇక్కడ పెద్ద ఎత్తున హడావుడి కనిపిస్తుంది. హోటళ్లు వెలుస్తాయి. టెంట్లు, తాత్కాలిక బస, మెడికల్ క్యాంపుల ఏర్పాట్లు ఉంటాయి. అమరనాథ్ యాత్రను భగ్నం చేయడమే ఉగ్రమూకల లక్ష్యం. అందుకే బైసరన్ లోయలో దాడికి తెగబడ్డారన్నది విశ్లేషకుల అంచనా.
దాడి ఎప్పుడు? ఎలా? :
మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో టూరిస్టులు జంటలు జంటలుగా అక్కడ సేద తీరుతున్నారు. ఆ సమయంలోనే ఉగ్రవాదులు చొరబడ్డారు.దాదాపు 2.30 గంటలకు ఆరుగురు విదేశీ ఉగ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో వచ్చి టూరిస్టులను పేర్లడిగి ఇస్లామిక్ ప్రవచనాలు వల్లించమని అడిగారు. చెప్పలేని వారిని పాయింట్ బ్లాంక్ రేంజ్లో నుదుటిపై కాల్చి చంపారు. ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో సరదాగా కలియతిరుగుతున్న 40 మంది టూరిస్టులను ఉగ్రమూక ముందు టార్గెట్ చేసింది. వచ్చీ రాగానే విచక్షణా రహితంగా కాల్పులతో విరుచుకు పడిన ఉగ్రవాదులు భీతావహవాతావరణం సృష్టించారు. కొందరిని పేర్లడిగి, ఇస్లామిక్ వచనాలను పలకమని ఆదేశించారు. ముస్లింలు కాని వారిని, హిందువులను మాత్రం నిర్దాక్షిణ్యంగా నుదుటిపై కాల్చి చంపేశారు. ఆర్మీ దుస్తుల్లో రావడంతో వారిని ముష్కర మూకలని గుర్తు పట్టలేక పోయారు టూరిస్టులు. దూరంగా కాల్పుల శబ్దం వినగానే టూరిస్టులంతా ప్రాణ భయంతో తలో దిక్కుకూ పారిపోయే ప్రయత్నం చేశారు. మరికొందరు సమీపంలో పొదల మాటున దాక్కున్నారు. వారికి నిరంతరాయంగా కొంత సేపు కాల్పుల మోత వినిపించిందని చెబుతున్నారు. పైగా టూరిస్టులను వారి ఐడీ డాక్యుమెంట్లు, ఇతర ధృవ పత్రాలు చూపమని అడిగి, వాటిని పరిశీలించిన తర్వాతే ఈ పాశవిక దాడి చేశారు.
వ్యూహాత్మక దాడి..
బైసరన్ లోయ వ్యూహాత్మక దాడికి అనువైన ప్రాంతం. ఎందుకంటే ఈ ప్రాంతానికి సరై రవాణా లేదు. కనీసం టూ వీలర్స్ వెళ్లే వీలు కూడా ఉండదు. సాధారణంగా పర్యాటకులు మధ్యాహ్నం మూడు, నాలుగు దాటాక వెనుదిరిగి వచ్చేయాల్సిందే. నడవ లేని వారు గుర్రాలపై ప్రయాణిస్తారు. వాహన సౌకర్యం లేని ఈ ప్రాంతంలో దాడి జరిపితే టూరిస్టులు తప్పించుకోలేరు. పైన్ వృక్షాల మాటు నుంచి హటాత్తుగా దాడి జరిపిన ఉగ్రవాదులకు అది తప్పించుకోడానికి అనువైన ప్రాంతం. బాధితులకు సహాయ, సహకారాలు కూడా వేగంగా అందే వీలుండదు. తద్వారా ప్రాణనష్టం ఎక్కువ కలిగించవచ్చు. ఇది తమ అధీనంలో ఉన్న ప్రాంతమని.. ఇతరులను ఇక్కడ అనుమతించబోమని ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చినట్లు ఉంటుంది. మోడీ ప్రభుత్వానికి ఒక సవాల్ విసిరినట్లుంటుందని ఉగ్రమూకలు తెగబడి ఉంటాయని జమ్మూ కశ్మీర్ భద్రతా దళాల పర్యవేక్షణాధికారులు అంటున్నారు.ఈ ప్రాంత చరిత్రలోనే ఇది అత్యంత ఘోరమైన, ప్రమాదకరమైన దాడిగా పెహల్గామ్ దాడిని పేర్కొన వచ్చని కౌంటర్ టెర్రరిజం నిపుణులు అంటున్నారు. కశ్మీర్ టూరిజం పరిశ్రమను దెబ్బ తీయడమే లక్ష్యంగా ఈ దాడి జరిపారని, తద్వారా కశ్మీర్‌ను అంతర్జాతీయ దృష్టికి తీసుకు రావాలన్న ఉద్దేశంతో పాకిస్థాన్ ప్రేరిత ఉగ్రవాదులే ఈదాడులకు తెగబడ్డారని భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
దాడి మాపనే : టిఆర్ఎఫ్
ఉగ్రదాడి తమ పనేనంటూ ది రెసిస్టన్స్ ఫ్రంట్ అనే ఉగ్రసంస్థ ప్రకటించుకుంది. ఈ సంస్థ పాకిస్థాన్ ప్రేరిత లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తుంటుంది. ఈ ప్రాంతాన్ని తమ సొంత గడ్డగా భావిస్తున్న ఈ ఉగ్ర సంస్థ కేంద్రం టూరిస్టులను ఇక్కడకు అనుమతించడంపై తీవ్ర వ్యతిరేకతతో ఉంది. ఈ ప్రాంతానికి టూరిస్టులుగా వచ్చినా సరే దీనిని చొరబాటు గానే భావిస్తామని ఆ సంస్థ చెబుతోంది.
కశ్మీర్ టూరిజానికి ఎదురుదెబ్బ :
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌ను పూర్తి స్థాయి పర్యాటక ప్రాంతంగా ప్రకటించిన కేంద్రం టూరిస్టుల రాకపోకలను అనుమతించింది. భూతల స్వర్గం కశ్మీర్‌ను మంచి టూరిస్టు సెంటర్‌గా అభివృద్ధి చేయాలన్న తలంపుతో ఉంది. అది నచ్చని ఇటువంటి ఉగ్రమూకలు భౌగోళిక సరిహద్దులను మార్చి టూరిస్టులను అనుమతిస్తున్నారంటూ మండిపడుతోంది. తాజా దాడి కూడా ఆ నేపథ్యంలో జరిగిందేననే వాదనలు వినిపిస్తున్నా..అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారమూ వెల్లడి కాలేదు. కశ్మీర్‌ను పూర్తిస్థాయి టూరిజం సెంటర్‌గా అభివృద్ధి చేయాలన్న మోడీ ప్రభుత్వం అందుకు తగ్గ నిర్ణయాలు తీసుకుంటోంది. కానీ, ఉగ్రమూకలు ఆ ప్రయత్నాలకు తూట్లు పొడుస్తున్నాయి. మోడీ సౌదీ అరేబియా పర్యటనలో ఉండగా, అమెరికా ఉపాధ్యక్షుడు జే.డి.వాన్స్ మన దేశంలో పర్యటిస్తున్న సమయంలో ఉగ్రమూకలు అదను చూసి ఈ దాడికి పాల్పడ్డాయి.