27.4 C
Hyderabad
Wednesday, June 24, 2026

Live Video

spot_img

కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్ర దాడి… ఉలిక్కి పడ్డ దేశం

  • ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది మృతి… పలువురికి గాయాలు
  • మృతుల్లో ఇద్దరు విదేశీయులు, ఒక నేవీ అధికారి
  • కాల్పుల్లో మృతి చెందిన విశాఖ వాసి చంద్రమౌళి
  • మాపనే అని లష్కరే తోయిబా అనుబంధ సంస్ధ టీఆర్‌ఎఫ్‌
  • సౌదీ పర్యటన రద్దు చేసుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని
  • హుటాహుటీన కాశ్మీర్‌ చేరుకున్న అమిత్‌ షా
  • తీవ్రంగా ఖండించిన ట్రంప్‌, పుతిన్‌, జేడీవాన్స్‌
  • అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్‌ పర్యటిస్తుండగానే ఉగ్ర కాల్పులు

కాశ్మీర్‌ లోయపై మళ్లీ ఉగ్రవాదులు విరుచుకు పడ్డారు. పర్యాటకులను అమితంగా ఆకర్షిచే, మినీ స్విట్జర్లాండ్‌ గా పేరుగాంచిన పహల్గాంలో పరిధిలోని బైసారన్‌ దగ్గర మంగళవారం ఆర్మీ దుస్తుల్లో ముసుగు ధరించిన ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది మృతి చెందగా అందులో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. ఇద్దరిలో ఒకరు నేపాల్‌ దేశస్ధుడు కాగా మరోకరు యూఏఈకి చెందిన వ్యక్తి. ఈ కాల్పుల్లో మరో 20 మందికి పైగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో స్థానికులతో పాటు ఏపీ, తెలంగాణ, మహరాష్ట్ర, కర్నాటక, గుజరాత్‌, యూపీ, బీహార్‌ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఉన్నారు.

పహల్గాం కాల్పులు మా పనే అని ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌) ప్రకటించుకుంది. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్ధ ప్రోద్బలంతో జమ్మూ కాశ్మీర్‌ లో ఆర్టికల్‌ 370 రద్దు చేసిన తరువాత టీఆర్‌ఎఫ్‌ ఏర్పడింది. గతంలో లష్కరే తోయిబా కమాండర్‌ గా పనిచేసిన షేక్‌ సజ్జాద్‌ గుల్‌ టీఆర్‌ఎప్‌ ని స్ధాపించాడు. ఇతను కాశ్మీర్‌ ఉగ్రవాది. ఇతని ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా ఉపా చట్టం కింద సజ్జాద్‌ గుల్‌ ని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. మంగళవారం టీఆర్‌ఎఫ్‌ ఉగ్రవాదులు విచక్షనా రహితంగా జరిపిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మృత్యువాత పడ్డారు. వెంటాడి వేటాడి అత్యంత అమానుషంగా ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. హైదరాబాద్‌ కు చెందిన కేంద్రప్రభుత్వ ఉద్యోగి మనీష్‌ రంజన్‌ కుటుంబంతో కలసి కాశ్మీర్‌ విహార యాత్రకు వెళ్లారు. కోఠీలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్‌ బ్యూరో కార్యాలయంలో పనిచేస్తున్న మనీష్‌ రంజన్‌ ని ఐడీ కార్డు చూసి మరీ కుటుంబ సభ్యుల ముందే కాల్చి చంపారు. బీహార్‌ రాష్ట్రానికి చెందిన మనీష్‌ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌ లో నివాసం ఉంటున్నారు.

అలాగే విశాఖపట్నం వాసి చంద్రమౌళిని కూడా వెంటాడి మరీ చంపేశారు. ఓ జాతీయ బ్యాంకులో పని చేసి పదవీ విరమన చెందిన చంద్రమౌళి తనని చంపొద్దని వేడుకుంటూ ఉగ్రవాదుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పారిపోతుండగా వెంటాడి కాల్చి చంపారు. ఈ దాడిలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూధన్‌ కూడా ఉగ్రవాదుల దాడిలో మృతి చెందారు. ఇతను బెంగళూరులో సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్‌ గా పని చేస్తున్నారు. మరో హృదయ విదారకరమైన సంఘటన భార్య ముందే భర్తను కాల్చి చంపడం. హర్యానాకు చెందిన నేవీ అధికారి వినయ్‌ నర్వాల్‌ భార్యతో కాశ్మీర్‌ పర్యటనకు వెళ్లారు. ఆయన్ను మతం అడిగి మరీ కాల్చి చంపేశారు. తమకు పెళ్ళి అయి కేవలం ఆరు రోజులే అయ్యిందని ఒక ఉగ్రవాది మాదగ్గరకు వచ్చి మీరు ముస్లీంలు కాదు కదా అని అడిగి వెంటనే నా భర్త తలకి గురిపెట్టి కాల్చి వెళ్లిపోయాడని ఆ నవ వధువు కన్నీరుమున్నీరు అయ్యింది.

ఉగ్రవాదుల దాడి సంఘటన తెలిసిన వెంటనే హోమంత్రి అమిత్‌ షా హుటాహుటీన బయలుదేరి శ్రీనగర్‌ చేరుకున్నారు. దాడి పరిస్ధితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇక సౌదీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ తన పర్యటనను రద్దు చేసుకుని బుధవారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌, ఇతర ఉన్నాతాధికారులతో ఎయిర్‌ పోర్టులోనే ప్రధాని మోడీ నిన్న జరిగిన ఉగ్రదాడిపై సమీక్ష నిర్వహించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com