36.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

ఈ సిగరెట్స్…వాట్సాప్ గ్రూప్

హైదరాబాద్ నగరంలో కొత్త దందా ఊపందుకుంది. హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేందుకు.. మాదకద్రవ్యాల సరఫరాపై ప్రభుత్వం, పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ.. కేటుగాళ్లు కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు. తాజాగా.. నగరంలో నిషేధిత ఈ-సిగరెట్లను విక్రయిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సాదిక్ అలాని, అనిల్ అలాని అనే ఇద్దరు సోదరులు ‘ఎస్ఐడీ’ పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, దాని ద్వారా ఈ దందా గుట్టుగా సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఏకంగా 500 మందికి పైగా సభ్యులను గ్రూప్‌లో చేర్చి.. గుట్టుచప్పుడు కాకుండా దందా కొనసాగిస్తున్నట్టు బయటపడింది. గత కొన్ని రోజులుగా.. ఈ ముఠా కార్యకలాపాలపై నిఘా ఉంచిన పోలీసులు.. కొత్త స్టాక్ తెప్పించినప్పుడల్లా వాట్సాప్ గ్రూప్‌లో ప్రకటనలు పెట్టేవారని గుర్తించారు.

కొనుగోలుదారులు నేరుగా వారికి కాకుండా.. వారి కుటుంబ సభ్యుల ఖాతాలకు యూపీఐ, వాలెట్, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ల ద్వారా డబ్బులు పంపేవారు. ఈ వ్యవహారంలో న్యూఢిల్లీకి చెందిన అమిత్, ముంబైకి చెందిన వసీం అనే వ్యక్తులు ప్రధాన సరఫరాదారులుగా వ్యవహరిస్తున్నారని తేలింది. పెద్ద మొత్తంలో నగదు లావాదేవీల కోసం హవాలా మార్గాలను ఉపయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డెలివరీ కోసం ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ.. ర్యాపిడో, ఉబర్ వంటి రైడ్ షేరింగ్ సర్వీసులతో పాటు డీటీడీసీ కొరియర్ ద్వారా ఈ-సిగరెట్లను సరఫరా చేస్తున్నట్టు తేలింది. ఈ ముఠాకు ఖాతాదారులుగా ఉన్న 13 మంది విద్యార్థులను పోలీసులు గుర్తించగా.. ట్రాన్సాక్షన్ల ఆధారంగా 400 మందికి పైగా వినియోగదారులను గుర్తించే పనిలో పడ్డారు.

పోలీసులు దాడి చేసి 7 కాటన్ బాక్సుల్లో ఉన్న 1217 పీస్ల ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా.. నిందితుల వద్ద నుంచి భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 18,440,225 అమెరికన్ డాలర్లు, 100 కెనడియన్ డాలర్లు ఉన్నట్టు తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో (టీజీ న్యాబ్)కు ప్రత్యేక అధికారాలు ఇవ్వటంతో పాటు.. అవసరమైన సిబ్బంది, అత్యాధునిక వాహనాలను సమకూర్చింది. దీని ఫలితంగా టీజీ న్యాబ్ అధికారులు నగరంలోకి వివిధ మార్గాల ద్వారా మాదకద్రవ్యాలు ప్రవేశిస్తున్న సమాచారాన్ని ముందే పసిగట్టి, నిందితులను పట్టుకుంటున్నారు.

ఈ-సిగరెట్ అనేది సాధారణ సిగరెట్ లేదా పెన్ను ఆకారంలో ఉండే ఒక ఎలక్ట్రానిక్ పరికరం. ఇందులో పొగాకు ఉండదు. అయితే, వివిధ రకాల ఫ్లేవర్లతో కూడిన నికోటిన్ ద్రావకాన్ని ఉపయోగిస్తారు. వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న ప్రకారం.. ఈ ద్రావకంలో వినియోగించే రసాయనాలు ఆరోగ్యానికి హానికరం. ఈ-సిగరెట్ తాగే సమయంలో, నికోటిన్ ద్రావకం వేడి చేయబడి పొగ రూపంలో ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రకటించిన ప్రకారం.. ఈ-సిగరెట్ల వినియోగంతో క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు రావడంతో పాటు డీఎన్ఏ దెబ్బతినే ప్రమాదం ఉంది. మెదడు పనితీరు మందగించడం, కండరాల సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ-సిగరెట్లని అరికట్టడానికి పోలీసులు మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com