విశాఖ నగరంలో భూములు బంగారం కంటే విలువైనవిగా మారాయి. ఇప్పుడు విశాఖ అంటే.. కేవలం అక్కడే ఏర్పడిన నగరం కాదు. అన్ని రాష్ట్రాల సంస్కృతులకు నిలయంగా మారిందిప్పుడు. ఇప్పటికిప్పుడే కాదు.. విశాఖ నగరంలో 1990వ దశకంలో.. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా విశాఖలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉండేది. వైజాగ్‌లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పలు సంస్థలతో పాటు సముద్ర తీర ప్రాంతం ఉండటం, నేవీ సెంటర్ ఉండటంతో పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండేది. దీంతో, ఉత్తరాంధ్రలో ఉన్న విశాఖపై ఆంధ్రప్రదేశ్ వాసుల కళ్లు పడ్డాయి. దీంతో, అనేక మంది అక్కడకు వెళ్లి సెటలయిపోయారు. భూములు కొనుగోలు చేసి భారీగానే ఆర్జించారు.
కోస్తాంధ్ర, రాయలసీమ నుంచి వెళ్లిన వాళ్లు.. విశాఖలో స్థిరపడిన తర్వతే తర్వాతే విశాఖలో ఒకరకమైన వాతావరణం నెలకొందన్న వాదనను ఎవరూ కాదనడం లేదు. అయితే, కొన్ని దశాబ్దాలుగా విశాఖ నగరం విస్తరించింది. ఇప్పటికే విశాఖ, విజయనగరం దాదాపు కలిసి పోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కారు చౌకగా ఒక ఊరు పేరు తెలియని సంస్థకు 59 రూపాయలకే అరవై ఎకరాల భూములు కట్టబెట్టడం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి ది వైర్ పరిశోధాత్మక కథనంలోనూ అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. సాఫ్ట్ వేర్ కంపెనీ అని చెప్పుకునే ఉర్సు కంపెనీ 2025లోనే రిజిస్టర్ అయింది. అయితే, అప్పుడే ఈ కంపెనీకి ఇలా భూములు ధారాదత్తం చేశారని తెలిసి అందరూ అవాక్కవుతున్నారు.
దీనిపై విశాఖలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సాఫ్ట్ వేర్ కంపెనీలను స్థాపించుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వవచ్చు. అంతే తప్ప ఏకంగా భూములను కట్టబెట్టడమేంటన్న ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి ప్రభుత్వమే హైటెక్ సిటీ లేదా మైండ్ స్సేస్ వంటి నిర్మాణాలు చేపట్టి నామమాత్రపు అద్దెకు లీజుకు ఇచ్చి పరిశ్రమలను, ఐటీ రంగాన్ని ప్రోత్సహించేందుకు అవకాశం ఉంది. కానీ, ఇలా భూములను విక్రయించుకుంటూ పోతే ఎలా అన్న ప్రశ్నకు మాత్రం ఎవరూ సమాధానం చెప్పలేక పోతున్నారు.
అసలు ఉర్సా అనే కంపెనీ పుట్టుక వివరాలు వింటేనే ఆశ్చర్యం కలుగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిజిస్టర్ అయిన కంపెనీ ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు పెడుతుంది? అదేమైనా కార్పొరేట్ కంపెనీయా అంటే అదీ కూడా కాదంటున్నారు. ఉర్సా అనే పేరు కూడా వినని కంపెనీకి కాపులుప్పలపాడులో 56 ఎకరాలు, టీసీఎస్ కు ఇచ్చిన చోట3.6 ఎకరాలు కేటాయించింది ఏపీ ప్రభుత్వం. ఉర్సా క్లస్టర్ కంపెనీకి అప్పనంగా భూముల కేటాయించడంపై ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఇద్దరు డైరెక్టర్లతో ప్రారంభమైన ఈ కంపెనీ కేవలం పది లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైందని ది వైర్ ఇన్విస్టిగేషన్‌లో వెల్లడయింది. అంతేకాదు.. ఈ కంపెనీలో ఉన్న ఇద్దరు డైరెక్టర్లు సతీష్ అబ్బూరి, కౌశిక్ పెందుర్తి అమెరికాలో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. అమెరికాలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తూ.. వాళ్లిద్దరూ ఇక్కడ ఐటీ పరిశ్రమను నెలకొల్పేందుకు ముందుకు వచ్చారని ది వైర్ కథనం వెల్లడించింది. ఈ కంపెనీ పేరుతో ఇప్పటి వరకూ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఆఫీసు కూడా లేదని తెలుస్తోంది. కేవలం ఏదో ఒక ఇంటి అడ్రస్ ఇచ్చి భూములను కారు చౌకగా కొట్టేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం కంపెనీకి ఫోన్ నెంబరు కూడా లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కనీసం ఆఫీస్ అడ్రస్ కూడా లేకపోవడం సందేహాలను పెంచుతోంది. రెసిడెన్షియల్ ఫ్లాట్ అడ్రస్ పెట్టి స్థలాలను విశాఖలో తీసుకునేందుకు ప్లాన్ చేశారని ది వైర్ కథనం ప్రచురించింది. ఈ కంపెనీ వయసు కేవలం రెండు నెలలు మాత్రమే. ఏపీ, తెలంగాణలలో ఇప్పటి వరకూ ఎలాంటి ఐటీ కార్యకలాపాలు నిర్వహించిన దాఖలాలు లేవని తేలింది. అయితే ఇదేకంపెనీ తెలంగాణ ప్రభుత్వంతోనూ ఐదు వేల కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకోవడం కూడా చర్చనీయాంశమైంది. ఉర్సా కంపెనీకి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన భూమి విలువ వెయ్యికోట్లకు పైగానే ఉంటుందని చెబుతున్నారు.ఇదే సమయంలో 2,500 మందికి మాత్రమే ఉపాధి అవకాశాలు ఇవ్వనుందని కూడా ప్రభుత్వం చెబుతుంది.