- రాష్ట్రపతికి రిజర్వ్ చేసిన కర్నాటక గవర్నర్
- రాజ్యంగ సమస్యలు తలెత్తకుండానే ఈ చర్య అంటున్న రాజ్ భవన్
- తావర్ చంద్ గెహ్లాట్ నిర్ణయం మరో సంక్షోభానికి దారితీస్తుందా?
కర్ణాటక గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించుకున్న బిల్లును రాష్ట్రపతికి రిజర్వ్ చేశారు గెహ్లాట్. ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన ఈ బిల్లుల వ్యవహారం.. ఇప్పుడు కర్ణాటకలో మొదలయ్యాయా? అనే చర్చ ఇప్పటికే పొలిటికల్ సర్కిళ్లలో ప్రారంభమయ్యింది.
కర్ణాటక అసెంబ్లీ ఆమోదించిన ప్రభుత్వ ప్రాజెక్టుల్లో ముస్లిం కాంట్రాక్టర్లకు 4 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును మరిన్ని రాజ్యాంగ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్రపతి ఆమోదానికి రిజర్వ్ చేశారు గెహ్లాట్. హరియాణాలో నిర్వహించిన ఓ సభలో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. మతం ఆధారంగా టెండర్ల రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను లాగేసుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు వెలువడిన రెండు రోజులకే బిల్లును రిజర్వ్ చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వ కాంట్రాక్టులలో ముస్లింలకు 4% రిజర్వేషన్లను కల్పించేందుకు ఓ బిల్లును రూపొందించింది కర్ణాటక ప్రభుత్వం. మార్చి 14న ఈ బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే నెల అంటే మార్చి 18న అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది. దీని ప్రకారం 2 కోట్ల వరకు విలువైన సివిల్ పనులు, కోటి వరకు వస్తువులు, సేవల కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం కాంట్రాక్టులు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది.
ఈ బిల్లును మొదటి నుంచి బీజేపీ వ్యతిరేకిస్తూ వస్తోంది. కానీ ఈ బిల్లుపై మాట్లాడుతూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కోటా ఉద్యోగాలకు, విద్యకు కాదని.. ఇది కాంట్రాక్టర్ల కోసం మాత్రమే అని తెలిపారు. కోటి విలువైన ప్రభుత్వ ప్రాజెక్టులకు బిడ్డింగ్ వేయడానికి ఉద్దేశించింది మాత్రమే అన్నారు. ఇది ముస్లింలకు మాత్రమే కాకుండా అన్ని మైనారిటీ, వెనకబడిన తరగతులకు కూడా వర్తిస్తుందన్నారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లు కారణంగా కర్ణాటకలో పొలిటికల్ వార్ కొనసాగుతోంది. ఈ బిల్లుపై గవర్నర్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. మతం ఆధారంగా రిజర్వేషన్లను కల్పించడం రాజ్యాంగానికి విరుద్ధమని ఇది సమానత్వాన్ని ఉల్లంఘిస్తోందన్నారు. మరి రాష్ట్రపతి ఈ బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. ఇప్పటికే మూడు నెలల కాలంలో బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే కోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.