-
ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం
-
హెలికాప్టర్‌లో అమరావతికి మోదీ
-
రాజధానికి శంకుస్థాపన, బహిరంగసభలో ప్రసంగం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారైంది. మే 2వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అమరావతిలో పునర్నిర్మాణ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని ప్రధాన అతిథిగా పాల్గొంటున్నారు.
సభా వేదిక ఏర్పాట్లు :
ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిరంగ సభ కోసం అమరావతి సచివాలయం వెనుక ప్రత్యేక వేదిక ఏర్పాటుచేస్తున్నారు. ఈ సభకు ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచే కాకుండా.. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు హాజరయ్యేలా ప్రణాళిక రూపొందించారు. సుమారు 5 లక్షల మంది ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు సభా ప్రాంగణానికి సులభంగా చేరుకునేలా 9 ప్రధాన రూట్లను గుర్తించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
భద్రతా ఏర్పాట్లు:
ప్రధాని పర్యటన నేపథ్యంలో కేంద్ర ఎస్పీజీ బృందం ఇప్పటికే రాష్ట్రానికి చేరుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. పర్యటన సమయానికి అత్యున్నత స్థాయి భద్రత కల్పించేందుకు పోలీసులు, ఇతర విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. పర్యటన ఏర్పాట్లను సీఎస్ విజయానంద్‌తో కలిసి నోడల్ అధికారి వీరపాండ్యన్ పర్యవేక్షిస్తున్నారు.
అమరావతి నిర్మాణాల పునఃప్రారంభం:
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమరావతిలో నిర్మాణాల కోసం టెండర్లు ఖరారు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని చేతుల మీదుగా ఈ పనులను ప్రారంభించాలని భావించి ఇటీవల ఢిల్లీ వెళ్లి మోదీని ఆహ్వానించారు. ప్రధాని సానుకూలంగా స్పందించడంతో పర్యటన షెడ్యూల్ ఖరారయ్యింది.