అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త సుంకాల ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా చైనా ఉత్పత్తులపై భారీగా పెంచిన టారిఫ్‌లు, భారత తయారీ రంగానికి సానుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా భారత్‌ను గ్లోబల్ తయారీ కేంద్రంగా మార్చే దిశగా ఈ పరిణామాలు కొనసాగుతున్నాయి.
చైనాపై 104%, భారత్‌పై 26% — ధరల తేడా భారత్‌కు అనుకూలం :
ట్రంప్ ప్రభుత్వం చైనాపై 104% వరకూ భారీ సుంకాలు విధించగా, భారత్‌పై కేవలం 26% మాత్రమే టారిఫ్‌లు విధించడం గమనార్హం. దీని వలన భారత్‌లో తయారయ్యే ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో గణనీయంగా పోటీదారులుగా నిలుస్తున్నాయి. ఉదాహరణకు, ఒక ఐఫోన్ తయారీ ఖర్చు 450 డాలర్లు కాగా, చైనాలో తయారైతే ఆ ఖర్చుతోపాటు సుంకాలతో ధర 918 డాలర్లకు చేరుతుంది. అదే భారత్‌లో తయారైన ఐఫోన్ ధర 567 డాలర్లుగా ఉంటుంది.
భారత్‌లో ఐఫోన్ తయారీ వేగం పెంచిన ఆపిల్ :
ఇటీవల భారత్‌లో తయారైన ఐఫోన్లతో మూడు కార్గో విమానాలు ఒకేసారి అమెరికాకు బయలుదేరిన వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఆపిల్ కంపెనీ ఇప్పటికే భారత్‌లో తన ఉత్పత్తిని 10శాతం నుంచి 15 శాతానికి పెంచగా, ఈ యేడాది చివరికి దానిని 25శాతానికి పెంచే లక్ష్యం నిర్దేశించుకుంది.
కోవిడ్ అనంతరం ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలు చైనాపై ఆధార పడటాన్ని తగ్గించుకునేందుకు ‘చైనా+1’ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. అయితే, గతంలో భారత్ ఈ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోలేకపోయింది. ఇప్పుడు ట్రంప్ విధించిన సుంకాల కారణంగా మరోసారి భారత్‌కు ఆ అవకాశాలు తిరిగి దక్కే అవకాశం ఉంది.
అవకాశాలతో పాటు సవాళ్లు :
భారత్‌కు లభిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే కొన్ని కీలకమైన చర్యలు అవసరం మౌలిక సదుపాయాలను పెంపొందించుకోవాలి. తయారీకి అవసరమైన విద్యుత్, రవాణా, లాజిస్టిక్స్‌లో లోటు లేకుండా చూసుకోవాలి. అలాగే, బిజినెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో భాగంగా పరిపాలనా ఆటంకాలను తగ్గించి, విదేశీ పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించాలి. తయారీ రంగం డిమాండ్‌కు అనుగుణంగా అవసరమైన నైపుణ్యాలను కల్పించే శిక్షణా కార్యక్రమాలను విస్తరించాలి. అలాగే, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ లాంటి పథకాలను విస్తృతంగా అమలు చేయాలి.
మొత్తానికి ట్రంప్ విధించిన టారిఫ్‌లు భారత తయారీ రంగానికి అరుదైన అవకాశాన్ని తెచ్చిపెట్టాయి. అయితే, ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలంటే ప్రభుత్వం, పరిశ్రమలు, విదేశీ పెట్టుబడిదారులు సమన్వయంతో ముందుకెళ్లాలి. స్థిరమైన ఆర్థిక విధానాలు, ప్రణాళికాబద్ధమైన చర్యలు భారత్‌ను గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చగలుగుతాయి. ఈ దిశగా వేసే ప్రతి అడుగు, దేశ ఆర్థిక భవిష్యత్తును నిర్వచిస్తుందని క్లారిటీగా చెప్పుకోవచ్చు.