- స్పష్టత ఇచ్చిన రెవెన్యూ శాఖ
కంచ గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల భూమిపై తుది స్పష్టత వచ్చింది. రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు, ఆ భూమి మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.
నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం, కంచ గచ్చిబౌలి సహా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకీ కేటాయించిన భూములన్నీ అసలు ప్రభుత్వ రికార్డులలో ప్రభుత్వ భూములుగానే నమోదయ్యాయి. వర్సిటీ పేరుతో ఎలాంటి పట్టాలు లేవని వివరించారు.
సుమారు 50 ఏళ్ల క్రితం, అప్పటి ప్రభుత్వం “అడ్వాన్స్ పొజిషన్” పద్ధతిలో యూనివర్శిటీకి 2,375 ఎకరాల భూమిని అప్పగించింది. కాలక్రమంలో వివిధ అవసరాల కోసం కొన్ని భూములను ప్రభుత్వం తిరిగి తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు, హెచ్‌సీయూ అధికారులకు ప్రతిసారీ సమాచారం ఇచ్చినట్టు పేర్కొన్నారు.
2002–2003లో కీలక పరిణామం:
అయితే, 2002-2003 మధ్య కాలంలో ప్రభుత్వం, క్రీడా అభివృద్ధి పేరుతో 534 ఎకరాలు తిరిగి తీసుకుంది. ఇందులో ఐఎంజీ భారత్‌కి 400 ఎకరాలు, ప్రస్తుతం టీఎన్‌జీవోకి 134 ఎకరాలు కేటాయించారు. అయితే, ఐఎంజీ సంస్థ ఆ స్థలాల్లో ప్రభుత్వ ఒప్పందం మేరకు ఎలాంటి పురోగతి లేకపోవడంతో.. 2006లో ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ 400 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. అదే సమయంలో హెచ్‌సీయూకి గోపన్‌పల్లిలో 397 ఎకరాలు తిరిగి కేటాయించామని, వాటికి సంబంధించిన ధ్రువపత్రాలు కూడా నివేదికలో జోడించామని అధికారులు తెలిపారు.
కోర్టుల తీర్పు:
అయితే, తమకు కేటాయించిన భూమిని ప్రభుత్వం తిరిగి తీసుకోవడంపై ఐఎంజీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఐఎంజీ పిటిషన్‌పై హైకోర్టు మొదట స్టే ఇచ్చినప్పటికీ, 2024 మార్చిలో హైకోర్టు, జూన్‌లో సుప్రీంకోర్టు రెండు న్యాయస్థానాలూ ఆ భూములు ప్రభుత్వానివేనని తేల్చి చెప్పాయి. అప్పటి నుంచి ఎవరూ ఆ భూమిని పట్టించుకోకపోవడంతో అవి నిర్లక్ష్యంగా మారాయని అధికారులు తెలిపారు.
ప్రస్తుత పరిస్థితి:
ఈ భూ వివాద పరిష్కారానికి ప్రత్యేక దృష్టితో ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముఖ్య కార్యదర్శి శాంతికుమారి నేతృత్వంలో ఉన్నత స్థాయి బృందం ఢిల్లీకి వెళ్లి, సుప్రీంకోర్టులో 16వ తేదీన జరిగే విచారణకు సంబంధించి అవసరమైన కౌంటర్ అఫిడవిట్ తయారీపై సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు.
మరోవైపు.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం క్షేత్రస్థాయిలో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పర్యటించింది. పర్యావరణ నష్టం, చెట్ల నరికివేత, వన్యప్రాణుల సంచారం లాంటి అంశాలను అధ్యయనం చేసింది.వర్సిటీ విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైంది. వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించింది.
కౌంటర్ అఫిడవిట్ తయారీపై ఫోకస్:
సీఎస్ శాంతికుమారి ఇప్పటికే రెవెన్యూ, అటవీ, పరిశ్రమల శాఖలతో పలుమార్లు చర్చలు జరిపారు. భూములపై హెచ్‌సీయూకి యాజమాన్య హక్కులేమీ లేవని ధృవీకరిస్తూ అఫిడవిట్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే, గతంలో తీసుకున్న నిర్ణయాల పరంగా ఆ భూములకు ప్రభుత్వమే యజమాని అని స్పష్టం చేయనున్నారు. భూములపై పర్యావరణ అంశాలు, చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకుంటామని అఫిడవిట్‌లో పేర్కొనే అవకాశం ఉంది. ఈ నెల 16వ తేదీన సుప్రీంకోర్టు విచారణలో ప్రభుత్వపక్షాన వాదనను బలంగా వినిపించడంపై దృష్టి పెడుతున్నారు. అన్ని వివరాలను స్పష్టంగా సమర్పించి, భూమిపై తమ హక్కును నిలబెట్టుకోవాలని, అందరికీ సుప్రీంకోర్టు ద్వారా స్పష్టత ఇప్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.