29 C
Hyderabad
Tuesday, June 30, 2026

Live Video

spot_img

రాష్ట్రాలకు వెయ్యి ఏనుగుల బలం ఇచ్చిన సుప్రీం కోర్టు

  • రాజ్యాంగ వ్యవస్థలో కీలకమైన తీర్పు

  • గవర్నర్‌లు రాజకీయ ప్రోద్భలం వదిలేయాలని వ్యాఖ్య

  • శాసన వ్యవస్థను గౌరవించాలని సూచన

  • రాష్ట్ర ప్రభుత్వాలకు బిగ్‌ రిలీఫ్‌ ఇచ్చిన న్యాయస్థానం

మన దేశం ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రజలే అధిపతులు. ప్రజలచేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలతో కూడినదే రాష్ట్ర అసెంబ్లీ. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను రాజ్యాంగబద్ధంగా ఆమోదించాల్సిన గవర్నర్లు, ఇటీవల రాజకీయ ప్రేరణతో వ్యవహరిస్తూ రాజ్యాంగేతర శక్తుల్లా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవలి తమిళనాడు ఘటన దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వివరంగా చెప్పాలంటే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది.

తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్ ఆర్‌ఎన్‌ రవికుమార్ ఆమోదించకుండా వాయిదా వేయడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ నిరవధికంగా పెండింగ్‌లో ఉంచే హక్కు లేదని తేల్చింది. ఈ సందర్భంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 200ను ప్రస్తావించిన కోర్టు, గవర్నర్ తీసుకునే నిర్ణయాలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అనుగుణంగా ఉండాలన్నది స్పష్టం చేసింది.

తమిళనాడు గవర్నర్ 10 బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి రిజర్వ్ చేయడం న్యాయ సమ్మతం కాదని, ఇది ఏకపక్ష నిర్ణయమని, అందుకే ఆ చర్యను తప్పుపడుతున్నామని జస్టిస్ జె.బి. పర్దీవాలా, జస్టిస్ ఆర్‌. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. పెండింగ్‌లో ఉన్న ఆ 10 బిల్లులు గవర్నర్ ఆమోదించినట్లే పరిగణించాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. అసెంబ్లీ మళ్లీ ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్ రాష్ట్రపతికి పంపించే అధికారం లేదని తీర్పు వెల్లడించింది.

వివాదాస్పదంగా గవర్నర్‌ల తీరు :

దేశంలోని పలు రాష్ట్రాల్లో గవర్నర్ల తీరు రోజు రోజుకీ వివాదాస్పదంగా మారుతోంది. ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లు తమ అధికారాలను మించి.. రాజకీయ ప్రయోజనాల కోసం తమ విధులను వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అప్పటి గవర్నర్ మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. అలాగే తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఝార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లోనూ గవర్నర్లు, ప్రభుత్వాల మధ్య విభేదాలు తలెత్తాయి. అంతకుమించి మొన్నటిదాకా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వానికి, లెఫ్టినెంట్‌ జనరల్‌కు టగ్‌ ఆఫ్ వార్‌ నడిచింది.

తెలంగాణలో రాజ్‌భవన్‌తో ప్రభుత్వం వార్‌ :

ఇక, తెలంగాణలోనూ కేసీఆర్, తమిళిసై మధ్య తలెత్తిన విభేదాలు కూడా జగద్విదితమే. దాదాపు యేడాదిన్నర కాలం పాటు.. తెలంగాణలో గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. గవర్నర్‌ పాల్గొన్న సమావేశంలో సీఎం పాల్గొనలేదు. అంతెందుకు..? చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా, సంప్రదాయానికి విరుద్ధంగా అసెంబ్లీలో గవర్నర్‌ బడ్జెట్‌ ప్రసంగం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమోదించుకుందంటే వివాదం ఏ స్థాయికి వెళ్లిందో అర్థంచేసుకోవచ్చు. అంతేకాదు.. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల జాబితాను కేబినెట్‌ ఆమోదించి పంపితే.. అప్పటి గవర్నర్‌ తమిళిసై.. గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకుండా.. తనవద్దే పెండింగ్‌లో పెట్టుకున్నారు. ఇలాంటి సంఘటనలు, అనుభవాలు కోకొల్లలు.

కేంద్రం చెప్పుచేతల్లో? :

ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం గవర్నర్‌ వ్యవస్థను తమ చెప్పు చేతల్లో పెట్టుకుంటుందన్న ఆరోపణలు కొన్నేళ్లుగా జోరుగా వినిపిస్తున్నాయి. అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాకుండా.. ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను గవర్నర్లు టార్గెట్‌ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు కేంద్రంతో వైరం సాగిస్తున్న ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే గవర్నర్‌ల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకుంటూ నెత్తీ నోరూ బాదుకుంటున్నాయి. కానీ, ఇన్నాళ్లు వాళ్ల వేదన అరణ్య రోదనగానే మారిపోయింది. కానీ, ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం మొత్తం దేశంలోనే గవర్నర్‌ వ్యవస్థ ఎలా ఉండాలి? గవర్నర్‌లకు ఉన్న అధికారాలేంటి? వాళ్లకున్న పరిమితుల వివరాలేంటి? రాజ్యాంగం ఏం చెప్పింది? అనే అంశాలను సుప్రీం పూసగుచ్చినట్లు వివరించింది. అంతటితో ఆగకుండా.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చేసిన ప్రసంగాన్ని కూడా తన తీర్పులో ప్రస్తావించింది. ఇంత గొప్ప రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన వాళ్లు చెడ్డవాళ్లైతే రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలుగుతుందన్న బాబా సాహెబ్‌ వ్యాఖ్యలను ఉన్నవి ఉన్నట్లుగా తీర్పులో రాసుకొచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వానికే నిజమైన అధికారం :

సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వమే నిజమైన కార్యనిర్వాహక అధికారం కలిగి ఉంటుంది. ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలిలో ప్రజలచే ఎన్నుకోబడినవాళ్లే ఉంటారు. శాసనసభకు జవాబుదారీగా ఉంటారు. ఇక, రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 ప్రకారం గవర్నర్ మంత్రిమండలి సలహా మేరకు విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

గవర్నర్ బాధ్యతలు – అధికారాలు :

గవర్నర్ రాష్ట్ర కార్యనిర్వాహకానికి రాజ్యాంగబద్ధమైన అధిపతి. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తారు. రాష్ట్ర పరిపాలన వ్యవహారాలన్నీ గవర్నర్ పేరుమీదే సాగుతాయి. రాష్ట్రానికి ప్రథమ పౌరుడు. అవసరమైన సందర్భాల్లో రాజ్యాంగపరంగా అధికారాలు వినియోగిస్తారు. గవర్నర్ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా వ్యవహరిస్తారు. రాష్ట్ర పరిస్థితులు, పాలన గురించి కేంద్రానికి నివేదిస్తారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రభుత్వం నిబంధనల ప్రకారం పనిచేస్తుందో లేదో చూసే బాధ్యత గవర్నర్‌పై ఉంటుంది.

ఇక, రాష్ట్ర శాసనసభను సమావేశపరచడం, వాయిదా వేయడం, మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించడం, శాసనసభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపడం వంటి బాధ్యతలు గవర్నర్‌కు ఉన్నాయి. పాలన రాజ్యాంగ బద్ధంగా సాగుతుందో లేదో పర్యవేక్షించడం, మంత్రిమండలి సలహా మేరకు పాలన కొనసాగించడం, అవసరమైతే విచక్షణాధికారాలు వినియోగించడం, రాష్ట్రపతి పాలన అమలులోకి వస్తే.. పూర్తిస్థాయి అధికారాన్ని గవర్నర్‌ కలిగి ఉంటారు.

అయితే, రాజ్యాంగం గవర్నర్‌కు కొన్ని విచక్షణాధికారాలు ఇచ్చింది. శాసనసభ ఆమోదించిన సాధారణ బిల్లులను గవర్నర్ ఆమోదించవచ్చు, లేక పునఃపరిశీలనకు పంపవచ్చు. కానీ, మళ్లీ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తప్పకుండా ఆమోదించాల్సిందే. ఇక్కడ గవర్నర్‌కు విచక్షణాధికారం ఉండదు. రాజ్యాంగ విరుద్ధ అంశాలున్నాయనిపిస్తే.. బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపే అధికారం ఉంది.

అంతేకాదు.. రాష్ట్ర బిల్లుల విషయంలో అసెంబ్లీ, మండలి మధ్య విభేదాలు వచ్చినపుడు ఉభయసభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసే అధికారం గవర్నర్‌కు లేదు. గవర్నర్ రాజ్యాంగాధిపతి అయినా, ఎన్నికైన ప్రభుత్వం పనుల్లో అధికంగా జోక్యం చేసుకుంటే ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య ఘర్షణ తలెత్తడం సహజం. ప్రస్తుతం తమిళనాడులో ఇదే జరుగుతోంది. అయితే, సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లకు ఉన్న విభేదాలు, వివాదాలు సమసిపోవాలని ఆకాంక్షిద్దాం…

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com