27.9 C
Hyderabad
Saturday, June 27, 2026

Live Video

spot_img

ఓఆర్ఆర్ లోపల చెరువుల జాబితా తయారు చేస్తోన్న హైడ్రా

ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో భూముల వివరాలు అందరికీ అందుబాటులోకి తేవడానికి హైడ్రా కీలకమైన కసరత్తు ప్రారంభించింది. ఏ ప్రాంతంలో చెరువు ఉందో, దాని విస్తీర్ణం ఎంత, కాలువలు, నాలాల పరిస్థితి ఎలా ఉందో వంటి వివరాలు సేకరించడంతో పాటు ప్రభుత్వ భూములు, పార్కులు వంటి ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలకు సంబంధించిన స్పష్టమైన హద్దులతో సమాచారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటోంది.

ఈ దిశగా హైడ్రా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ -NRSCతో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ఎన్‌ఆర్‌ఎస్‌సీ డైరెక్టర్ డాక్టర్‌ ప్రకాష్ చౌహాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

చెరువుల ఎఫ్‌టీ‌ఎల్‌, బఫర్ జోన్‌లకు సంబంధించిన హద్దుల విషయంలో ఎలాంటి అపోహలు లేకుండా సరైన సమాచారం అందించడమే తమ లక్ష్యమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ భూములు, పార్కులు, రహదారులు వంటి ప్రజావసరాల స్థలాల సమాచారం అందుబాటులోకి తేవడంలో ఈ ఒప్పందం ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు.

1970లో సర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన టోపో షీట్లు, కడెస్ట్రియల్ మ్యాపులు, రెవెన్యూ రికార్డులు, చెరువులకు సంబంధించిన వివరాలు, శాటిలైట్ ఇమేజీల సహాయంతో సమగ్ర సమాచారం ప్రజలకు అందించడమే హైడ్రా లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

చెరువుల పునరుద్ధరణ, ప్రభుత్వ భూముల పరిరక్షణ, పర్యావరణ హితమైన నగర అభివృద్ధిలో తెలంగాణ మొదటి రాష్ట్రంగా నిలవబోతుంద‌ని ఎన్‌ఆర్‌ఎస్‌సీ డైరెక్టర్ డా. చౌహాన్ అభిప్రాయపడ్డారు. పర్యావరణాన్ని కాపాడగలిగితే దేశంలోనే ఉత్తమ నగరంగా హైదరాబాద్ నిలుస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దీనిలో హైడ్రా చర్యలు కీలకంగా ఉంటాయని అన్నారు.

విపత్తుల నిర్వహణ, నీటి వనరుల రక్షణ వంటి అంశాలకు జియో ఆధారిత జియోస్పేషియల్ డేటా, సాంకేతిక సహకారం హైడ్రాకు లభించనుంది. రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ సాంకేతికతల వాడకంతో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ – TCUR కోసం భౌగోళిక డేటాబేస్‌ను అభివృద్ధి చేయడానికి అవసరమైన టెక్నికల్ సపోర్ట్‌ను ఎన్ఆర్ఎస్‌సీ అందించనుంది.

భువన్ పోర్టల్‌లో TCUR పరిధిలో విపత్తుల నిర్వహణ, నీటి వనరుల రక్షణకు సంబంధించిన అన్ని వారసత్వ సమాచారాన్ని ఈ ఒప్పందం ప్రకారం అందించనున్నారు. ‘భూనిధి’ పోర్టల్‌లోని చారిత్రక శాటిలైట్ డేటా కూడా 2023 జియోస్పేషియల్ డేటా పాలసీ మేరకు అందుబాటులోకి వస్తుంది.

హై-రిజల్యూషన్ శాటిలైట్ డేటా, ఎరియల్ ఫోటోగ్రఫీ, డిజిటల్ ఎలివేషన్ మోడల్స్ వంటి వనరులు ఎన్ఆర్ఎస్‌సీ ద్వారా హైడ్రాకు లభించనున్నాయి. ఉపగ్రహం మరియు వైమానిక వనరుల ఆధారంగా డేటాను తయారుచేయడం, ఏకీకరణ చేయడం, ఆస్తుల నిర్వహణకు సంబంధించిన సమాచార సేకరణకు ఎన్ఆర్ఎస్‌సీ నుండి సహకారం లభిస్తుంది.

ఎన్‌డీఈఎం (నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్) వెబ్ పోర్టల్‌కు హైడ్రాకు ఉచిత యాక్సెస్ ఉంటుంది. ఇది ఏరోస్పేస్ ఆధారిత డేటాను రియల్‌టైంలో విజువలైజ్ చేయడానికీ ఉపయోగపడుతుంది.

ఓఆర్ఆర్ పరిధిలోని ప్రాంతాలు మరియు జీహెచ్ఎంసీ చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో చెరువులు, ప్రభుత్వ భూములు, పార్కుల సంబంధిత సమగ్ర సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో హైడ్రా-ఎన్ఆర్ఎస్‌సీ సంయుక్తంగా కృషి చేయనున్నాయి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com