దక్షిణాది అమర్నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం లింగమయ్య జాతర మొదలయ్యింది. ప్రతి ఏడాది చైత్ర పౌర్ణమి రోజున జరిగే ఈ జాతరకు భక్తుల రాకపోకలతో నలుమూలల నుంచి సందడి మొదలవుతుంది. అందులో భాగంగానే ఇవాల్టి నుంచి జాతర మొదలయ్యింది.
ఈ ఏడాది సలేశ్వరం జాతర శుక్రవారం నుంచి 13 వరకు మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ప్రత్యేకత ఏమిటంటే, సలేశ్వరం లింగమయ్యకు చెంచులే పూజారులుగా వ్యవహరించడం ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ఆచారం.
సలేశ్వరం యాత్ర ఒకరకంగా సాహస యాత్రే. ఎందుకంటే, దట్టమైన నల్లమల అడవుల్లోని గుట్టలు, లోయలు, గుహల మధ్య నడక ప్రయాణం చేయాలి. అడవిలో పులులు, ఇతర వన్యప్రాణులు ఉన్నా.. అక్కడ కనిపించే ప్రకృతి రమణీయత అందరి మనసును మెప్పిస్తుంది. పచ్చని కొండలు, శబ్దించే జలపాతాలు, పక్షుల గాత్రాలు. ఇలాంటి ఆధ్యాత్మిక వాతావరణంలో లింగమయ్య దర్శనం అనేది ఒక మరిచిపోలేని అనుభూతిగా మిగులుతుంది.
ఉగాది తర్వాత వచ్చే చైత్ర పౌర్ణమి రోజు మొదలయ్యే ఈ జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలివస్తారు. ఈ మూడు రోజుల పాటు.. ఆ మార్గమంతా, నల్లమల అటవీ ప్రాంతమంతా భక్తుల నామస్మరణతో మార్మోగుతుంది.
సలేశ్వరం జాతరకు వెళ్లే భక్తులు శ్రీశైలం-హైదరాబాద్ రహదారిలోని ఫరహాబాద్ పులిబొమ్మ వద్ద దిగి, అక్కడి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో అడవిలోకి వెళ్లాలి. మొదట 10 కిలోమీటర్లదాకా రోడ్డు ఉంటుంది. అక్కడ పాత నిజాం కాలం నాటి కట్టడం ఒకటి ఉంటుంది. అక్కడినుంచి ఎడమ వైపుగా 23 కిలోమీటర్ల ప్రయాణం చేసి రాంపూర్ చెంచుపెంట వద్ద బేస్‌క్యాంప్ కు చేరతారు. అక్కడి నుంచి 4 కిలోమీటర్ల నడక ప్రయాణం మొదలవుతుంది. ఈ మార్గంలో స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం మార్గ మధ్యంలో అక్కడక్కడా తాగునీటి సదుపాయాలను స్థానిక చెంచులు ఏర్పాటు చేస్తారు.
నాలుగు కిలోమీటర్ల దూరం ఏకబిగిన కొండలు, గుట్టలు, చెట్లు, పొదల గుండానే యాత్ర కొనసాగుతుంది కాబట్టి.. మోకాల చెరువు, గాడిదదొన్న కాల్వ వద్ద విశ్రాంతికి ఏర్పాట్లు చేస్తారు. అలాగే మైసమ్మకట్ట, పాపనాశనం, భైరవుడి గుడి వంటి ప్రదేశాలు దర్శించుకోవచ్చు. అక్కడి గుట్టలు 250 నుంచి 400 అడుగుల ఎత్తుతో ఉంటాయి. గుండా వద్ద అతి చల్లగా ఉండే నీరు, వనమూలికల ప్రభావంతో ఆరోగ్యానికి మంచిదని నమ్మకం. భక్తులు ఆ నీటిని సేవిస్తారు.
గుండం ఒడ్డున తూర్పుముఖంగా రెండు గుహలు ఉంటాయి. పై గుహలో లింగమయ్య స్వామి కొలువుదీరి ఉంటారు. కింది గుహలో కూడా లింగం ఉంటుంది. గుడి ముందు వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలు దర్శనమిస్తాయి.
నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, వనపర్తి, అలాగే హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. ఫరహాబాద్ వద్ద ఆర్టీసీ బస్సులకు టోల్ ఫీజు మినహాయింపు ఉంటుంది. మిగతా వాహనాలన్నీ టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.