- ఈనెల 27న వరంగల్ లో భారీ బహిరంగ సభ
- వింటేజ్ కేసీఆర్ స్టైల్ లో ప్రసంగం
- పార్టీలో పూర్తిస్థాయి మార్పులు
- ఏడాది తర్వాతే కేటీఆర్ పాదయాత్ర
తెలంగాణలో రాజకీయంగా తామే బలమైన శక్తి అంటూ నిరూపించుకోవడానికి మరోసారి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. 25వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్న ఈ పార్టీ కొత్త డైరెక్షన్లో పయనించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. బీఆర్ఎస్ రజితోత్సవ వేడుకల సందర్భంగాఈనెల 27వ తేదీన వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అధికార పార్టీగా గతంలో పార్టీ వ్యవస్థాపక దినోత్సవాలను జరుపుకున్న ఈ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ 25 వసంతాల వేడుకలకు సిద్ధమవుతోంది.
రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఈ సమావేశానికి ఉంటుందని బిఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు భారీ బహిరంగ సభలో మాట్లాడనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు భారీ సంఖ్యలో జన సమీకరణ చేసేందుకు జిల్లాల వారిగా నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఈ సభ కోసం మూడు వేలకు పైగా బస్సులు తమకు కావాలని ఇటీవల బిఆర్ఎస్ నాయకులు తెలంగాణ ఆర్టీసీకి 8 కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా చెల్లించారు కూడా..
రజతోత్సవ సభ అనంతరం… రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలని వర్కింగ్ ప్రెసిడెంటుకు కేటీఆర్ ఇప్పటికే జిల్లా అధ్యక్షులను, పార్టీ బాధ్యులను ఆదేశించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ కమిటీల నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు. జిల్లా పార్టీ కార్యాలయాల్లో కార్యకర్తలకు, నాయకులకు రాజకీయ శిక్షణా తరగతలును నిర్వహించడానికి కూడా ప్రణాళికలు సిద్దం చేసుకుంది బీఆర్‌ఎస్ అధిష్టానం.
ఇక సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి జిల్లాల వారిగా కెసిఆర్ రెగ్యులర్గా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాల్లో ముఖ్యమైన నేతలతో మాటలాడి వారికి మార్గనిర్దేశనం చేస్తున్నారు. రజతోత్సవ సభకు బయలుదేరేముందు ప్రతి గ్రామంలో పార్టీ జండాను ఎగరేసి ఆతర్వాత ప్రయాణం ప్రాంరంభించాలని ఇదే విషయం కార్యకర్తలకు కూడా తెలియచేయాలని అధినేత బీఆర్‌ఎస్ నేతలందరికీ సూచించారు. కార్యకర్తలకు సరిపోను జండాలు, కండువాలు, పోస్టర్లు తదితర ప్రచార సామగ్రి పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రజల్లో ప్రత్యక్షంగా కనిపిస్తుండటంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో సమరోత్సాహం నెలకొంది. వారిలో ఆత్మస్ధైర్యం కూడా బాగా పెరిగినట్లు కనిపిస్తోంది. బీఆర్‌ఎస్ కార్యకర్తల్లో కనిపిస్తున్న ఉత్తేజాన్ని మరింతగా పెరగడానికి వరంగల్ సభ దోహదపడాలనేది బీఆర్ఎస్ అగ్రనేతల సంకల్పంగా కనిపిస్తోంది.
మరో వైపు వరంగల్ లో ఎలాంటి భారీ సభలు,సమావేశాలు నిర్వహించకూడదని పోలీసులు అంక్షలు విధించడంతో బిఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ సభకు సంబంధించి పోలీసులు తమ వైఖరిని ఈ నెల 17న తెలపాలని హైకోర్టు పోలీస్ శాఖను ఆదేశించింది. ఈ సమావేశానికి కచ్చితంగా అనుమతి వస్తుందని టిఆర్ఎస్ నేతలు ఆశాభావంతో ఉన్నారు.
ఈనెల 27న జరిగే సమావేశంలో వింటేజ్ కేసీఆర్ ప్రసంగం ఉంటుందని నేతలు అంటున్నారు. అధికారంలో ఉన్న పదేండ్లు కేసీఆర్ ప్రసంగం అంతగా ఆకట్టుకోలేకపోయింది అన్న వాదన ఉన్న నేపథ్యంలో ఉద్యమ కాలంలో చేసిన ప్రసంగ శైలిని మళ్లీ వరంగల్ సభలో చూపించాలని కార్యక్తలు కోరుకుంటున్నారు. కార్యకర్తలను ఉత్సాహ పరచడానికి వారిలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి కేసీఆర్ కూడా అదే తరహాలో ప్రసంగించాలని భావిస్తున్నట్లు సమాచారం. వరంగల్ సభ తరువాత కేసీఆర్ స్వయంగా జిల్లాల్లో పర్యటనలు చేయాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించి రూట్ మ్యాప్ ను రూపొందించే పనిలో నేతలు ఉన్నారు.
మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాదయాత్ర చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఎన్నికలకు చాలా సమయం ఉన్నందు వల్ల ఏడాది తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. హరీష్ రావుకు కూడా పార్టీ పరంగా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ వర్గాలు చెపుతున్నాయి.