రేవంత్ సర్కార్ పై కేంద్ర దర్యాప్తు సంస్ధలకు ఫిర్యాదు చేసిన కేటీఆర్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూముల విషయమై రిజర్వబ్యాంక్ ఆఫ్ ఇండియా, సెబీ, సెంట్రల్ విజిలెన్స్, సీబీఐ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ తదితర సంస్ధలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన చాలా విషయాలను ప్రస్తావించారు. ఒక బీజేపీ ఎంపీ మద్దతుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కుంభకోణానికి పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. ఆయన సహకారంతోనే కేవలం 5200 కోట్ల విలువ కలిగిన భూమిని 30 వేల కోట్లుగా చూపించి పది వేల కోట్ల రుణం పొందారని కేటీఆర్ తెలిపారు. ఆర్బీఐ నిబంధనలు ఏమాత్రం పాటించకుండా ఈ రుణం తీసుకువచ్చారని అన్నారు. అసలు లిటిగేషన్ లో ఉన్న భూములపై ఐసీఐసీఐ బ్యాంక్ లోన్ ఎలా ఇచ్చిందని కేటీఆర్ ప్రశ్నించారు. ఫీల్డ్ విజిట్ చెయ్యకుండానే బ్రోకర్ ఆధారంగా బ్యాంకు ప్రభుత్వానికి రుణం ఇచ్చిందన్నారు . ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రికి తెలియకుండానే ఈ వ్యవహారం జరిగిందని, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సెంట్రల్ విజిలెన్స్, సీబీఐలతో విచారణ జరపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కేంద్ర స్పందిచకుంటే కాంగ్రెస్, బీజేపీల మధ్య ఒప్పందం ఉన్నట్లే అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. హెచ్సీయూ భూముల వ్యవహారం వెనుక క్విడ్ ప్రో కో ఉందని కేటీఆర్ ఆయా సంస్ధలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.