దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి 46.44 కోట్ల రూపాయల విలువైన 3.3 కిలోల కొకైన్ ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాలు అందించిన పక్కా సమాచారం ఆధారంగా ఢిల్లీ విమానాశ్రయంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ అధికారులు కొకైన్ కలిగి ఉన్న 23 సంవత్సరాల వయసు గల భారతీయ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. ఉగాండ దేశంలోని ఎన్టెబ్బే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షార్జా మీదుగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న జీ9463 నెంబరు గల విమానంలో కొకైన్ అక్రమంగా తీసుకువస్తున్నారన్న సమాచారం నిఘావర్గాలు అందించడంతో అధికారులు ఆ యువకుడి లగేజ్ ని సోదా చేయగా 3.3 కిలోల కొకైన్ బయటపడింది. ఎయిర్ పోర్టులో గ్రీన్ ఛానల్ దాటిన తరువాత సదరు కొకైన్ కలిగిన ఉన్న ప్రయాణికుడిని అడ్డగించి తనిఖీ చేయగా అతని సూట్కేస్ అంచున దాచిన తెల్లటి పౌడర్ బయటపడింది. అధికారులు అక్కడికక్కడ ఎన్డీపీఎస్ ఫీల్డ్ టెస్ట్ కిట్ ఉపయోగించి పరీక్షించగా ఆ పదార్ధం కొకైన్ అని నిర్ధారణ అయ్యింది. వెంటనే ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. కొకైన కలిగి ఉన్న యువకుడిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ మరియు కస్టమ్స్ చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.