ఇటీవలి కాలంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారినవాళ్లు ‘అలేఖ్య చిట్టి పికెల్స్’ పేరుతో ప్రసిద్ధి పొందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు. దాదాపు నాలుగైదు రోజులుగా వీరిపై మీమ్స్, ట్రోల్స్, వివరణల వీడియోలు, క్షమాపణల వీడియోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. రుచికరమైన పచ్చళ్లతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన మార్కెటింగ్ స్టైల్ వల్లే ఈ సిస్టర్స్ అంత పాపులర్ అయ్యారు.
ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 9లో వీరిలో ఒకరికి అవకాశం దక్కవచ్చన్న వార్త ఇప్పుడు నెట్టింట్లో చర్చనీయాంశమైంది. ఏటా ఆగస్ట్ లేదా సెప్టెంబర్ తొలి వారంలో ప్రసారం మొదలయ్యే ఈ రియాలిటీ షో కోసం ఇప్పటికే కంటెస్టెంట్ సెలక్షన్ ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వ్యక్తులను బిగ్ బాస్ టీం సెలెక్ట్ చేసే ట్రెండ్ ఇప్పటికే ఉంది.
ఇప్పుడు ‘అలేఖ్య చిట్టి పికెల్స్’ సిస్టర్స్ పై వచ్చిన ట్రోల్స్, వీడియోలు 100 మిలియన్ వ్యూస్ దాటి ట్రెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో… వీరిలో రమ్యకే ఈసారి గోల్డెన్ ఛాన్స్ దక్కే అవకాశం ఉందని నెటిజన్లు ఊహిస్తున్నారు. రమ్య రీల్స్‌లో ఎక్కువగా మోడ్రన్ డ్రెస్సింగ్‌తో కనిపించడంతో ఆమెకు ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిందని చెబుతున్నారు.
ఇటీవల జియో హాట్‌స్టార్‌లో వీరి వివాదానికి సంబంధించి ఒక వీడియో వైరల్ అవ్వగా, ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాలోని ఓ సీన్‌తో పెట్టిన ఎడిట్ వీడియో నెట్టింట్లో షేర్ అయింది. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి కూడా తన యూట్యూబ్ ఛానల్‌లో ఈ విషయంపై స్పందిస్తూ… వీరిలో ఒకరు బిగ్ బాస్ హౌస్‌కి రావొచ్చు అని అభిప్రాయపడ్డారు.
రాజమండ్రి కేంద్రంగా ‘అలేఖ్య చిట్టి పికెల్స్’ పేరుతో సుమ కంచర్ల, అలేఖ్య చిట్టి, రమ్య మోక్ష కంచర్ల అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఈ బిజినెస్‌ను ప్రారంభించారు. అయితే, పచ్చళ్ల ధరలపై వినియోగదారులు ప్రశ్నించగా, అలేఖ్య అనే యువతి కస్టమర్లను అశ్లీలంగా తిట్టిన ఆడియో క్లిప్ బయటకు రావడంతో పెద్ద దుమారమే రేగింది. ఆ తర్వాత మరిన్ని ఆడియోల లీక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ముగ్గురు సిస్టర్స్‌పై విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది.
ఈ ట్రోల్స్‌ను తట్టుకోలేక చివరికి సుమ కంచర్ల స్పందిస్తూ తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా తమను ట్రోల్ చేయకుండా చూడమని కోరారు. మరోవైపు అలేఖ్య, తన మాటల వల్ల ఎవరికైనా బాధ కలిగినట్లైతే క్షమించమని, తాను చేసిన తప్పుకు సారీ చెబుతున్నానని ఓ వీడియో విడుదల చేశారు. వివాదం నెమ్మదిగా తగ్గుతున్నట్టు కనిపించినా ఈ సిస్టర్స్ చుట్టూ ఉన్న క్రేజ్ మాత్రం ఇంకా తగ్గట్లేదు. ఇక బిగ్ బాస్ ఎంట్రీ విషయం చూస్తే.. బిగ్‌బాస్ హౌజ్‌లోకి వీళ్లకు ఎంట్రీ ఉంటుందా? ఉంటే.. వీరిలో ఎవరు హౌస్‌లోకి అడుగుపెడతారు? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరకనుంది.