అమెరికా ప్రభుత్వం విధించిన అదనపు దిగుమతి సుంకాలు ఇప్పుడు భారత మామిడి రైతులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే పండ్లపై టారిఫ్‌లు 22 శాతం నుంచి 26 శాతం వరకు పెరిగాయి.
ఇప్పటికే ఆక్వా రంగం ఈ ప్రభావంతో నష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో, ఇప్పుడు మామిడి రైతులఉన కూడా అదే సమస్య చుట్టుముట్టింది. దేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మామిడి సాగు విస్తృతంగా జరుగుతుంది. రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు 7.64 లక్షల ఎకరాల్లో మామిడి సాగు జరుగుతోంది. వార్షికంగా 24.45 లక్షల టన్నుల ఉత్పత్తి అవుతుంది.
ఇందులోంచి ప్రతి ఏడాది సగటున 45 వేల టన్నుల మామిడి అమెరికాకు ఎగుమతి అవుతుంది. ఇందులో 10 వేల నుంచి 15 వేల టన్నులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచే వెళ్లుతున్నాయి. వీటి విలువ రూ.150 కోట్లు నుంచి రూ.230 కోట్ల మధ్య ఉంటుంది. తాజాగా పెరిగిన టారిఫ్‌ల కారణంగా ఇది రూ.50 కోట్లు వరకు అదనంగా వ్యయం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఈ ప్రభావంతో అమెరికాలో భారత మామిడి ధరలు పెరిగే అవకాశమున్నా, అదే సమయంలో డిమాండ్ తగ్గే ప్రమాదం కనిపిస్తోంది. అంతేకాదు, ఎగుమతిదారులు ఈ అదనపు భారాన్ని నేరుగా రైతులపై మోపే అవకాశమున్నందున, రైతులకు గిట్టుబాటు ధర రావడం కష్టమేనని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవల వరకూ అమెరికా మామిడి దిగుమతులపై 0-5 శాతం టారిఫ్‌లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వాటిని నాలుగింతలకు పైగా పెంచడంతో, ఈక్వెడార్, ఇండోనేషియా వంటి దేశాలతో పోటీపై కూడా ప్రభావం చూపనుంది. వారు తక్కువ ధరకు మామిడి సరఫరా చేయగలిగితే, భారత రైతులు అమెరికా మార్కెట్‌ను కోల్పోయే అవకాశముంది.