-
స్కెచ్ వేసిన బడా రియల్ ఎస్టేట్ సంస్థ
-
అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాయబారం
-
తమ వెంచర్‌లో టీటీడీ ఆలయం నిర్మించాలని ప్రతిపాదన
-
ఖర్చు తామే భరిస్తామని, నిర్మించాక టీటీడీకి అప్పగిస్తామని భరోసా
-
రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిళ్లు
-
ఇప్పటికే చెన్నైలో టీటీడీకి ఆలయం, ఖాళీ స్థలాలు
-
అయినా కొత్త ప్రతిపాదన పెట్టిన రియల్ సంస్థ జీ స్క్వేర్
-
సానుకూలంగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు?
బడా వ్యాపార వేత్తలు తెలివి మీరి పోయారు. వాళ్లకు ఉన్న మార్కెటింగ్ స్టాఫ్‌ను మించి ఆలోచనలు చేస్తున్నారు. సాక్షాత్తూ దేవ దేవుడినే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా మార్చేందుకు బడా స్కెచ్ వేశారు. ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానానికే ప్రతిపాదన పెట్టారు. తమ రియల్ ఎస్టేట్ వెంచర్‌లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాసుడి ఆలయం నిర్మించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అవేమీ.. చిన్నా చితకా ప్రయత్నాలు కాదు.. ఎలా ప్లాన్ చేస్తే ప్రభుత్వ పెద్దలను ఒప్పించవచ్చో, ఏ విధంగా ముందుకెళ్తే.. తమ ప్లాన్ వర్కవుట్ చేయవచ్చో ఔపోసన పట్టేశారు.
అసలు విషయంలోకి వద్దాం.. చెన్నై శివారు పోరూరులో జీ స్వ్కేర్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ కొత్త వెంచర్ డెవలప్ చేస్తోంది. అయితే, ఆ భూములకు అతి తక్కువ కాలంలోనే విలువ పెరగాలని, ఆ ప్రాంతానికి డిమాండ్ పెరగాలని జీ స్క్వేర్ సంస్థ మాస్టర్ ప్లాన్ వేసింది. తిరుమల శ్రీవారి ఆలయం నిర్మిస్తే.. ఆ ప్రాంతం ఊహించని రీతిలో డెవలప్ అవుతుందని, కమర్షియల్ ఏరియా అవుతుందని, తమ వెంచర్‌లో భూముల విలువ అమాంతం పెరుగుతుందని అంచనా వేసింది. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదన పెట్టింది. అయితే, నేరుగా సర్కారు పెద్దల దగ్గరికి వెళ్తే తమ ప్రపోజల్ వర్కవుట్ అవదేమో అని సందేహించింది. అందుకే తమకు దగ్గరగా ఉండే కొందరు అధికారులను సంప్రదించి తమ మనసులో ఉన్న ప్రతిపాదన బయటపెట్టారు జీ స్క్వేర్ సంస్థ యాజమానులు. తాము ప్రతిపాదించే స్థలంలో టీటీడీ దేవాలయం నిర్మిస్తే బాగుంటుందని, ఆ ఆలయం నిర్మాణానికి అయ్యే ఖర్చులన్నీ తామే భరిస్తామని, ఆలయం నిర్మించిన తర్వాత నిర్వహణ బాధ్యతలు మాత్రం టీటీడీకి అప్పగిస్తామని చెప్పారు. ఈ విషయంలో తాము ఉదారంగా వ్యవహరిస్తున్నట్లు .. టీటీడీకి ఉచితంగా దేవాలయం నిర్మించి ఇస్తున్నట్లు బిల్డప్ ఇచ్చారు.
ఎలాగూ.. ఆ సంస్థ యాజమాన్యానికి కావలసిన వాళ్లే కావడంతో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు ఆ ప్రతిపాదన పెట్టారట. వాళ్లే ఉచితంగా దేవాలయం నిర్మించి టీటీడీకి అప్పగిస్తామంటున్నారని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఖర్చు ఉండదని, పైగా.. ఆ ఆలయం నిర్మించిన విలువైన స్థలం, ఆలయం నిర్వహణతో భారీగా ఆదాయం టీటీడీకి సమకూరుతుందని చంద్రబాబుకు విన్నవించారని తెలుస్తోంది. ఆలయం నిర్మించి మరీ స్థలంతో సహా ఇస్తామని చెప్పడం, టీటీడీకే పూర్తి హక్కులు బదలాయిస్తామని చెప్పడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పినట్లు సమాచారం. కానీ, దీనివల్ల ఆ కంపెనీ దేవుడి పేరు చెప్పి ఏ స్థాయిలో సంపాదించుకుంటుందో అన్న విషయం మాత్రం ఆలోచించలేదని అర్థమవుతోంది.
ఇదే సంస్థకు సంబంధించిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. జీ స్వ్కేర్ సంస్థ.. తిరుమల కొండపై గెస్ట్‌హౌజ్ నిర్మాణం కోసం రూ.20 కోట్లతో వేలంలో ఓ స్థలాన్ని కొనుగోలు చేసిందని సమాచారం. అయితే, ఇప్పుడు వీళ్లు పెట్టిన ప్రతిపాదన సీఎం చంద్రబాబు ఆమోదం పొందడంతో.. ఇక టీటీడీ రంగంలోకి దిగి.. ఆలయం నిర్మాణ ప్రతిపాదన వ్యవహారాలు చూస్తుందని భావిస్తున్నారు. అయితే, ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాత్రం ఈ ప్రతిపాదనకు సుముఖంగా లేరని చెబుతున్నారు.
జీ స్క్వేర్ సంస్థ పెట్టిన ప్రతిపాదనను గనక ప్రభుత్వం, టీటీడీ అంగీకరించి.. వాళ్ల రియల్ ఎస్టేట్ వెంచర్‌లో వేంకటేశ్వరుని ఆలయం నిర్మించేందుకు సిద్ధపడితే, భవిష్యత్తులో ఇదో వ్యాపార సూత్రంగా మారిపోతుందన్న చర్చ జరుగుతోంది. ఎక్కడ పడితే అక్కడ రియల్ ఎస్టేట్ సంస్థలు తమ వెంచర్లలో టీటీడీ అలయాలు నిర్మించాలన్న ప్రతిపాదనలు ఇబ్బడి ముబ్బడిగా వస్తాయని అంటున్నారు. ఫలితంగా వేంకటేశ్వరుని వ్యాపార వస్తువుగా మార్చే ప్రమాదం ఉందంటున్నారు.
తిరస్కరించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి :
గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా మహారాష్ట్ర నుంచి ఇలాంటి ప్రతిపాదనే వచ్చిందని, ఆ సమయంలో సీఎం వైఎస్‌ఆర్ ఆ ప్రతిపాదనను తిరస్కరించారని గుర్తు చేస్తున్నారు. ముంబై శివారులో డిఎల్‌ఎఫ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కూడా ఇలాంటి ప్రతిపాదనే పెట్టిందట. అప్పటి యూపీఎ ప్రభుత్వ చైర్‌పర్సన్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు డిఎల్‌ఎఫ్ యాజమాని సన్నిహితుడు కావడంతో వాద్రా ద్వారా సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఇదే ప్రతిపాదన పంపించారు.
ముంబయిలోని తమ రియల్ ఎస్టేట్ వెంచర్‌లో టీటీడీ ఆలయం నిర్మిస్తే తమ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు మాదిరిగా వర్థిల్లుతుందని డిఎల్‌ఎఫ్ సంస్థ అంచనా వేసింది. అయితే, నేరుగా రాబర్ట్ వాద్రా నుంచే ప్రతిపాదన రావడంతో ఎదురే లేదనుకున్నారట. కానీ, సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మాత్రం ఈ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తోసి పుచ్చారని అప్పుడు వైఎస్‌ఆర్ దగ్గర ఉన్న సన్నిహితులు చెబుతున్నారు. దేవుడిని వ్యాపార వస్తువుగా మార్చే ఉద్దేశ్యం లేదని, ఆధ్యాత్మిక భావనతోనే ఉంచాలని వైఎస్ అప్పుడు స్పష్టంగా చెప్పారట.
ఇక, ఇప్పుడు చెన్నై నుంచి వచ్చిన ప్రతిపాదన మేరకు.. ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే.. పలు నియమ నిబంధనలు అనుసరించాల్సి ఉంటుంది. టీటీడీ అక్కడ ఆలయం నిర్మించాలంటే భూమి అనుకూలంగా ఉందా? అక్కడున్న మట్టి ఏ రకానికి చెందినది? ఒకవేళ లూజ్ సాయిల్ ఉంటే ఆ భూమి ఆలయం నిర్మాణానికి పనికి రాదు. అంతేకాదు..ఆ స్థలం ఆగమాలకు అనుకూలంగా ఉందా? పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులేంటి? అన్న అంశాలన్నీ పరిశీలించిన తర్వాత ఆలయ నిర్మాణం ప్రారంభిస్తారు. అంటే..మొదటగా.. జీ స్క్వేర్ నిర్మించాలనుకున్న తన వెంచర్‌లో భూమి స్వరూపం ఎలాంటిదో పరిశీలిస్తారు. ఆ పరీక్షల్లో ఓకే అయితేనే ఆలయ నిర్మాణం ప్రారంభమవుతుంది.
చెన్నైలో ఇప్పటికే ఆలయం, టీటీడీ స్థలాలు :
అసలు టీటీడీ చెన్నైలో ఆలయం నిర్మించాలనుకుంటే ఇలాంటి ప్రతిపాదనలే అక్కర్లేదు. ఎందుకంటే.. చెన్నైలోని టీ నగర్‌లో ఇప్పటికే రెండు ఎకరాల స్థలంలో టీటీడీ ఆలయం ఉంది. ఆ ప్రాంగణంలోనే గెస్ట్‌హౌజ్‌లున్నాయి. అదేకాకుండా.. తమిళనాడు సీఎంగా జయలలిత ఉన్న సమయంలో టీటీడీకి ఇచ్చిన ఆరు ఎకరాల స్థలం కూడా ఖాళీగానే ఉంది. టీటీడీకి ఉన్న సొంత స్థలంలోనే భక్తుల విరాళాలతో బ్రహ్మాండమైన ఆలయం నిర్మించే అవకాశం ఉంది. మరి..ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ.. ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థ వెంచర్‌లో టీటీడీ ఆలయం నిర్మించడం అవసరమా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.