23.5 C
Hyderabad
Thursday, July 30, 2026

Live Video

spot_img

భద్రాచలంలో కన్నుల పండువగా సీతారాముల కల్యాణం

  • పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు

  • హాజరైన ఉపముఖ్యమంత్రి దంపతులు, మంత్రులు

  • వేలాదిగా తరలివచ్చిన భక్తజనం

దక్షిణ అయోధ్యగా పేరు గాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రంలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. అభిజిత్‌ లగ్నంలో శ్రీ రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. భద్రాచలం మిథిలా మైదానంలో ఈ కల్యాణ క్రతువును వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మిథిలా మైదానంలో సరిగ్గా ఉదయం 10.30 గంటలకు సీతారాముల కల్యాణ పూజలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు పూర్తయ్యాయి.

వేద మంత్రోచ్ఛరణ మార్మోగుతుండగా అభిజిత్ లగ్నం సమీపించగానే సరిగ్గా 12.02 నిమిషాలకు జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని శ్రీ సీతారామచంద్రుల వారి శిరస్సుపై పెట్టారు. ఇది శుభ ముహూర్తం. జగత్‌ కల్యాణ శుభ సన్నివేశం. తలంబ్రాల వేడుక అనంతరం బ్రహ్మ బంధనం వేశారు. దీన్ని బ్రహ్మముడి అంటారు. చతుర్వేదాలతో నూతన దంపతులకు ఆశీర్వచనం పలికారు. సాధారణంగా మంగళసూత్రంలో రెండు సూత్రాలు ఉంటాయి. అయితే, సీతమ్మకు ధరింపజేసే మంగళ సూత్రాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. మూడు సూత్రాలు కలిగిన ఈ మంగళ సూత్రంలో ఒకటి సీతమ్మ పుట్టింటిది కాగా, మరోటి అత్తగారింటిది. మూడో సూత్రం భక్త రామదాసు తయారు చేయించింది కావడం విశేషం. ఇక్కడ భక్త రామదాసు ఎంతో వాత్సల్యంతో తయారు చేసిన పతకాన్ని కలిపి మూడు సూత్రాలను సీతమ్మవారికి ధరింపజేయడం ఈ క్షేత్రం ఆచారం. మాంగళ్యధారణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఇక, కల్యాణానికి మూడు నెలల ముందే గోటితో ఒలిచిన తలంబ్రాలను దేవాలయ నిర్వాహకులు సిద్ధం చేశారు. భక్తుల రామ నామ స్మరణ నడుమ సీతారాముల కల్యాణ ఘట్టం 12.40 నిమిషాలకు వైభవంగా ముగిసింది.

భద్రాద్రి సీతారాముల కల్యాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. సీఎం హోదాలో రామయ్య కల్యాణానికి రేవంత్ రెడ్డి హాజరవ్వడం ఇదే తొలిసారి. సరిగ్గా ముహూర్తం సమయానికి కాస్త ముందు 11.57 నిమిషాలకు సీఎం దంపతులు కల్యాణ మండపానికి చేరుకున్నారు.

ఈ వేడుకకు సంబంధించి దేవాదాయ శాఖ భారీ ఏర్పాట్లు చేసింది. కల్యాణాన్ని వీక్షించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దంపతులు, తుమ్మల నాగేశ్వర్‌రావు, కొండా సురేఖతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రముఖులు, భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కూడా కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆలయానికి వచ్చిన వేళ పరిసరాల్లో పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సీతారామచంద్ర స్వాములవారి కల్యాణం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దంపతులకు ఉపాయంలోని లక్ష్మీ తయారు అమ్మవారి ఆలయంలో వేదపండితులు ఆశీర్వదించారు. సీఎంను సన్మానించిన ఆలయ అధికారులు సీతారాముల చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు.

సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకను కనులారా వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. మండు వేసవిని సైతం లెక్కచేయకుండా భక్తులు రావడం విశేషం.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com