ప్రపంచ వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. దేశ విదేశాల్లోని భారతీయులు సీతారాముల కళ్యాణ వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజియర్ స్వామి పాల్గొన్నారు. శ్రీ సీతారామస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవానికి జియర్ స్వామి రాకతో ఆస్ట్రేలియా నలుమూలల నుంచి భారతీయులు…ముఖ్యంగా తెలుగు ప్రజలు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. రాముల వారి కళ్యాణం జరుగుతున్న మెల్‌బోర్న్ నగరంలోని ప్రాంతంలో భారతీయులు సంప్రదాయ దుస్తులు ధరించి రావటం స్థానికులను ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా శ్రీ సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి వారి శీల సౌందర్యాన్ని చిన జియర్ స్వామి భక్తులకు వివరించారు. మన హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది రామ తత్వం, కష్టంలో కలిసి నడవాలన్నది సీతా తత్వం, కుటుంబ బాధ్యత పంచుకోమంటుంది లక్ష్మణ తత్వం, మనకి అండగా నిలిచే వారికి తిరిగి అండగా నిలవాలన్నది ఆంజనేయ తత్వం అని వివరించారు.