26.7 C
Hyderabad
Sunday, April 26, 2026

Live Video

spot_img

ఇల వైకుంఠం.. దక్షిణ అయోధ్య.. భద్రాచలం

  • అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి

  • భక్త రామదాసు నిర్మించిన రామాలయ విశేషాలు ఇవే

  • భద్రాచలంలో ఏప్రిల్ ఆరున సీతారాముల కల్యాణం

దశరథ పుత్రుడు, వైకుంఠ రాముడు, జగదభి రాములు, సీతా రాముడు, జగమేలే స్వామి శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణము భూపుత్రిక, జనకతనయి సీతాదేవితో భద్రాచల మిథిలా స్టేడియంలో అంగరంగ వైభవంగా చైత్ర శుద్ధ నవమి నాడు అభిజిత్ లగ్నంలో నిర్వహించనున్నారు. దేశ విదేశాల నుంచి వేలాది భక్తులు శ్రీ సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు తరలి వచ్చారు… శ్రీ సీతారాముల కళ్యాణం గురించి భాస్కర న్యూస్‌ పాఠకులకు అందిస్తున్న ప్రత్యేక కథనం….

దక్షిణ అయోధ్య.. భద్రాచలం, భద్రగిరిలో జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి ఎంతో విశిష్టత ఉంది. అంతేకాదు.. భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానానికి సంబంధించి కూడా అనేక విశేషాలు ఉన్నాయి. గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయాన్ని ముందుగా వెలుగులోకి తెచ్చింది పోకల దమ్మక్క అనే ఆదివాసీ మహిళ. అనంతరం భక్త రామదాసుగా పిలవబడే కంచర్ల గోపన్న నిజాం నవాబుల సుంకం పైసలతో ఈ ఆలయాన్ని నిర్మించడం అందరికి తెలిసిన చరిత్రే. స్వయంగా రాములవారే తన సోదరుడు లక్ష్మణ్ స్వామితో కలిసి తానీషా వద్దకు వెళ్ళి రామదాసును చెర నుంచి విడిపించారనేది చరిత్ర. సినిమాల్లో కూడా ఇది ప్రస్ఫుటించింది. భద్రాచలం దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం నాలుగు చేతులతో కుడి చేతిలో బాణంను, ఎడమ చేతిలో విల్లు దర్శనమిస్తాయి. అలాగే మహావిష్ణువు మాదిరిగా కుడిచేతిలో శంఖును ఎడమచేతిలో చక్రంను ధరించి ఉంటారు శ్రీరామ చంద్రుడు. భద్రుని కోరిక మేరకు వైకుంఠం నుండి విచ్చేసిన విష్ణుమూర్తి నాలుగు భుజములతో దర్శనం ఇవ్వటంవల్ల వైకుంఠరామునిగా ఈ క్షేత్రంలో శ్రీరామ చంద్రుడు దర్శనమిస్తారు. దేవాలయములో స్వామి ఎడమ తొడపై ఆసీనవతియై ఇరువురు ఒకే పీఠంపై ఉంటారు. లక్ష్మణుడు రామునికి కుడివైపున ఉండటం ఇక్కడి ప్రత్యేకత.

1960 కాలం నాటికి రామాలయం బాగా శిథిలమై పోయింది. అప్పటి దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కల్లూరి చంద్రమౌళి రామాలయ పునః నిర్మాణానికి నడుం బిగించారు. రాష్ట్రం నలుమూలల నుంచి విరాళాలు సేకరించారు. తమిళనాడుకు చెందిన గణపతి స్థపతి, 500 మంది శిల్పుల సహకారంతో ఆ కాలంలో 3 లక్షల ఖర్చుతో సకల కళా శోభితమైన కళ్యాణ మండపం నిర్మించారు. రంగనాయకుల గుట్టపై రామదాసు ధ్యాన మందిరం, శిల్ప శోభాయ మానమైన గోపురాలు నిర్మించారు. ప్రధాన ఆలయాన్ని పూర్తిగా నల్లరాతితో సౌందర్య శిల్పాలతో నిర్మించారు. 32 టన్నుల ఏకశిలతో ఆలయ విమానం ఏర్పాటు చేశారు. ఈ విమానం మూడు అంతస్తులు కలిగి అన్ని దేవతా మూర్తుల శిల్పాలతో శోభాయమానమైంది.

భద్రాచలం నుండి 4.5 కి.మీ దూరంలో ఉన్న గుండాల గ్రామంలో త్రిమూర్తులు శీతాకాలంలో తరచుగా వేడి నీటి బుగ్గలలో స్నానం చేస్తారని నానుడి. కూతవేటు దూరంలోని ఎటపాక గ్రామంలో రావణుడు సీతను లంకకు తీసుకెళ్తుండగా, జటాయువు అనే పక్షి సీతను కాపాడటానికి రావణుడితో పోరాడిందని, ఆ పోరాటంలో ఒక రెక్క ఇక్కడ పడిపోవడం వల్ల దాని కోసం ఒక చిన్న ఆలయం నిర్మించ బడిన జ్ఞాపకార్థం జటాయువు అనే ప్రదేశం కాలక్రమేణా ఏటపాకగా మారినట్లు చరిత్ర.

పర్ణశాలలో వేంచేసి ఉన్న రాముడిని ఆత్మరాముడు అని పిలుస్తారు. ఇక్కడ రాముడు ఖరదేయోషణుడు నేతృత్వంలోని 14,000 మంది రాక్షసులను చంపాడని చెబుతారు. ఈ రాక్షసుల బూడిదపై ఈ గ్రామం నిర్మించబడిందని చెబుతారు కాబట్టి, ఈ ప్రదేశానికి దుమ్ముగూడెం అని పేరు పెట్టారు. పాల్వంచ సమీపంలోని కిన్నెరసాని అభయరణ్యం పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. భద్రాచలం నుంచి శ్రీరామగిరి ప్రాంతానికి వెళ్లి అక్కడ నుంచి పాపికొండలు పడవ ప్రయాణం చేయడం ఒక అనుభూతి. శ్రీ సీతారాములు కళ్యాణం కోసం వచ్చే భక్తులు పుణ్యకార్యంతో పాటు, విహార యాత్ర, చరిత్ర గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంది.

సీతారాముల కళ్యాణం చూడటానికి విచ్చేసే భక్తుల కోసం విజయవాడ, హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి.రోడ్డు మార్గంలో చేరేందుకు రవాణా సౌకర్యం చక్కగా ఉంది. రైలు మార్గంలో వచ్చేవారు కొత్తగూడెంలో దిగి రోడ్డు మార్గం ద్వారా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలం చేరుకోవాలి. భద్రాచలం పట్టణం నుంచి గుండాల గ్రామం నాలుగున్నర కిలోమీటర్లు ఉంటుంది. ఒక్కొక్క ప్రయాణికునికి 50 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఎటపాక గ్రామం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. సర్వీస్ ఆటోలు 20 రూపాయలు నుంచి 30 రూపాయలు తీసుకుంటారు. పర్ణశాల భద్రాచలం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. సర్వీస్ ఆటోలు కూడా ఉంటాయి. కారు స్టాండ్ నుంచి కార్లు కూడా ఉంటాయి. ఆర్టీసీ బస్సు కోసం రానుపోను 120 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆటోలకైతే 200 రూపాయలు. టాక్సీ కోసం 2,500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పాపికొండలు సందర్శించాలంటే భద్రాచలం నుంచి టూర్ ఆపరేటర్లు 1,500 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు వసూలు చేసి ఏర్పాట్లు చేస్తారు. భద్రాచలం నుంచి రవాణా లాంచీలో భోజనం తదితర ఏర్పాట్లు వారిని నిర్వహిస్తారు. కిన్నెరసాని ప్రాజెక్టు భద్రాచలం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాల్వంచ వరకు బస్సులో చేరుకుని అక్కడ నుంచి వివిధ మార్గాలలో కిన్నెరసాని ప్రాజెక్టు సందర్శించవచ్చు. అక్కడికి వెళ్లిన వారు బోట్ షికారు మరవకండి. ఈ మధ్యకాలంలోనే భద్రాచలం ఐటిడిఎ ప్రాంగణంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేశారు. సందర్శకులకు ఆదివాసి సంస్కృతిని పరిచయం చేయటంతో పాటు వినోదాన్ని కూడా అందిస్తుంది. ఈ ట్రైబల్‌ మ్యూజియంను ఉచితంగానే సందర్శించవచ్చు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com