బర్డ్ ఫ్లూ మళ్లీ వెంటాడుతోంది. ఈసారి తెలంగాణలో కలకలం సృష్టిస్తోంది. తాజాగా హైదరాబాద్ శివారులో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు బయట పడ్డాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోని బాటసింగారం ప్రాంతంలో అధికారులు ఈ బర్డ్ ఫ్లూ గుర్తించారు. బాటసింగారం లోని ఓ కోళ్ల ఫారంలో ఉన్న కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. ఆ కోళ్ల ఫారం సామర్థ్యం 36 వేల కోళ్లు కాగా, ఇప్పటికే వేలాది కోళ్లు మరణించాయి. వీటికి తోడు తాజాగా మరో 17 వేల కోళ్లను పూడ్చి పెట్టినట్లు రంగారెడ్డి జిల్లా పశువైద్య, పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ బాబు బేరి తెలిపారు. కోళ్ల ఫారం వద్ద సిబ్బందితో కలిసి మరికొన్ని కోళ్లను చంపి మట్టిలో పూడ్చేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు.
మరోవైపు.. అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు గుర్తించిన క్రమంలో వైద్యశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. గ్రామంలో ఇంటింటి సర్వే చేపట్టారు. ఎవరైనా బర్డ్‌ఫ్లూ లక్షణాలతో ఉన్నారా? అని వారి వివరాలు సేకరిస్తున్నారు. జిల్లా వైద్యశాఖ సర్వేలెన్స్ అధికారి డాక్టర్ అంబిక, అబ్దుల్లాపూర్‌మెట్ పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రసన్న లక్ష్మి.. వైద్య బృందాలతో గ్రామంలో సర్వే నిర్వహిస్తున్నారు.
ఇటు.. అబ్దుల్లాపూర్ మెట్ మాత్రమే కాకుండా.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం, చిట్యాల మండల పరిధుల్లోని కోళ్ల షెడ్లలోని కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులకు సమాచారం అందుతోంది. దీంతో.. అధికారులు పూర్తి స్థాయిలో కోళ్లకు పరీక్షలు నిర్వహించడంలో నిమగ్నమయ్యారు. వైరస్ సోకిన కోళ్లను పూడ్చేసేందుకు సిద్ధమవుతున్నారు.