గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీలిచ్చి.. గాలికొదిలేస్తే.. తాము ఇచ్చిన మాట ప్రకారం నిర్వాసితులకు ఉద్యోగాలిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు చెప్పారు. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థలో 163 మంది కొత్తగా నియమితులైన ఉద్యోగులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ సైబర్ గార్డెన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన గత పాలకులు.. చాలా సంవత్సరాలుగా ఇవ్వకపోవడంతో చాలా మందికి వారి వయసు కూడా దాటిపోయిందన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ప్రొడక్షన్ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్‌కు ప్రజాభిప్రాయ సేకరణ చేయించి, అనుమతులు తీసుకొచ్చి పనులు మొదలుపెట్టి పూర్తి చేశామన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులు పూర్తి చేయడానికి అధికారులకు క్యాలండర్ ఫిక్స్ చేసి వారం, 15 రోజులు, నెల వారీగా సమీక్షలు చేసి పనులు పూర్తి చేయించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్లాంటును ప్రారంభించడం జరిగిందన్నారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా తాను సమిష్టిగా ఆలోచన చేసి భూములు ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని ప్రకటించామని.. ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం అర్హత కలిగిన 112 మందికి యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తున్నామన్నారు. అలాగే, ఆర్థిక శాఖలో 51 మందికి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్కి నియామక పత్రాలు అందజేశామన్నారు. 35 సంవత్సరాల పాటు ప్రజలకు సేవ చేసే అవకాశం మీకు ఇందిరమ్మ ప్రభుత్వం ఇస్తున్నదన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆర్థికంగా తమ కుటుంబాలను నిలబెట్టుకోవచ్చని, ఆత్మగౌరవంతో బతుకొచ్చని రాష్ట్రం కోసం పోరాడిన నిరుద్యోగ యువతీ యువకుల ఆశల నిజం చేయడానికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పమని చెప్పిన సందేశాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నానన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 59,000 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించామన్నారు. ఉద్యోగ అవకాశాలు పొందలేని నిరుద్యోగ యువతీ యువకుల కోసం 9,000 కోట్ల రూపాయలతో స్వయం ఉపాధి పథకాలు అందించడానికి రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రారంభించామన్నారు. తన రాజకీయ జీవితంలో, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఒకే సంవత్సరం స్వయం ఉపాధి పథకాల కోసం 9,000 కోట్ల రూపాయలు కేటాయించిన చరిత్ర ఏ ప్రభుత్వానికి లేదన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా ప్రకటన చేసి వదిలేయడం లాంటి పని చేయకుండా రాజీవ్ యువ వికాస పథకం ప్రకటనకు ముందే దరఖాస్తుల ప్రక్రియ, లబ్ధిదారుల ఎంపిక, సాంక్షన్, గ్రౌడింగ్ చేసేంత వరకు క్యాలెండర్ ముందుగానే ప్రకటించామన్నారు.
అదే విధంగా లక్షల మంది యువతీ యువకులకు ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగాలు కల్పించడానికి హైదరాబాద్ నగరంలో ఐటీ సెక్టర్, నాలెడ్జ్ వ్యవస్థలను ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదన్నారు. నాడు కొండలు గుట్టలు ఖాళీ ప్రదేశాలుగా ఉన్న హైటెక్ సిటీ ప్రాంతంలో ఐటి సెక్టార్ నెలకొల్పడానికి ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వేసిన పునాదులు, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా ఐటి సెక్టార్ ను అభివృద్ధి చేయడంతో ఈరోజు హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారడం వల్ల ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న సంస్థలు ఇక్కడికి వచ్చి కంపెనీలు పెట్టడం వల్ల లక్షలాదిమంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. హైదరాబాద్ నగరాన్ని విస్తరించి ప్రపంచంలో పేరు ప్రఖ్యాతి పొందిన సంస్థలను తీసుకురావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్‌కు వెళ్లి లక్ష 84 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంవోయూ చేసుకున్నారన్నారు.
హైదరాబాద్ నగరాన్ని విస్తరించడంలో భాగంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం.. అందులో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. అవుటర్ రింగ్ రోడ్ – రీజినల్ రింగ్ రోడ్ మధ్య చేయాల్సిన అభివృద్ధి పట్ల ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తున్నామని భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రగతి నిరోధకులు చేస్తున్న కుట్రల పట్ల అప్రమత్తంగా ఉంటూ నిరుద్యోగ యువతీ యువకులు అభివృద్ధి వైపు ముందుకు వెళ్లాలన్నారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశం, ప్రపంచంతో పోటీపడాలని.. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు తయారు చేసుకొని ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతున్నదన్నారు. రాష్ట్ర ఆవిర్భావం కోసం ఆశించి పోరాడిన యువతకు ఉద్యోగాలు కల్పిస్తేనే రాష్ట్రం తెచ్చుకున్న దానికి అర్థం పరమార్థం ఉంటుందని ఆలోచనతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని చెప్పారు.
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామం యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూ నిర్వాసితుల కోటాలో ఉద్యోగాలు పొందిన జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ప్లాంట్ అటెండెన్స్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, హౌస్ కీపర్స్ తో పాటు టీజీపీఎస్సీ ద్వారా ఆర్దిక శాఖలో నూతనంగా నియామకమైన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ కు నియామక పత్రాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అందజేశారు.