ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో శుక్రవారం ఉదయం 6.30 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. సచివాలయంలోని రెండో బ్లాకులో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించినట్లు గుర్తించారు. రెండో బ్లాక్ నుంచి మంటలతో పాటు దట్టమైన పొగ వస్తుండటంతో వెంటనే అప్రమత్తమైన ఎస్పీఎఫ్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారి సమాచారంతో సచివాలయం చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదం జరిగిన రెండో బ్లాకులోనే డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తదితర మంత్రుల కార్యాలయాలు ఉన్నాయి. అయితే అగ్నిప్రమాదం జరిగిన నేపథ్యంలో ఏపీ సచివాలయంలో పోలీసులు రాకపోకలపై ఆంక్షలు విధించారు. గుర్తింపు కార్డు చూపిన తరువాతనే సచివాలయ సిబ్బందిని లోపలికి అనుమతిస్తున్నారు. అగ్నిప్రమాదాన్ని చిత్రీకరించాలని, వివరాలు సేకరించాలని ప్రయత్నిస్తున్న మీడియాను మాత్రం సచివాలయంలోపలికి అనుమతించడం లేదు. పై అధికారుల నుంచి అనుమతి వచ్చిన తరువాత మాత్రమే మీడియాను లోపలికి అనుమతిస్తామని పోలీసులు చెపుతున్నారు. హోమంత్రి అనిత అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని పరిస్ధితులను పరిశీలించారు. జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, ఫైర్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ లు అగ్ని ప్రమాదానికి గల కారణాలను హోంమత్రికి వివరించారు. అయితే అగ్ని ప్రమాదం జరిగిన బ్యాటరీ రూమ్‌లో ఫైర్ అలారం లేకపోవడం పట్ల హోంమంత్రి అనిత అసహనం వ్యక్తం చేశారు. ఫోరెన్సిక్ నిపుణులు సచివాలయానికి చేరకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి స్ధాయి దర్యాప్తుకు హోంమత్రి అనిత ఆదేశించారు. సచివాలయంలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహిస్తామని, భవిష్యత్ లో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపడతామని హోంమంత్రి అనిత తెలిపారు.
- Advertisement with us -