-
రూ.710కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ
-
పల్లెవెలుగు-స్వర్ణగ్రామం పేరుతో స్పెషల్ ప్రోగ్రాం
-
నోడల్ ఏజెన్సీగా డ్రోన్ కార్పొరేషన్..
-
బార్ లైసెన్స్ ఫీజు తగ్గింపు
-
ఏపీ మీడియా అక్రిడేషన్ రూల్స్-2025కి ఆమోదం
-
రాష్ట్రంలో మరో ప్రైవేట్ పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్
ఏపీ సచివాలయంలో గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనేక అంశాలపై మంత్రివర్గం చర్చించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం కేబినెట్ నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు.
ఏపీలో డ్రోన్ కార్పొరేషనను ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు కేబినెట్లో ఆమోదం లభించింది.అలాగే రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నింటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించాలని నిర్ణయించింది.
అనకాపల్లి జిల్లాలోని డీఎల్ పురం వద్ద ప్రైవేట్ క్యాపిటివ్ పోర్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో త్రీ స్టార్, ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజుల కుదింపునకు కూడా ఆమోదం లభించింది. బార్ లైసెన్స్ ఫీజును రూ.65 లక్షల నుంచి రూ.25 లక్షలకు కుదిస్తూ మరో నిర్ణయం తీసుకున్నారు. అలాగే యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖల్లోని పలు జీవోల ర్యాటిఫికేషన్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు రూ.710కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
అలాగే, ఏపీ మీడియా అక్రిడేషన్ రూల్స్-2025కి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. నాగార్జునసాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు కూడా మంత్రులు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ జలహారతి కార్పొరేషన్ ద్వారా పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన చేయబోతున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు భూ కేటాయింపులతో పాటు ఇతర నిర్ణయాలు కూడా ఈ భేటీలో తీసుకున్నారు.
మరోవైపు.. పల్లె వెలుగు స్వర్ణ గ్రామం కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ కార్యక్రమం కింద ప్రతినెలా 2 రాత్రులు, 3 పగళ్లు ఐఏఎస్ అధికారులు ప్రజలతో మమేకమవ్వాల్సి ఉంటుంది. ప్రజాప్రతినిధులు కూడా నెలకు 4 రోజులు పల్లె నిద్ర చేసి పల్లెల్లో సమస్యలు పరిష్కరించాలి.