25.1 C
Hyderabad
Saturday, June 27, 2026

Live Video

spot_img

ట్రంప్ టారిఫ్ ల దెబ్బ.. భారత్ ఏం చేస్తుంది?

  • మన అభివృద్ధికి కీలకం క్రూడాయిల్‌
  • అన్నిరంగాలకూ క్రూడాయిలే చోదక శక్తి
  • వ్యవసాయం, పరిశ్రమలు,పెట్రోకెమికల్స్
  • ప్లాస్టిక్, మాన్యుఫాక్చరింగ్, ఇంధన ఉత్పత్తి రంగం
  • ఇలా మన యాక్టివిటీకే ముడి చమురు కీలకం
  • రష్యా నుంచి ఎక్కువగా క్రూడాయిల్ దిగుమతి
  • కన్నెర్ర చేస్తున్న ట్రంప్.. ఇప్పటికే ఆంక్షల విధింపు
  • క్రూడాయిల్‌ పై సెకండరీ టారిఫ్‌ వేసే ఛాన్స్..
  • అదే జరిగితే భారత్ నడ్డి విరిగినట్లే..
  • ప్రత్యామ్నాయ క్రూడాయిల్ సేకరణలో ప్రభుత్వ వర్గాలు
  • అమెరికా సహా ఇతర దేశాలనుంచి కొనుగోళ్ల స్ట్రాటజీ

మన దేశంలో లేనిది, అభివృద్ధికి కీలకమైనది క్రూడాయిల్‌.. మెజారిటీ పరిశ్రమలు, రవాణా వాహనాలు,పెట్రోకెమికల్స్ కంపెనీలు, ప్లాస్టిక్ పరిశ్రమలు, ఇంధన ఉత్పత్తి రంగాలు, మాన్యుఫాక్చరింగ్‌, వ్యవసాయం రంగాలు ముడి చమురు బై ప్రోడక్ట్స్ ను వినియోగించుకుంటూ ఉంటాయి. అందుకే రిఫైన్డ్ ఆయిల్‌ కన్నా ముడి చమురు అవసరం మనకు ఎక్కువ. సహజమైన క్రూడాయిల్‌ నిక్షేపాలు మనకు లేవు కాబట్టి ఇతర దేశాలపై ఆధారపడక తప్పదు.

మెజారిటీ రష్యా నుంచే

క్రూడాయిల్‌ నిక్షేపాలు అపారంగా కలిగిన రష్యాపై ఇప్పటికే ఆంక్షలు విధించిన అమెరికా ఇప్పుడు భారీగా టారిఫ్‌ లు కూడా విధించాలని నిర్ణయించుకుంది. మన దేశానికి క్రూడాయిల్‌ ఎక్కువగా రష్యానుంచే దిగుమతి అవుతుంది.2025 మార్చిలో మన దేశం రోజుకు 5 మిలియన్ బ్యారెల్స్ క్రూడాయిల్‌ దిగుమతి చేసుకుంటోంది. 15 ఏళ్లలో ఒక నెలలో ఒక రోజులో అత్యధికంగా దిగుమతి చేసుకున్న సందర్భం కూడా ఇదే.

ఉక్రెయిన్ సాకు చెప్పి..ట్రంప్ అరాచకం

ఉక్రెయిన్ తో రష్యా యుద్ధానికి ముగింపు పలకకపోతే ఫలితాలు దారుణంగా ఉంటాయని ట్రంప్ మొన్నే హెచ్చరించారు. ఇప్పటికే ఆంక్షలు అమలు చేస్తున్న అమెరికా ఇప్పుడు సెకండరీ టారిఫ్‌ లను కూడా ప్రకటిస్తోంది. యుద్ధ విరమణకు తాను చేస్తున్న ప్రయత్నాలకు గండి కొడుతున్నారంటూ రష్యానుంచి క్రూడాయిల్‌ దిగుమతి చేసుకుంటున్న దేశాలపై 25నుంచి 50 శాతం టారిఫ్ వేయాలని నిర్ణయించారు. అంతేకాక రష్యానుంచి ఆయిల్‌ కొనుగోలు చేసిన దేశాలు తమ దేశంతో వ్యాపారం చేయలేవని కూడా ప్రకటించారు. అలా భారత్‌ పై ఈ టారిఫ్‌ దెబ్బ పరోక్షంగా పడనుంది. ముడి చమురు ధరలు ఆకాశాన్నంటడంతో అమెరికా ఆంక్షల ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాలపై పడనుంది. ఈ ప్రభావం భారత్ పై ఎక్కువగా పడనుంది. కారణమేమంటే మనం మెజారిటీ క్రూడాయిల్‌ రష్యానుంచే దిగుమతి చేసుకుంటున్నాం. మన మొత్తం క్రూడాయిల్‌ దిగుమతిలో 30 శాతం రష్యానుంచే వస్తోంది. కాబట్టి భారత్ కూడా ఈ టారిఫ్‌ ల దెబ్బ తినక తప్పదు. పైగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్దం మొదలైనప్పటినుంచి మన దేశం మిడిల్‌ఈస్ట్, ఆఫ్రికా దేశాల నుంచి ఆయిల్‌ దిగుమతులు తగ్గించేసింది. కారణం రష్యా ముడిచమురు చాలా చవకగా దొరకడం.ఇది రిఫైనరీలకు లాభం కలిగిస్తుంది.బైడెన్ హయాంలోనే రష్యాపై ఆంక్షలున్నా.. దాని చమురు వ్యాపారం తగ్గలేదు సరికదా ప్రపంచ దేశాలు అక్కడనుంచే కొనడం మొదలు పెట్టాయి. ఇప్పుడు ట్రంప్ సెకండరీ టారిఫ్‌ లు విధిస్తే మన దేశం ఇతర రంగాల ఎగుమతుల విషయంలో అమెరికానుంచి ఎదురు దెబ్బ తినక తప్పదు. చవకగా వచ్చే క్రూడాయిల్‌ గురించి చూసుకుంటే ఇతర రంగాల దిగుమతులు, ఎగుమతులపై పడే సెకండరీ టారిఫ్‌ల భారం తడిసిమోపెడవుతుంది. మన వాణిజ్యమే దెబ్బ తిని ఆర్థిక నష్టాలను చవిచూసే ప్రమాదముంది.

భారత్ ప్రత్యామ్నాయ ప్రయత్నాలు..

ట్రంప్ ఇలా రోజుకోసారి భయపెడుతుండటంతో మన ఆయిల్‌ కంపెనీలు ఇప్పటికే ప్రత్యామ్నాయం వేట మొదలు పెట్టాయి. రష్యాపై ఆధారపడటం తగ్గించి మిడిల్ ఈస్ట్, నార్త్ సీ, మధ్య ప్రాచ్య దేశాల నుంచి మే నెలకు అవసరమైన అదనపు క్రూడ్ నిల్వల కొనుగోళ్లకు ప్లాన్ చేసుకుంటున్నాయి. ఈ ప్రయత్నాలు రష్యా నుంచి తీసుకుంటున్న చమురుకు ప్రత్యామ్నాయంగా నిలవగలవా అన్నదే అసలు సమస్య.

భారత్ ఏం చేస్తుంది?

అమెరికా ఆంక్షల కొరడా ఝుళిపిస్తుండటంతో భారత వర్గాలు రష్యానుంచి నేరుగా కొనకుండా మధ్య దళారీలు, మర్చంట్లు,షిప్పర్ల ద్వారా సరఫరా ఏర్పాట్లు చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. వాషింగ్టన్ బ్లాక్ లిస్టులో లేని చమురు అమ్మే కంపెనీలు, ట్యాంకర్లు, ఇన్సూరెన్సు ప్రొవైడర్లను సంప్రదిస్తున్నాయి.

రష్యాపై ఆధారపడటం తగ్గించేయాలని మన దేశం భావిస్తోంది. అంగోలా, బ్రెజిల్‌, పశ్చిమాఫ్రికా దేశాల నుంచి కూడా ఆయిల్‌ కొనేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఒక వైపు రష్యా నుంచి చమురు కొంటూనే అమెరికా నుంచి కూడా చమురు కొనుగోళ్లు పెంచింది.మార్చి నెలలోనే రోజుకు దాదాపు రెండు లక్షల బారెళ్ల చమురును మనదేశం అమెరికానుంచి కొనుగోలు చేసింది. ఇలా వేర్వేరు మార్గాల్లో వేర్వేరు దేశాల నుంచి దొరికినంత కొనడం ద్వారా మన ఆయిల్‌ అవసరాలు తీరతాయని భావిస్తున్నారు. అయితే టారిఫ్ల కొరడా అమెరికానుంచి చమురు కొనుగోళ్లను పెంచుకోడానికి ట్రంప్ చేస్తున్న హెచ్చరికలేనని వాణిజ్య రంగ నిపుణులు అంటున్నారు.ఏదేమైనా మన దేశం ఇలా రకరకాల ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధారపడటమే మనముందు ఇప్పుడున్న ప్రత్యామ్నాయం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com