బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నాయకులతో ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో మంగళవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
ఈ నెల 27వ తేదీన వరంగల్‌లో జరగనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాట్లపై చర్చించారు. బహిరంగ సభ ఏర్పాట్లపై వరంగల్ జిల్లా నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేతలు హాజరయ్యారు. ఈ సమావేశం సుమారు ఆరు గంటల పాటు సుదీర్ఘంగా సాగింది.
ఈ నెల 27వ తేదీన వరంగల్‌లో బీఆర్‌ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటి నుంచే నియోజకవర్గాల వారిగా సన్నాహక సమావేశం పెట్టుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఒక్క నియోజకవర్గం నుంచి లక్ష మందికి తగ్గకుండా లక్షలాది మందితో సభ నిర్వహించేలా ప్లాన్ చేయాలని కేసీఆర్ సూచించారు. ఈ బహిరంగ సభతో రాష్ట్రంలో పెను మార్పులు వస్తాయని కేసీఆర్ చెప్పారు.
తెలంగాణ తెచ్చిన బీఆర్‌ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి తేడా ఎంటో ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారని మాజీ సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. నిత్యం ప్రజల్లో ఉంటే రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ గెలుపు నల్లేరుపై నడకే అవుతుందన్నారు గులాబీ బాస్. ఇది బహిరంగ సభ కాదని, తెలంగాణ బాగు కోసం నిర్వహించే సభ అని కేసీఆర్ అభివర్ణించారు.