నియమించిన ఏడాదిలోపే తొలగింపులు
జోమాటో అసోసియేట్ యాక్సిలరేటర్ ప్రోగ్రాం పేరిట రిక్రూట్మెంట్లు
జొమాటో.. ఈ రోజుల్లో దాదాపు ఈ యాప్ గురించి తెలియని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ. ఈ సంస్థ సుమారు 500 మంది ఉద్యోగులను ఉన్నఫళంగా తొలగించింది. కనీసం నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వకుండా.. ఉద్యోగాల్లోంచి తీసేసింది. కస్టమర్ సపోర్ట్ అసోసియేట్స్‌గా పనిచేస్తున్న వారిని విధుల నుంచి తొలగించింది. వాస్తవానికి వీళ్లను నియమించుకొని యేడాది కూడా పూర్తి కాలేదు. కానీ, యేడాది లోపే వీళ్లను తొలగించడం చర్చను లేవనెత్తింది.
కస్టమర్ సపోర్ట్ డిపార్ట్మెంట్లో దాదాపు యేడాది క్రితం జొమాటో అసోసియేట్ యాక్సిలరేటర్ ప్రోగ్రాం పేరుతో 1,500 మందికి జొమాటో ఉద్యోగాలు ఇచ్చింది. అయితే, ఇప్పుడు తొలగించిన 500 మంది ఉద్యోగుల్లో చాలామంది పనితీరు సరిగా లేదని, సమయపాలన సరిగా పాటించడం లేదని జొమాటో చెబుతోంది. అందుకే నోటీసు పీరియడ్ కూడా ఇవ్వకుండానే వీళ్లను తొలగించినట్లు చెబుతున్నారు. అయితే, తొలగించిన ఉద్యోగులకు ఒక నెల జీతాన్ని పరిహారంగా చెల్లించినట్లు తెలుస్తోంది.
కస్టమర్ సపోర్ట్ సిస్టంను ఆటోమేట్ చేయడంతోపాటు, ఖర్చులను తగ్గించుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐని వినియోగించుకునేందుకు జొమాటో ఆలోచనలు చేస్తోంది. ఈ క్రమంలోనే 500 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. అయితే, ఈ ఉద్యోగుల తొలగింపుపై జొమాటో మేనేజ్మెంట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.