వరుస భూకంపాలు ఇప్పుడు ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటికే మయన్మార్, థాయ్‌లాండ్, ఇండోనేషియాలో భూమి కంపించగా.. లెటెస్ట్‌గా టోంగా ఐలాండ్ సమీపంలో భారీ భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.1గా నమోదైంది.
ఇప్పటికే ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. 4.6 మాగ్నిట్యూడ్ తీవ్రత నమోదయింది. భూమిలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా దీవుల్లో ఈసారి భూమి కంపించింది. టోంగాలోని పంగై గ్రామానికి ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
తీవ్రత ఎక్కువగా ఉండటంతో సునామీ హెచ్చరికలను జారీ చేశారు అధికారులు. నియు, టోంగా తీరాల్లో అలల స్థాయి 0.3 మీటర్ల నుంచి 1 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పడంతో ఆందోళనలు మొదలయ్యాయి. భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల పరిధిలో సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని చెప్పడంతో ప్రజలు అలర్టయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు లేదా తీర ప్రాంతానికి దూరంగా వెళుతున్నారు.
మొత్తం 190 చిన్న చిన్న ద్వీపాల సమూహంగా ఉండే టోంగాలో దాదాపు లక్ష మంది వరకు జీవిస్తారు. ఇప్పుడు రాకాసి అలలు ఎగిసి పడితే వారి పరిస్థితి ఏంటన్నది అర్థంకావడం లేదు. అయితే ఎక్కువ ప్రమాదం ఉండదని అధికారులు చెబుతున్నారు.