మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 50 మంది మావోయిస్టులు దండకారణ్యాన్ని వదిలి.. జనజీవన స్రవంతిలో కలిసిపోతామంటూ పోలీస్ ఉన్నతాధికారుల మందు లొంగిపోయారు. ఇప్పటికే పదుల సంఖ్యలో భద్రతా బలగాల గన్లకు బలవుతుంటే.. ఇప్పుడు అంతకంటే ఎక్కువ సంఖ్యలో లొంగిపోతుండటం మావోయిస్టులకు భారీ దెబ్బే అని చెప్పాలి.
తాజాగా లొంగిపోయిన వారిలో 14 మంది కోసం చాలా రోజులుగా వెతుకుతున్నాయి భద్రతా బలగాలు. వీరిలో ఒక్కొక్కరిపై రూ.8లక్షల రివార్డు ఉన్నట్టు గుర్తించారు. మొత్తం 14 మందిపై రూ.68 లక్షల రివార్డులు ఉన్నాయి. ఈ ఏడాదిలో 134 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టగా.. ఇందులో 118 మంది బస్తర్ డివిజన్లోని వారే. ఇక బస్తర్ రీజియన్‌లోనే ఈ ఏడాది ఏకంగా 792 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
భద్రతా బలగాలు తీసుకుంటున్న చర్యలే ఈ లొంగుబాటుకు కారణమని చెప్పక తప్పదు. ఒకప్పుడు భద్రతా బలగాలు అడుగు పెట్టేందుకే అవకాశం లేని పరిస్థితి నుంచి ఇప్పుడు రోజురోజుకు చొచ్చుకుంటూ వెళుతూ మొత్తం దండకారణ్యాన్ని జల్లెడ పెడుతూ పదుల సంఖ్యలో మట్టుపెడుతున్నారు. ఈ మధ్య ఎన్కౌంటర్లు భారీగా పెరిగాయి. మావోయిస్టుల మృతుల సంఖ్య అంతకన్నా పెరిగింది. రకరకాల ఏజెన్సీలన్ని కలిసి జాయింట్ ఆపరేషన్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే వచ్చే ఏడాది నాటికి మావోయిస్టు రహిత భారత్‌గా మార్చాలని కేంద్రం కంకణం కట్టుకుంది.
డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు, బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, CRPF, కోబ్రా కమాండో.. ఇలా అనేక డివిజన్స్ ఇప్పుడు దండకారణ్యంలో మాటువేసి మరీ వేట కొనసాగిస్తున్నాయి. మరోవైపు మావోయిస్టులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలంటూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు కారణాలతో మావోయస్టులు గన్లు వదిలేందుకు రెడీ అవుతున్నారు.