తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఇటీవల ప్రవేశ పెట్టిన వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ భేషుగ్గా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తాను కలిసి జోడెడ్ల మాదిరిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రయత్నిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. శ్రీ విశ్వావసు నామ ఉగాది పర్వదినం సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పంచాంగ శ్రవణం వేడుకల్లో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
తన మిత్రులు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ వేద పండితులు పంచిన ఉగాది ప్రసాదం లాగా షడ్రుచులతో ఉన్నదని సీఎం రేవంత్ అభివర్ణించారు. తీపి, పులుపు , కారం కాస్త కూసో ఉప్పు కూడా ఉందని, ఎందుకంటే కొన్ని అంశాల్లో నియంత్రణ, మరికొన్ని అంశాల్లో ఆయన చాలా లిబరల్‌గా ముందుకు వచ్చారని రేవంత్ తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ, రైతులు పండించిన పంటకు సంపూర్ణ సహకారం అందించి గిట్టుబాటు ధరలు ఇచ్చి పంటలను వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, అదేవిధంగా పేదలకు వైద్యం అందించాలని, నిరుపేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలని, భట్టి విక్రమార్క తన బడ్జెట్‌లో విద్య, వైద్యం, పరిశ్రమలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు అత్యధిక నిధులు కేటాయించారని సీఎం తెలిపారు. ఈ ఉగాది సందర్భంగా భట్టి విక్రమార్కకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని రేవంత్ అన్నారు.