తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజ్‌భవన్ వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటలకు రేవంత్ రెడ్డి రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు. గవర్నర్‌ను కలిసిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం సహా మంత్రులు గవర్నర్‌కు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గవర్నర్‌తో పలు అంశాలపై చర్చించారు. మంత్రివర్గం విస్తరణ పైనే సీఎం రేవంత్ గవర్నర్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
తెలంగాణ కేబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆరు స్థానాల్లో నాలుగు మంత్రి పదవుల భర్తీకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఉగాది తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవడం మరింత బలం చేకూరుస్తోంది. ఏప్రిల్ మూడో తేదీన కేబినెట్ విస్తరణ అవకాశం ఉండవచ్చునని తెలుస్తోంది.
సామాజిక సమీకరణాలు, జిల్లాలకు ప్రాతినిథ్యం వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకుని మంత్రివర్గంలో ఖాళీలు భర్తీ చేయాలని రేవంత్ సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు కేబినెట్‌లో ప్రాతినిధ్యం లేదు. దీంతో ఈ జిల్లాలకు కేబినెట్లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.