భారత దేశంలో కుబేరుల సంఖ్య పెరుగుతోంది. కుబేరుల దగ్గర సంపద కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఎంతలా అంటే.. భారత దేశ జీడీపిలో మూడోవంతు సంపద అత్యంత ధనవంతుల దగ్గరే ఉంది. భారత జీడీపీ రూ.350లక్షల కోట్లు. వీటిలో మూడోవంతు కుబేరుల దగ్గరే ఉందట. ఇక, కేవలం 284 మంది కుబేరుల దగ్గరే రూ.98లక్షల కోట్ల సంపద ఉందని తేలింది.
2025 గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025ను హురూన్ సంస్థ విడుదల చేసింది. ఆ జాబితాలో ఈ వివరాలను వెల్లడించింది. కనీసం రూ.8,500 కోట్ల సంపద ఉన్న వారితో హురూన్ ఈ జాబితాను రిలీజ్ చేసింది.
దేశంలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ బాస్ ముకేశ్ అంబానీ.. ప్రపంచంలోని టాప్-10 కుబేరుల జాబితాలో ఈసారి స్థానం కోల్పోయారు. యేడాది వ్యవధిలోనే ఆయన సంపద విలువ 13 శాతం తగ్గి రూ.8.6 లక్షల కోట్లకు పరిమితమైంది. అయినప్పటికీ.. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. మరోవైపు.. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ.. ప్రపంచంలోనే గతేడాది అత్యధికంగా సంపద పెంచుకున్న వ్యక్తిగా నిలిచారు. ఆయన సంపద రూ.1 లక్ష కోట్ల మేర పెరిగి రూ.8.4 లక్షల కోట్లకు చేరుకుంది.
భారత జీడీపీ రూ.350 లక్షల కోట్లలో, కుబేరుల సంపద దాదాపు మూడో వంతు ఉన్నట్లు హురూన్ పేర్కొంది. రిలయన్స్ గ్రూప్‌లోని ఇంధనం, రిటైల్ వ్యాపారాలలో వృద్ధి మందగించడం సహా అమ్మకాలు తగ్గడం, రుణ భారం పెరగడం వంటి కారణాలతో.. ముకేశ్ అంబానీ సంపద 13 శాతం తగ్గింది. 2023 జనవరిలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోయాయి. తర్వాత గత ఏడాది కాలంలో వాటి విలువ తిరిగి పెరగడంతో అదానీ సంపద గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలోనే అదానీ సంపద 13 శాతం పెరిగింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్‌పర్సన్ రోష్ని నాడార్ రూ. 3.5 లక్షల కోట్లతో దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. ఆమెకు తండ్రి శివనాడార్ నుంచి హెచ్‌సీఎల్‌లో 47 శాతం వాటా బదిలీ కావడమే దీనికి కారణంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. మహిళా కుబేరుల్లో ఆమె 5వ స్థానంలో నిలిచారు.
ఇక, సగటు సంపదలో భారత్.. చైనాను మించిపోయింది. భారత కుబేరుడి సగటు సంపద రూ.34,514 కోట్లు కాగా.. చైనాలో ఇది రూ.29,027 కోట్లుగా ఉంది. ఇది భారత్‌లోని కుబేరుల సంపద పెరుగుతున్న సంకేతాలను సూచిస్తోంది. ఇక నగరాల పరంగా చూస్తే.. ముంబైలో కుబేరుల సంఖ్య 90కి చేరింది. గత యేడాదితో పోల్చితే కుబేరులు 11 మంది పెరిగారు.
అయితే, ఆసియాలో ‘కుబేరుల రాజధాని’ హోదా ముంబై కోల్పోయి, ఈసారి షాంఘై దక్కించుకుంది. రంగాల పరంగా చూస్తే.. ఆరోగ్య సంరక్షణ రంగంలో 53 మంది కుబేరులు ఉన్నారు. 35 మంది కన్జూమర్ గూడ్స్ రంగంలో ఉండగా, 32 మంది ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ రంగానికి చెందిన వారు ఉన్నారు. భారత కుబేరుల సగటు వయస్సు 68 ఏళ్లుగా ఉంది. అంతర్జాతీయ కుబేరుల సగటు వయసు కంటే ఇది 2 సంవత్సరాలు ఎక్కువ. 34 ఏళ్ల శశాంక్ కుమార్, హర్షిల్ మాథుర్ పిన్న వయస్కులైన కుబేరులుగా నిలిచారు. ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో నిలిచారు. మస్క్ సంపద 82 శాతం అంటే.. 182 బిలియన్ డాలర్లు పెరిగి 420 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
2025 హురూన్ రిచ్ లిస్టులో తెలుగు వ్యాపారవేత్తలు వారి కుటుంబాల గురించి చూస్తే.. దివీస్ లేబోరేటరీస్.. దివి మురళి 260వ ర్యాంకులో నిలిచారు. ఆయన సంపద 10 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎంఈఐఎల్‌కు చెందిన పి.పిచ్చిరెడ్డి సంపద 5.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆయన 600వ ర్యాంకులో నిలిచారు. ఎంఈఐఎల్‌కే చెందిన పి.వి.కృష్ణారెడ్డి సంపద 5.6 బిలియన్ డాలర్లుగా ఉంది. అపోలో హాస్పిటల్స్ ప్రతాప్ సి.రెడ్డి సంపద 3.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. మరో 14 మంది కూడా ఒక బిలియన్ డాలర్లకు పైగా సంపద కలిగి ఉన్నట్లు హురూన్ రిపోర్ట్ తెలిపింది.