25.5 C
Hyderabad
Thursday, June 25, 2026

Live Video

spot_img

సుజనాచౌదరి మూగనోము

బీజేపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఈసారి రాజకీయంగా కలసి రాలేదని అనుకోవాలి. కేంద్రంలో, రాష్ట్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీలో ఉన్నప్పటికీ ఆయన కేవలం ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గానికి పరిమితం కావాల్సి వచ్చింది. రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఆయన ఢిల్లీలో ఒక ఊపు ఊపిన నేత… నేడు మౌనంగానే ఉంటున్నారు. కేవలం శాసనసభ నియోజకవర్గానికే పరిమితమయ్యారు.

సుజనా చౌదరి సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేత. టీడీపీలో ఓ వెలుగు వెలిగి… 2019 ఎన్నికల్లో పార్టీ రాష్ట్రంలో ఓటమి పాలయిన తర్వాత సుజనా చౌదరి బీజేపీలోకి జంప్ అయ్యారు. అప్పటి వరకూ కేంద్ర మంత్రిగా ఆయన రాష్ట్రంలో హల్ చల్ చేసేవారు. తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరుచుకున్నారు.

అలాంటి నేతను బీజేపీ ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంపీ టిక్కెట్ ఆశిస్తే ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి మొదటి దెబ్బ కొట్టిందంటారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూటమిలోని మూడు పార్టీలూ ఒక్కసారి కూడా గెలిచిన దాఖలాలు లేవు. తెలుగుదేశం పార్టీ ఒక్కసారి గెలిచింది కానీ అదీ 1983లో మాత్రమే. అంటే ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పుడు మాత్రమే ఇక్కడ టీడీపీ గెలిచింది. 1983 తర్వాత తెలుగుదేశం పార్టీకి ఇక్కడ విజయం అనేది దొరకలేదు. అంటే నలభై ఏళ్లకు పైగానే పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ జెండా చూడటం లేదనే చెప్పాలి.

2009లో వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడి నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా గెలిచారు. అలాంటి చోట నుంచి సుజనా చౌదరి నెగ్గుకొచ్చారు. ఆ నియోజకవర్గ చరిత్ర చూస్తే ఎవరైనా అక్కడి నుంచి పోటీ చేయడానికి భయపడే పరిస్థితి. ఈ నియోజకవర్గంలో ముస్లింలే ఎక్కువగా ఉంటారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి 1972లో అసిబ్ బాషా, 1989లో ఎంకే బేగ్, 1999లో కాంగ్రెస్, 20214లో వైసీపీ నుంచి జలీల్ ఖాన్ , 20024లో కమ్యునిస్టు పార్టీ అభ్యర్థిగా నాజర్ వలి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వామపక్షాలు కూడా బలంగా ఉన్నాయి. అంటే ఆ ఓటు బ్యాంకు సుజనాకు రావడం కష్టమేనని భావించి టిక్కట్ ఇచ్చిందా? అన్న అనుమానాలు అందరిలోనూ కలిగాయి.

అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సుజనా చౌదరి గెలుపొందారు.  సుజనా చౌదరి తాను ఎమ్మెల్యేగా గెలవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మంత్రి పదవి రావడం ఖాయమని భావించారు. కానీ ఆయన ఆశలుతలకిందులయ్యాయి. 2014లో కమ్మ సామాజికవర్గం నుంచి కామినేని శ్రీనివాసరావుకు అప్పట్లో మంత్రి పదవి లభించడంతో అదేకోటాలో తనకు లభిస్తుందని గట్టిగా నమ్మకం పెట్టుకున్నా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. సత్యకుమార్ కు మంత్రి పదవి లభించడంతో సుజనా తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఎంపి టికెట్‌ నుంచి తప్పించి ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించటం వరకు బీజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురుందేశ్వరి మంత్రాంగం నడిపించారని సుజనా సన్నిహితులు వాపోతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రిపదవి ఆంశంలో కూడా ఆమె అడ్డుపడ్డారని మండిపడుతున్నారు. ఒకే సామాజికవర్గం కావడంతో భవిష్యత్తులో ఎక్కడ అడ్డువస్తారో అని విజయవాడ పశ్చిమానికి పరిమితం చేశారని సుజనా అనుచరులు ఆరోపిస్తున్నారు.

మరోవైపు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు కూడా సుజనా చౌదరి వ్యవహారంలో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయని తెలిసింది. పూర్తిస్థాయి బిజెపి నేత కాకపోవడం మైనస్‌ కాగా ఇలాంటి నేతలకు పదవులు ఇస్తే పార్టీ బలోపేతం సాద్యం కాదని ఆయా వర్గాలు విశ్లేషణ చేస్తున్నాయి.

తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు అందరు కలిసి సుజనా చౌదరి పంజరంలో చిలుక మాదిరి బంధించేశాయని అమరావతి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  అలాగని పార్టీ కేంద్ర నాయకత్వాన్ని కాదనే సాహసం సుజనా చౌదరి చేయరన్నది వాస్తవం. ఎందుకంటే కేంద్ర నాయకత్వంతో పెట్టుకుంటే పాత కేసులు తిరగదోడే అవకాశముండటంతో సమయం కోసం వెయిట్ చేయడం తప్ప సుజనా చేయగలిగిందేమీ లేదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com