-
రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా
ఆంధ్ర ప్రదేశ్ లోని 51 మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా ప్రకటించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా ప్రకటించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ కార్యాలయంలో హైబ్రిడ్ మోడ్‌లో శుక్రవారం నిర్వహించిన కరువు ప్రభావ కమిటీ సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఈ నిర్ణయానికి సంబంధించి కరువు మండలాలపై మరో రెండు, మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడతాయని సిసోడియా తెలిపారు.
జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖలు సమర్పించిన నివేదికలను కమిటీ నిశితంగా పరిశీలించిందని సిసోడియా చెప్పారు. ప్రభుత్వం కరువు ప్రభావిత మండలాల కోసం అవసరమైన చర్యలను తీసుకోవడానికి కట్టుబడి ఉందని, ఆయా కరువు మండలాల పరిస్థితిని సమగ్రంగా అంచనా వేసి, సాంకేతిక పరిశీలన ఆధారంగా నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశం కీలకంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన నివేదికలను దృష్టిలో ఉంచుకుని.. వర్షపాతం లోటు, పంటల నష్టం, భూగర్భ జలాల స్థాయి, వ్యవసాయ స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాని సిసోడియా వివరించారు. డ్రౌట్ మేనేజ్‌మెంట్ మాన్యువల్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని, రైతులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వం వేసవిలో ఎదురయ్యే పరిస్థితులను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తోందన్నారు. ఒకసారి అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే, ప్రభుత్వం తగిన విధంగా సహాయ చర్యలు చేపడుతుందని ఆయన పేర్కొన్నారు. రైతులు, ఇతర ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సత్వర సహాయం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఎవరూ ఇబ్బంది పడకుండా అవసరమైన నిధులు, సబ్సిడీలు, సహాయక కార్యక్రమాలను అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సిసోడియా వివరించారు. ఆధికారిక ప్రకటన వెలువడిన తర్వాత, ప్రభుత్వం తీసుకునే చర్యల గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని సిసోడియా స్పష్టం చేసారు.