తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్లాన్ రూపొందించింది. ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులతో హైబ్రిడ్ మోడల్ రోడ్ల విధానాన్ని అమలు చేయ బోతోంది. దీనిని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ – హ్యామ్ రోడ్ల విధానం అంటున్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులతో అమలు చేసే ఈ ప్రాజెక్టులో భాగంగా వనరుల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేస్తారు. ఫలితంగా ప్రాజెక్టు సామర్థ్యం పెరగనుంది. హ్యామ్ ఫ్రేమ్ వర్క్ సిస్టంలో మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. మిగతా 60 శాతం నిధులను ప్రైవేట్ డెవలపర్లు సమకూరుస్తారు.
హ్యామ్ రోడ్స్ ప్రాజెక్ట్‌లో మొత్తం 12 వేల కిలోమీటర్ల రోడ్లను మూడు దశల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. మొదటి దశలో 4,600 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ పర్యవేక్షణకు, ఎప్పటికప్పుడు పురోగతిని పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఒక యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ యాప్ ద్వారా రోడ్ల సమాచారాన్ని సేకరించి.. నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. వాహనదారులకు భారం పడకుండా, టోల్ ట్యాక్స్ లేకుండా ఈ రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో ఈ హ్యామ్ ప్రాజెక్ట్ పనులు జరుగుతాయి.
రాష్ట్రంలో మొత్తం 12వేల కిలోమీటర్ల మేర హ్యామ్ సిస్టంలో రోడ్లను నిర్మిస్తారు. మొదటి దశలో 4,600 కిలోమీటర్లు, రెండో దశలో 4,600 కిలోమీటర్లు.. మూడో దశలో 2,800 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించారు.
మొదటి దశలో చేపట్టే రోడ్లను గుర్తించడానికి అధికారులు ఒక యాప్‌ను ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా రోడ్డు పొడవు, వెడల్పు, కల్వర్టులు, వంతెనలు, వాహనాల రాకపోకల సామర్థ్యం వంటి వివరాలను నమోదు చేస్తారు. ఈ సమాచారం ఆధారంగా ఏ రోడ్లను అభివృద్ధి చేయాలో నిర్ణయిస్తారు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం వరకు రెండు వరుసల రహదారిని ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా మిస్సింగ్ లింక్ కనెక్టివిటీని అందిస్తారు. ఇక్కడ ఇలా 1,110 కి.మీ. రోడ్లను గుర్తించనున్నారు. జిల్లా కేంద్రం నుంచి రాజధాని వరకు నాలుగు వరుసల రహదారిని ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా కూడా మిస్సింగ్ లింక్ కనెక్టివిటీని అందిస్తారు. ఇలాంటి 820 కి.మీ. రోడ్లను గుర్తించారు. వీటితో పాటు నేషనల్ హైవే, ముఖ్య జిల్లా రహదారుల, ఇతర జిల్లా రహదారులకు సంబంధించిన 10 వేల కిలోమీటర్ల రోడ్లను కూడా అభివృద్ధి చేస్తారు. ఈ రోడ్లను అభివృద్ధి చేయడం వల్ల వాహనదారులపై ఎలాంటి భారం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. టోల్ ట్యాక్స్‌లను వసూలు చేసే ప్రసక్తే లేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసనసభలో ప్రకటించారు. ఇక, హ్యామ్ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశ పనుల కోసం ప్రభుత్వం వచ్చే యేడాది బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించింది.