- బ్యాంకింగ్ చట్టాలకు సవరణ చేసిన పార్లమెంట్
- సక్సెసివ్,సైమల్టేనియస్ పద్ధతుల్లో నామినేషన్లు
- లాకర్లకు మాత్రం సక్సెసివ్ నామినేషన్లే అనుమతి
- ఆస్తుల బదిలీకి ఇది సులభమైన విధానమంటున్న ఆర్బీఐ
- అన్ క్లెయిమ్డ్ డిపాజిట్ల సంఖ్య తగ్గించడానికే
- పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల బిజినెస్ భేష్ అంటున్న ఆర్బీఐ
బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు ద్వారా ఆర్బీఐ వినియోగ దారులకు ప్రయోజనం చేకూర్చే సవరణ బిల్లును నిన్న రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. ఇకపై బ్యాంకు అక్కౌంట్లకు నలుగురు నామినీలను పెట్టుకునే వీలుందని ఆర్ధిక మంత్రినిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ కొత్త బిల్లు ప్రకారం అక్కౌంట్ హోల్డర్లు ఇకపై రెండు రకాల నామినేషన్లను ఎంచుకోవచ్చు. ఒకటి సక్సెసివ్ నామినేషన్ అంటే మన వారసులుగా పెట్టుకోవడం, రెండోది సైమల్టేనియస్, అంటే ఏకకాలంలో ఇతరులు కూడా ఆపరేట్ చేసే విధంగా ఆప్షన్ ఎంచుకోవచ్చు.అయితే బ్యాంకు లాకర్ల ను అద్దె కిచ్చే విషయంలో ఈ రూల్ వర్తించదు. లాకర్ల వరకూ వారసుల ఆప్షన్ ను మాత్రమే అనుమతిస్తారు. తద్వారా ఆ లాకర్ ఆపరేషన్ ను వారసులకు మాత్రమే అనుమతిస్తూ వివాదాలకు తావు లేకుండా చేశారు.వాటికి పాత పద్ధతిలోనే ఒకరికి మించి నామినీలను పెట్టుకోవచ్చు. అయితే వారికి ప్రయారిటీని నిర్ణయించుకోవాలి.
కొత్త నామినేషన్ రూల్స్ ఏలా ఉన్నాయంటే..
ఒక బ్యాంకు అక్కౌంట్ కు నలుగురిని నామినీలుగా చేస్తూ బ్యాంకింగ్ చట్టాలకు సవరణ చేశారు. ఇది ఎంతో మంది కస్టమర్లకు ఊరటనిచ్చే అంశం. డిపాజిటర్లకు వెసులు బాటు కల్పించడమే కాకుండా, మరింత భద్రతను కలిగి ఉంటుంది. వారసులకు ఆస్తులు బదిలీ చేయడానికి మరింత సులువుగా ఉంటుంది. అక్కౌంట్ హోల్డర్ చనిపోతే నామినీగా ఉన్న వ్యక్తి ఆ ఆస్తికి కస్టోడియన్ గా ఉంటూ నిధుల బదిలీ సక్రమంగా జరిగేలా చూస్తారు. అదే సమయంలో నామినీకి ఆ అక్కౌంట్ ఓనర్ గా పూర్తి అధికారాలూ ఉండవు.వారసులు, లబ్ది దారుల తరపున ఆ నిధుల మొత్తాన్ని ఆపరేట్ చేయడం, పర్యవేక్షించడం మాత్రమే చేయగలరు.
క్లెయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్య పెరుగుతోంది..
ఏడాది ఏడాదికి బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్య పెరుగుతూ వస్తోందని రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది.2024 మార్చి నాటికి క్లెయిమ్ కు నోచుకోని డిపాజిట్ల మొత్తం రూ. 78,213 కోట్లు. ఈ మొత్తం ఏడాది ఏడాదికి 26 శాతం పెరుగుతూ వస్తోంది. ఇది 2023లో రూ. 62,225 కోట్లు.ఈ మొత్తాన్ని డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎవేర్ నెస్ ఫండ్ కింద తరలిస్తారు. ఇలా క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తం పెరుగుతుండటంతో బ్యాంకింగ్ రూల్స్ ని సవరించి కొత్తగా నలుగురు నామినీలను పెట్టుకునే వీలు కల్పించారు. తద్వారా ఇలా పెద్ద మొత్తం నిరర్దకంగా మిగిలిపోకుండా ఉంటుంది. ఇలా ఏకకాలంలో నలుగురిని నామినీలుగా పెట్టడం ద్వారా అక్కౌంట్ హోల్డర్లు మనశ్శాంతిగా ఉండొచ్చు. తమ సొమ్ము తాము అనుకున్న విధంగా విభజించి చేరాల్సిన వారికి చేరుతోందన్న తృప్తి ఉంటుంది. దీనివల్ల ఇలా క్లెయిమ్ కాని సొమ్ములా మిగిలిపోకుండా వారసులైన వాటిని సక్రమంగా వినియోగించుకునే వీలు కలుగుతుంది.
బ్యాంకింగ్ చట్టాలకు సవరణ చేయడం ద్వారా రెండు పద్ధతుల్లో మల్టిపుల్ నామినేషన్లు చేసే వీలు కల్పించారు. సక్సెసివ్ ,సైమల్టేనియస్ పద్ధతుల ద్వారా వారసులను అక్కౌంట్ హెల్డర్లు ప్రకటించవచ్చు. లాకర్ల నిర్వహణ విషయంలో మాత్రం కేవలం సక్సెసివ్ నామినేషన్లనే అనుమతిస్తారు.
సైమల్టేనియస్ నామినేషన్ల విషయంలో నామినీలకు కొంత పర్సంటేజ్ కూడా షేర్లు రూపంలో అందుతుంది.అదే సక్సెసివ్ నామినేషన్ల విషయంలో అయితే నామినీలకు ముందే నిర్దేశించిన మొత్తం ఆదేశాల ద్వారా అందుతుంది. ఈ కొత్త విధానాల వల్ల ప్రక్రియపరమైన ఆలస్యం తగ్గుతుంది. సొమ్ము బదిలీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా సాగిపోతుంది.
బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు-2024లోని కీలక అంశాలివీ..
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరిధిలోని బ్యాంకులు ఇప్పటివరకు ప్రతీ రెండో శుక్రవారం, నాలుగో శుక్రవారంలలో ఆర్బీఐకు రిపోర్టింగ్ చేసేవి. అవి ఇక నుంచి ప్రతినెలా 15న, 30న రిపోర్టింగ్ చేయాలి.
- ప్రభుత్వం వద్ద నమోదైన కంపెనీలలోని డైరెక్టర్ల కనీస వాటా మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి రూ.2 కోట్లకు పెంచారు. డైరెక్టర్ హోదాలో ఉన్నవారు కంపెనీలోని 10 శాతం ఈక్విటీని కలిగి ఉండొచ్చు.
- సహకార బ్యాంకుల డైరెక్టర్ల పదవీ కాలాన్ని ఎనిమిదేళ్ల నుంచి పదేళ్లకు పెంచారు.
- కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టరుగా(Bank Account Nominees) ఉండేవారు, రాష్ట్ర సహకార బ్యాంకు బోర్డులోనూ సభ్యుడిగా వ్యవహరించొచ్చు.
- ఆడిటర్లకు వేతనాల చెల్లింపులో బ్యాంకులకు స్వేచ్ఛను కల్పించే నిబంధన సైతం సవరించిన చట్టంలో ఉంది. బ్యాంకింగ్ చట్టాల సవరణ ద్వారా బ్యాంకింగ్, ఆర్థిక సర్వీసుల రంగంలో ప్రజోపయోగకర సంస్కరణలు చేపట్టినట్లయ్యింది.
రుణాల ఎగవేతదారులపై నిర్మల కీలక వ్యాఖ్యలు..
ఉద్దేశపూర్వకంగా బ్యాంకుల అప్పులను ఎగ్గొట్టే వాళ్లను వదిలేది లేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు. వాళ్ల నుంచి అప్పులను వసూలు చేసేందుకు బ్యాంకులు తగిన చర్యలు చేపడతాయని స్పష్టం చేశారు. బ్యాంకుల అప్పులను ‘రైట్ ఆఫ్’ చేయడం అంటే మాఫీ చేసినట్టు కాదన్నారు. బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు-2024పై రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానమిస్తూ నిర్మల ఈ వివరాలను వెల్లడించారు.
లోక్ సభలో ఇప్పటికే ఆమోదం పొందిన ఈ సవరణ చట్టం రాజ్య సభలో కూడా ఆమోదం పొందింది. త్వరలోనే ఇక చట్టంగా రూపుదాల్చబోతోంది. బ్యాంకుల మోసాలకు సంబంధించి గత ఐదేళ్లలో ఎన్ ఫోర్సు మెంట్ డైరక్టరేట్ 912 కేసులను పరిష్కరించింది. ఇందులో రుణాల డిఫాల్టర్లు కూడా ఉన్నారు. బ్యాంకు రుణాలను రైటాఫ్ చేయడం అంటే రద్దు చేయడం కాదని, రుణాన్ని రైటాఫ్ చేసినా రుణాన్ని తిరిగి చెల్లించాల్సిందేనని మంత్రితెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు 1.41 లక్షల కోట్ల లాభాలను ఆర్జించాయని తెలిపారు.