కేంద్ర ప్రభుత్వం నిర్వహించబోయే డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీయం మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజన చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఇదే జరిగిగే రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం చెడిపోతుందని ముఖ్యమంత్రి సభలో ప్రస్తావించారు. ఈ కారణంగానే ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ రాజ్యాంగ సవరణ చేసి 25 సంవత్సరాలు డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేశారని సీయం గుర్తు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేలా కేంద్ర వ్యవహరిస్తున్న తీరును మనం అందరం కలసికట్టుగా ఎదుర్కోవాలని సీయం పిలుపునిచ్చారు. కుటుంబ నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు పకడ్బందీగా అమలు చెయ్యగా ఉత్తరాది రాష్ట్రాలు పట్టించుకోలేదని దీంతో ఇప్పుడ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే పార్లమెంటులో దక్షినాది రాష్ట్రాల ప్రతినిధ్యం 24 శాతం నుంచి 19 శాతానికి పడిపోయే ప్రమదం ఉందని తెలిపారు. మనల్ని నియంత్రించడానికే కేంద్రం నియోజకవర్గాల పునర్విభజనను ఉపయోగించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా దీనిపై ఒకే మాటపై నిలబడి కేంద్రంపై ఒత్తిడి తేవాలనే ఈ రోజు సభలో తీర్మానం ప్రవేశపెట్టినట్లు సీయం రేవంత్ చెప్పారు. వాస్తవానికి ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు పెంచాల్సి ఉండగా కేంద్రం మనపై వివక్ష చూపుతోందని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ లో రాజ్యాంగాన్ని సవరించి 2011 జనభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలను 83 నుంచి 90 కి పెంచారని, సిక్కింలో 2018లో కేబినెట్ లో రిసోల్యూషన్ పాస్ చేసి ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కొనసాగిస్తున్నారని సీయం సభ ధృష్టికి తెచ్చారు. త్వరలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానారెడ్డి ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని ఈ సమావేశానికి అందరూ రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.