37.2 C
Hyderabad
Friday, April 24, 2026

Live Video

spot_img

ఏపీ ప్రయోజనాలు గాలికొదిలేశారా?

  • డీ లిమిటేషన్ పై స్పందించరెందుకు>
  • రాష్ట్రం కోసం ఏకమయ్యే తమిళనాడు
  • మన నేతల్లో కొరవడిన కమిట్మెంట్
  • అధికార, ప్రతిపక్షాలు దొందూ దొందే
  • తెలంగాణను చూసైనా నేర్చుకోలేరా?
  • కాంగ్రెస్ అక్కడలా.. ఇక్కడిలా?

నియోజక వర్గాల పునర్విభజన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ ప్రక్రియ ఇప్పుడున్న పరిస్థితుల్లో పాత జనగణన లెక్కల ప్రకారం నిర్వహిస్తే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. ఎందుకంటే డీలిమిటేషన్ అనేది జనాభా ప్రాతిపదికన పార్లమెంటరీ నియోజక వర్గాలను పునర్విభజించడం. దక్షిణాది రాఫ్ట్రాలకు తీవ్రంగా నష్టం వాటిల్లడానికి కారణం గత కొన్ని దశాబ్దాలుగా అధిక జనాభా నియంత్రణకు ఉద్దేశించిన ఫ్యామిలీ ప్లానింగ్‌ ను కఠినంగా అమలు చేయడం. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా కొన్నేళ్లుగా ఉత్తరాది రాష్ట్రాల జనాభాతో పోలిస్తే తక్కువే. దక్షిణాది రాష్ట్రాలు  అందిస్తున్న రాబడి, పన్నులూ ఎక్కువే. అయినా కేంద్ర సాయం అరకొర మాత్రమే. కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలు ముట్ట చెబుతున్న మొత్తం తాటికాయంత. కేంద్రం ప్రతిగా మనకు విదులుస్తున్న నిధులు ఈత కాయంత.. ఈ అసమానతలపై గత కొన్నేళ్లుగా  మథన పడుతున్నా ఇప్పుడు తమిళనాడు సీఎం స్టాలిన్ నాయకత్వంలో ఇదొక ఉద్యమంలా తయారవుతోంది. బీజేపి ఉత్తరాది అండతో 2021 నాటి జనగణన ఆధారంగా డీలిమిటేషన్ జరిపేయాలని చూస్తోందన్న ఆందోళన మొదలైంది. జనగణన తాజాగా నిర్వహించి ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం నిర్వహించాలని పట్టుబడుతున్నాయి. కానీ కేంద్రం  ఊ అని గానీ ఊహూ అని గానీ అనడం లేదు. అదీగాక వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్న నేపధ్యంలో స్టాలిన్ బీజేపి పై ఇప్పటి నుంచే ఎదురుదాడి మొదలు పెట్టారు.

మరి తెలుగు రాష్ట్రాల సంగతేంటి? తెలంగాణలో ప్రభుత్వ,ప్రతిపక్షాలు రెండూ  స్టాలిన్ పోరాటానికి మద్దతుగా ముందుకు కదిలాయి. తెలంగాణ సీఎం రేవంత్‌, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌ తో కలసి ఈ సమావేశానికి హాజరు కాగా, ప్రతిపక్ష నేత కేటీఆర్‌ తమ పార్టీ నేతలతో ఈ సమావేశంలో పాల్గొని విలువైన అభిప్రాయాలు తెలియ చేశారు. ఈ ఉద్యమానికి పూర్తి స్థాయి మద్దతు ప్రకటించారు.

ఏపీలో దొందూ దొందే..

ఏపీలో దౌర్భాగ్యకర రాజకీయవాతావరణం నెలకొంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వ, ప్రతిపక్షాలు ఉప్పు, నిప్పుగా ఉంటుండటం ఏపీ ప్రజల దురదృష్టం. మిగతా రాష్ట్రాల్లో సైద్ధాంతిక బేధాలు,రాజకీయ బేధాభిప్రాయాలు ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అందరూ ఏకమైపోతారు. ఉమ్మడి పోరాటానికి దిగుతారు. గతంలో కావేరీ నదీ జలాల సాధన, జల్లి కట్టు కు అనుమతులు,కృష్ణా జలాల సాధన, హిందీ భాష అమలు వ్యతిరేకించడం, నీట్‌ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలన్న డిమాండ్‌ ఇలా ప్రతీసారి తమిళనాడు ఐక్యంగా నిలబడింది.

కానీ మన ఏపీలో మాత్రమే  ప్రభుత్వ, ప్రతిపక్షాలు  ఏ విషయంలోనూ కలవవు. మొదట్నుంచి ఎడ్డెమంటే తెడ్డం అనడమే పాలసీ. అది ఎంత సీరియస్ విషయమైనా ఎదుటి పార్టీ స్టాండ్‌ ను బట్టి పార్టీలు తమ వైఖరిని ఖరారు చేసే దురదృష్ట కర వాతావరణం నెలకొని ఉంది.విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయమైనా, పోలవరం విషయమైనా, విభజన చట్టం అమలు విషయమైనా అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా టీడీపీ,వైసీపీ స్పందిస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలకన్నా తమ ప్రత్యర్ధిని వ్యతిరేకించడమే ఏకైక ఎజెండాగా మారిపోతోంది.

కూటమిది అదే ధోరణి..

ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన కూడా బీజేపి భజనే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదు.ఇవే పార్టీలు ప్రతిపక్షంలో ఉండి ఉంటే కేంద్రంతో అంటకాగుతున్నారని, కేసుల భయంతోనే బీజేపికి ఎదురు తిరగడం లేదని విమర్శించి ఉండేవారు.ఇప్పుడు కూటమే అధికారంలో ఉండటంతో కేంద్రాన్ని నిలదీయడం లేదు. నిజానికి రెండు పార్టీలకూ పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నా, కేంద్రంలో బీజేపికి మద్దతు ఇవ్వాలన్న వైఖరి కారణంగా మిన్నకుండి పోతున్నాయి.నిజానికి డీ లిమిటేషన్ అంశం చాలా కీలకమైనది. భవిష్యత్తులో ఏపీ ప్రయోజనాలతో ముడి పడి ఉంది. ఇప్పటికే విభజన చట్టం అమలులో ఏపీకి అన్యాయమే జరుగుతోంది. స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ విషయంలో కూడా జరిగినది ఇదే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జనసేన, టీడీపీ కూడా స్టీల్‌ ప్లాంట్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఉద్యమాలే చేశాయి. ఇందుకు ప్రతిగా వైసీపీ కూడా అప్పటి ఎంపీ విజయ సాయి రెడ్డి ఆధ్వర్యంలో మహా ధర్నా చేపట్టింది. నేతల పోటా పోటీ దీక్షలతో ఉత్తరాంధ్ర దద్దరిల్లింది. టీడీపీకి చెందిన పల్లా శ్రీనివాస రావు, గంటా శ్రీనివాస్ లాంటి నేతలు స్టీల్‌ప్లాంట్‌ను అడ్డుపెట్టుకుని సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నించారు. చివరకు కేంద్రం డిజిన్వెస్ట్ మెంట్‌ ను కాస్త తాత్సారం చేసింది. అది తమ విజయంగా రెండు పార్టీలు అప్పట్లో చెప్పుకున్నాయి. ఇప్పుడు కూటమి కేంద్రంలోనూ, ఇక్కడా అధికారంలోకి వచ్చాక స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపేసాం అంటూ పైకి ప్రకటనలు చేస్తున్నా అక్కడ జరిగే పనులు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మరో ఏడాది, రెండేళ్లకైనా అది తప్పదని అర్ధమవుతోంది. పార్టీలు ఇలా రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి కేంద్రంతో సర్దుబాటు ధోరణిలో వ్యవహరించడం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతోంది. తెలంగాణలో ఇలాంటి రాజీ ధోరణి లేదు. కాంగ్రెస్, బీఆర్ ఎస్ కూడా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా అడుగులేశాయి. స్టాలిన్ నేతృత్వంలోని ఉద్యమానికి మద్దతు నిచ్చాయి.కానీ ఏపీలో కూటమి మౌన ముద్ర దాల్చగా, వైసీపీ ప్రతినిధులను ఆ మీటింగ్‌ కు పంపి చేతులు దులుపుకుంది.

జనసేన మోసపూరిత వైఖరి

జనసేనాని పవన్ పార్టీ పెట్టిన కొత్తల్లో అరుపులతో మోత మోగించారు. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల కోసం తాను నిరాహార దీక్షకు దిగుతానన్నారు. పైగా ప్రతీ దక్షిణాది రాష్ట్రం నేతలను కలసి అందరినీ కలుపుకు పోతానన్నారు. నానా హడావుడి చేశారు. తీరా ఆ అరుపులేవీ ఎన్నికల్లో ఓట్లు రాల్చ లేదు. రెండు సార్లు ఘోర ఓటమిని చవి చూశాక మూడోసారి గెలుపు కోసం సిద్ధాంతాలను మార్చేశారు. లెఫ్టిస్టు ఐడియాలజీ నుంచి పక్కకు జరిగి ఇప్పుడు బీజేపి, టీడీపీలతో అంటకాగుతూ జట్టు కట్టి అధికారంలోకి వచ్చారు. అప్పటినుంచి ఆయన మౌనం దాల్చారు. ఇప్పుడు అరుపులూ లేవు.. పెడబొబ్బలూ లేవు.పవన్ తీరు చూసిన వారెవరికైనా అధికారం కోసం పడుతున్న తపనే కనిపిస్తోంది తప్ప నిజాయితీ కనిపించడం లేదు. ఇక టీడీపీ వైఖరి కూడా ప్రత్యేకించి చెప్పాల్సినదేమీ లేదు.2019 ఎన్నికల్లో వైసీపీ చేతిలో ఘోర ఓటమి పాలయ్యి, పార్టీ పరిస్థితి దిగజారి పోవడం, లోకేష్‌ను భావి నేతగా ప్రకటించాలన్న చంద్రబాబు పట్టుదలతో ఈసారి ఎన్నిలకు ముందే బీజేపితో జట్టు కట్టింది. ఈఎన్నికల్లో 134 సీట్లు సాధించినా పొత్తు ధర్మాన్ని పాటించాల్సిరావడంతో డీలిమిటేషన్ పై తమిళనాడు నేతృత్వంలో పోరుకు దూరంగా ఉండిపోయింది.

అదే బాటలో వైసీపీ?

కేంద్రంలో బీజేపి అధికారంలోకి వచ్చినప్పటినుంచి జగన్ వైఖరి ఒకలాగే ఉంది.. పెద్దగా ఏ విషయంలోనూ వ్యతిరేకించడం లేదు. కేంద్రం తీసుకునే నిర్ణయాలకు అంశాన్ని బట్టి మద్దతు తెలపడమే. అనేక కీలక విషయాల్లో బీజేపి నిర్ణయాలను వైసీపీ బలపరిచింది.

మొదట్నుంచి బీజేపీకి సహకరించే ధోరణిలోనే వైసీపీ ఉంది. స్టీల్‌ప్లాంట్‌ విషయమైనా, పోలవరం విషయమైనా, వైసీపీ బీజేపితో వ్యతిరేకించి ఒకబలమైన నిర్ణయం తీసుకున్న సందర్భమే లేదు.అంటీ ముట్టనట్లే వైసీపీ వ్యవహరిస్తోంది. పార్టీ అధినేత జగన్ డీలిమిటేషన్ విషయంలో ప్రధానికి లేఖ రాసినది కూడా ఏదో నామ్ కే వాస్తే తప్ప.. అందులో సీరియస్ నెస్ లేదు. ఒక కార్యాచరణ ప్రణాళికలేదు

కాంగ్రెస్ ఉన్నా లేనట్లే

తెలంగాణ, కర్ణాటకలలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం వల్ల ఆ పార్టీ హై కమాండ్‌ ఒక పాలసీగా తీసుకుని తమిళనాడు ఉద్యమానికి మద్దతు పలికి ఆ పార్టీ అధినేతలను పంపింది. అదే ఏపీలో మాత్రం పార్టీ ఉనికే లేదు కాబట్టి డీ లిమిటేషన్ పై ఏపీకి నష్టం జరుగుతున్నా… అక్కడ నుంచి ప్రతినిధిని పంపలేదు. ఇతర వామ పక్షాలున్నా ఇలాంటి కీలక అంశాల్లో వాటి ఉద్యమాలు సున్నా.. మొత్తం మీద ఏపీ ప్రయోజనాలను ఏ పార్టీ పట్టించుకోవడం లేదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com