తెలంగాణ బిజెపి అధ్యక్షుడి ఎంపిక ప్రహాసనంగా మారినట్టు కనిపిస్తోంది. జిల్లాల అధ్యక్షులు, వివిధ రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నికలు పూర్తి అవుతున్నా తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడి ఎంపిక కొలిక్కి రావడం లేదు. ఇదిగో అదిగో అంటూ ఇప్పుడు ఉగాది అంటున్నారు.
రాష్ట్రంలో బిజెపి బలపడటం రాష్ట్రంలోని కొందరు నాయకులకు ఇష్టం లేనట్టుగా కనిపిస్తోంది. కొత్త నాయకులను తీర్చిదిద్దాలనే ఆలోచన లేదు. కేవలం ఉన్న నలుగురైదుగురు.. వారి పబ్బం గడిస్తే చాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
2024 శాసనసభ ఎన్నికల సమయంలో పార్టీకి ప్రజల్లో పట్టు పెరుగుతున్న సమయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మార్చి పాతకాపు కిషన్ రెడ్డి చేతుల్లో పెట్టారు. పార్టీలో ఒకరికి ఒకే పదవి అనే నిబంధన ఉన్నా కిషన్ రెడ్డికి అది వర్తించ లేదు. కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్ష పదవి రెండూ ఒంటిచేత్తో నిర్వహిస్తున్నారు. కిషన్ రెడ్డి ఇటీవల హడావిడిగా అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొని ఢిల్లీ వెళ్లారు. ఏంటీ అని ఆరా తీస్తే ఫైనల్‌గా ఉగాదికి కొత్త అధ్యక్షుడు వస్తారని సెలవిచ్చారు.
అధ్యక్షపదవికి మల్కజ్గిరి ఎంపి ఈటెల రాజేందర్, డికె అరుణ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరు వచ్చినా ప్రస్తుత తెలంగాణ బిజెపి అంటే చెప్పుకునే నలుగురు నాయకుల మాట వినరు. వీరిద్దరు సీనియర్లు కావడంతో వారి ఆలోచనలకు అనుగుణంగా పార్టీని బలోపేతం చేస్తారు.
బీసీ కోటాలో ఈటెలకు ఇద్దామని అధిష్టానం తుది నిర్ణయం తీసుకునే సమయంలో ఈ కీలక నేతలు మోకాలడ్డుతున్నారని విశ్వసనీయ సమాచారం. మాజీ నక్సలైటు, బిజెపి నేపథ్యం లేని నాయకుడికి ఎలా ఇస్తారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తనకు పదవి రాకుండా రాష్ట్రంలోని కొందరు కీలక నేతలు అడ్డుకుంటున్నమాట వాస్తవమే అని ఈటెల కూడా తన సన్నిహితులతో వాపోతున్నారు. రాష్ట్రంలో పార్టీని, తనను సాదుకుంటరో… సంపుకుంటరో… వాళ్లిష్టం అని ఈటెల ఒకింత నిర్వేదంగా మాట్లాడుతున్నారు.
డికె అరుణ బస్తీ మే సవాల్ అన్న రీతిలో దూకుడు మీద ఉన్నారు. అయితే డికె అరుణకు ఇస్తే పార్టీ అగ్రవర్ణాల చేతిలో ఉందనే పేరు వస్తుందని కొందరు వాదిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ వెలమల చేతిలో కాంగ్రెస్ రెడ్డీల చేతిలో ఉందని…వాటికి చెక్ పెట్టాలంటే బిజెపి బీసీలకు పట్టం కడితే సోషల్ ఇంజనీరింగ్ వర్కవుట్ అవుతుందని టాక్ మొదలైంది.
రాష్ట్రంలో బిజెపి మనగుడ కోసం పోరాటం అన్నట్టుగా ఉనికి చాటుకుంటున్న సమయంలో బండి సంజయ్ పార్టీ గ్రాప్ అమాంతం పెంచేశారు. కెసిఆర్ మీద దూకుడు…హిందువాదులకు బంధువుగా అర్దరాత్రి అపరాత్రి అనుకుండా నిరసన గళం వినిపించి పార్టీని బలోపేతం చేశారనడంలో అతిశయోక్తి లేదు.
తీరా ఎన్నికల సమయంలో బండి సంజయ్‌ను మార్చడంతో పార్టీ పరిస్థితి సముద్రంలో చిల్లు పడ్డ నౌకలా తయారైంది. అయినా ప్రజలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది ఎంపీలను గెలిపించారు.
ఫలితాలను విశ్లేషించిన అధిష్టానం తెలంగాణలో స్కోప్ ఉందని…డ్యామేజీని కవర్ చేసేందుకు బండి సంజయ్‌కు కేంద్ర సహాయ మంత్రి ఇచ్చారు. షరామామూలుగా కిషన్ రెడ్డి బెర్తు అలాగే ఉంది.
అయితే ఈటెల ఎంపికలో బండి సంజయ్ తకరారు చేస్తున్నారని పార్టీలో పుకార్లు షికారు చేస్తున్నాయి. మాజీఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు కొత్తగా తెరమీదకు వస్తోంది. ఆయనకు అధ్యక్ష పదవి ఇస్తే రాష్ట్రంలో బిజెపిని భగవంతుడే కాపాడాలని కమలనాథులు కలవరపడుతున్నారు. అయితే ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వినిపిస్తున్న పేర్లు కాకుండా కొత్త వారిని ఎంపికి చేస్తారని సెలవిచ్చారు.
ఎడారిలో నీళ్లు పుట్టించే మోడీ, అమిత్ షా ద్వయం… యుపి,మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో చక్రం తిప్పారు. అలాంటి దిగ్గజ నేతలకు తెలంగాణ అధ్యక్ష పదవికి ఎంపిక కత్తిమీద సాములా తయారైంది.