ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్‌లు, ఆన్‌లైన్ బెట్టింగ్‌లపైనా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ ప్రకటించారు. గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్, రమ్మీ గేమ్స్‌కు సంబంధించిన కేసులపై ప్రత్యేక దర్యాప్తు బృందం – సిట్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఈ తరహా కేసులపై రాష్ట్ర ప్రభుత్వం ఇక నుంచి కఠినంగా ఉండాలని నిర్ణయించామన్నారు.
అధికారులతో చర్చించి, సీనియర్ అధికారులతో సమీక్షించి సిట్ ఏర్పాటు చేస్తామని, ఇకపై నమోదయ్యే కేసులన్నింటినీ సిట్ దర్యాప్తు చేసేలా ఆదేశాలిస్తామన్నారు. కఠినమైన శిక్షల కోసం చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ అభిప్రాయ పడ్డారు. బెట్టింగ్ నేరస్తుల పట్ల ప్రభుత్వం కఠినంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే, ఇలాంటి కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షించడానికి ప్రతిపక్షాలు కూడా సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గుట్కా వంటి నిషేధిత పదార్థాల సరఫరా కూడా పెరిగిందని సమాచారం వస్తోందన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్, రమ్మీ వంటి గేమ్స్‌కు ప్రచారం చేసిన వారిలో కొందరిని ఇప్పటికే విచారించామని.. సోషల్ మీడియాలో, మీడియాలో పబ్లిసిటీ చేసిన వారిని ప్రశ్నించడం తోనే సమస్య పరిష్కారం అయినట్లు కాదన్నారు. పక్క రాష్ట్రాలు, పక్క దేశాల్లో కూడా విచారణ చేయాల్సి ఉంటుందని.. అందుకే వీటిని విచారించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటుతో అడ్డుకట్ట వేయాలని నిర్ణయించామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆన్‌లైన్ బెట్టింగ్ నేరాల్లో ఎలాంటి భాగస్వామ్యం ఉన్నా చర్యలు తప్పవని సీఎం వార్నింగ్ ఇచ్చారు.
ఎవరైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా బెట్టింగ్ యాప్స్‌ను ప్రోత్సహించినా, నిర్వహణలో భాగస్వాములైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు రేవంత్ రెడ్డి. గతంలో చేసిన చట్టాలు గమనిస్తే.. ఇలాంటి నేరాలకు రెండేళ్లకు మించి శిక్ష లేదని, అవసరమైతే చట్ట సవరణ చేసి అయినా శిక్షను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వ్యసనాలకు తెలంగాణలో తావులేదని చెప్పారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని కొందరు మాట్లాడుతున్నారన్న ముఖ్యమంత్రి.. ఏ చిన్నసంఘటన జరిగినా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. గతంలో నడిరోడ్డుపై లాయర్ వామన్ రావు దంపతులను నరికి చంపారని.. అయితే, అప్పటి ప్రభుత్వం అస్పలు పట్టించుకోలేదని సీఎం విమర్శించారు. గత సర్కార్ హయాంలోనే వెటర్నరీ డాక్టర్ దిశ దుర్ఘటన జరిగిందన్నారు. 2020 దేశంలో మహిళలపై జరిగిన ఘటనపై నాలుగో స్థానంలో తెలంగాణ ఉందన్నారు. జూబ్లీహిల్స్ పబ్‌లో మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో బీఆర్‌ఎస్ నేతల కొడుకులు ఉన్నారని తెలిసిందే అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగకుండా దురుద్దేశ్యంతో ప్రతిపక్షం ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. స్వార్థం కోసం ప్రభుత్వం మీద.. అభివృద్ధి మీద యాసిడ్ దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలు మానుకోవాలని.. విజ్ఞతతో మాట్లాడాలని హితవుపలికారు. ప్రతిపక్షాలకు సామాజిక బాధ్యత లేదా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణను ఆదర్శంగా నిలపాలని చేస్తుంటే.. దురుద్దేశ్యంతో కొందరు అడ్డుపడుతున్నారన్నారు. ధరల నియంత్రణలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందన్నారు.