33.9 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

ఏపీ పోలీస్‌ బాస్‌ లిస్ట్‌లో వీళ్లే!

ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ఎంపిక కోసం కసరత్తు మొదలయ్యింది. హరీష్‌ కుమార్‌ గుప్తా ఇప్పుడు ఇంచార్జ్‌ డీజీపీగా కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఐదుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల పేర్లను యూపీఎస్సీకి పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో, ఆ ఐదుగురు ఎవరా? వారిలో ఎవరు కొత్త పోలీస్‌ బాస్‌ అవుతారా? అన్న చర్చ నడుస్తోంది.

ప్రభుత్వం పంపించిన ఐదుగురి పేర్ల జాబితాలోంచి యూపీఎస్సీ ముగ్గురిని ఎంపిక చేసి తిరిగి పంపించనుంది. ఆ ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర డీజీపీగా ఎంపిక చేయనుంది కూటమి సర్కారు. అయితే, కొత్తగా డీజీపీగా ఎవరికి అవకాశం లభిస్తుందా? అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. గతంలో డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా ద్వారకా తిరుమలరావు కొనసాగారు. జనవరిలో ఆయన పదవీ విరమణ తర్వాత ప్రభుత్వం కొత్త డీజీపీని ఎంపిక చేయాల్సి ఉంది. అయితే, హరీష్ కుమార్ గుప్తాను తాత్కాలిక డీజీపీగా అప్పటికోసం నియమించింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ హరీష్ కుమార్ గుప్తాను ఏపీ డీజీపీగా నియమించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ద్వారకాతిరుమలరావును డీజీపీగా ఎంపిక చేసింది. ఆయన మొన్న జనవరిలో పదవీ విరమణ చేశారు. దీంతో, తాత్కాలికంగా హరీష్‌ గుప్తాకు బాధ్యతలు అప్పగించినప్పటికీ.. ఇప్పుడు పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక అనివార్యంగా మారింది.

ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం హరీష్ కుమార్ గుప్తాతో పాటు ఐదుగురు పేర్లను యూపీఎస్సీకి పంపింది. ఇందులో గుప్తాతో పాటు.. సీనియర్ ఐపీఎస్‌లు మాదిరెడ్డి ప్రతాప్, రాజేంద్రనాథ్ రెడ్డి, కుమార్ విశ్వజిత్, సుబ్రహ్మణ్యం ఉన్నారు. వీరిలో ముగ్గురిని యూపీఎస్సీ ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో, కేంద్రంలో రెండు చోట్లా ఎన్డీఏ అధికారంలో ఉంది. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది. దీంతో డీజీపీ ఎంపిక రాష్ట్ర ప్రభుత్వ ఇష్టంపైనే ఆధారపడి ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ఓకే చెప్తే వారు డీజీపీగా నియమితులు అవడం ఖాయం. అయితే, మరోసారి హరీష్ కుమార్ గుప్తాకు అవకాశం ఇస్తారా? లేకుంటే కొత్త అధికారిని తెరపైకి తెస్తారా అన్నది చూడాలి. రాజేంద్రనాథ్ రెడ్డిని మాత్రం ఎంపిక చేసే అవకాశం ఉండదంటున్నారు. ఎందుకంటే.. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజేంద్రనాథ్‌ రెడ్డి డీజీపీగా పనిచేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల అధికారిగా కూడా ఆయనపై ముద్ర ఉంది. మాదిరెడ్డి ప్రతాప్ కానీ, హరీష్ కుమార్ గుప్తా కానీ పూర్తిస్థాయి కొత్త డీజీపీగా ఎంపికయ్యే అవకాశం కనిపిస్తోంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com