26.2 C
Hyderabad
Tuesday, July 28, 2026

Live Video

spot_img

స్మార్ట్ ఫోన్ల ప్యాండమిక్

  • యువతను నిర్వీర్యం చేస్తున్న స్మార్ట్ ఫోన్
  • శారీరక,మానసిక ఆరోగ్యంపై దారుణ ప్రభావం
  • సంసారాలు కూలిపోతున్నాయ్..పెళ్లిళ్లు పెటాకులు
  • కోవిడ్‌ పాండమిక్ అలవాటు చేసిన స్మార్ట్ జబ్బు
  • ఫోన్ లేనిదే క్షణమైనా గడవని జీవితాలు
  • నెలల వయసులోనే చిన్నారులకు ఫోన్ తో ఆటలు
  • చదువులలోనూ స్మార్టె టెక్నాలజీ బాధలు
  • ఆత్మహత్యలకు రిఫరల్‌ గైడ్‌ లా స్మార్ట్ ఫోన్స్
  • అమెరికాలో సగటున ఆరు గంటలు ఫోన్ లోనే
  • చైనాలో నిర్వీర్యమైపోతున్న యువత
  • దారికి తెచ్చేందుకు మిలటరీ తరహా పనిష్మెంట్లు
  • బలవంతపు బూట్ క్యాంపులతో పెరుగుతున్న మరణాలు
  • భవిష్యత్తులో ఫోన్‌ డీ అడిక్షన్ సెంటర్లు తప్పనిసరి?

స్మార్ట్ ఫోన్ల వాడకం ఈమధ్య కాలంలో ప్రాణాంతకంగా మారుతోంది. మితి మీరి గంటల తరబడి, అయిన దానికి, కాని దానికి ఫోన్లను వాడేస్తూ గంటల కొద్దీ ఫోన్లు చూస్తున్న వారు అత్యంత ప్రమాదకరమైన జబ్బుల్లో పడిపోతున్నారు.

సెల్‌ ఫోన్లతో పారాహుషార్..

మొదట మేజిక్ లా అనిపిస్తుంది. ఏది కావాలన్నా, ఏపని పూర్తవ్వాలన్నా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండి దాని వినియోగం తెలిస్తే చాలు.. ఇక సగం విజయం మనదే. అలా స్మార్ట్ ఫోన్  అందరి వంటిట్లోకి, చివరకి బెడ్ రూమ్ లోకి సైతం చొరబడి చిచ్చు పెట్టేస్తోంది. మొదట సరదాగా మొదలై, ఆ తర్వాత  వ్యసనంగా మారిపోతోంది. రోజుల తరబడి స్మార్ ఫోన్ వినియెగంలో మునిగి తేలుతూ చివరకు ప్రాణాంతక వ్యాధుల బారిన పడి చనిపోవడం, లేదా జీవచ్ఛవాలుగా మారిపోయిన, పోతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. చిన్న పిల్లలైతే మరీను.

ఏమిటీ విపరీతం?

పసి పిల్లలకు గోరుముద్దలు తినిపించి, కమ్మని కథలు చెప్పాల్సిన తల్లులు ఆరునెలల వయసునుంచే పిల్లలకు ఫోన్లు అలవాటు చేసేస్తున్నారు. అన్నం తినడం లేదని, మారాం చేస్తున్నారని, తమ పనులకు అడ్డు వస్తున్నారని,  ఏకాంతానికి అడ్డంకిగా మారుతున్నారని వారి చేతికి స్మార్ట్ ఫోన్ ఇచ్చేస్తున్నారు.  నెలల వయసులోనే వారు  రేడియేషన్, స్ట్రేస్, ఎడిక్షన్ కు అలవాటు పడి  చిన్నప్పుడే రకరకాల  రోగాలు తెచ్చుకుంటున్నారు. పసి పిల్లలకు ఆ వయసులో మెదడు, వెన్ను, కళ్లు, మానసిక స్థితి ఎంత లేతగా ఉంటాయి? ఇంకా ఎదిగే దశలో ఉన్న వారు రేడియేషన్ కు బలైతే జీవితాంతం  నరకం చూడాల్సి ఉంటుంది. ఇక స్కూల్‌ గోయింగ్, టీనేజ్ పిల్లలైతే మరీను. ఆ ఫోనుతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అడల్ట్ కంటెంట్, పోర్నోగ్రఫీ, తదితర చెత్త సైట్లకు అలవాటు పడి చదువు పక్కన పెట్టి సమాజానికి విద్రోహక, నేరస్తుల ముఠాగా మారుతున్నారు. పైగా స్మార్ట్ ఎడ్యుకేషన్ పాలసీ తెస్తున్న చిక్కులు మరిన్ని. చిన్న వయసులోనే వారికి మొబైల్‌, లేదా ల్యాబ్ టాప్ తో అనుసంధానం చేసి హోం వర్కులు అవీ ఇస్తున్నారు. గ్రూపులు పెట్టి వాట్సప్ ఫాలో అవమంటున్నారు. స్మార్ట్ ఫోన్ మానవ జీవితాన్ని కబళిస్తున్న పెను ముప్పు. మరే ఇతర వైరస్ ఇంత దారుణంగా దెబ్బ తీయలేదు. ఇదొక సైలెంట్ కిల్లర్. మన శరీరంలో అణువణువునూ పీల్చి పిప్పి చేసి, ఒత్తిడిని, ఏకాంతాన్ని పెంచేసి మెదడును పారలైజ్ చేసేస్తుంది. అన్ని దేశాల్లోనూ ఇదొక అతిపెద్ద సమస్య.

చైనాలో మిలటరీ తరహా బూట్ క్యాంప్స్..

దేశాలకు దేశాలే దీని వలలో పడి బంగారం లాంటి యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. చైనా లాంటి దేశాల్లో అయితే చిన్న వయసులో ఫోన్ అడిక్షన్  బారిన పడిన పిల్లలను మిలటరీ స్టైల్‌ బూట్‌ క్యాంపులకు తరలించి అనేక కఠినమైన శిక్షలకు,చికిత్సకు గురి చేసి వారి వ్యసనాన్ని వదిల్చే ప్రయత్నం చేస్తున్నాయి.

ఎలక్ట్రానిక్ హెరాయిన్… – చైనా

చైనా ప్రభుత్వం స్మార్ట్ ఫోన్‌ ను ఎలక్ట్రానిక్ హెరాయిన్ అని ప్రకటించింది. స్మార్ట్ ఫోన్ వ్యసనాన్ని అదుపు చేసేందుకు చాలా ప్రయత్నిస్తోంది. వేలాది మంది పిల్లలకు  కఠినమైన, నియమబద్దమైన జీవనాన్ని అలవరచడం అనే పేరుతో కఠినాతికఠినంగా వ్యవహరిస్తోంది. స్మార్ట్ ఫోన్ అడిక్షన్ బారిన పడిన వారందరిని మిలటరీ స్టైల్‌ లో ట్రీట్ చేస్తోంది.16 గంటల పాటు కఠినమైన వ్యాయామం చేయించి ఆతర్వాత థెరపీ ఇస్తుంది.

చల్లని షవర్ బాత్‌ తలారా చేయించి కఠినమైన క్రమశిక్షణను అలవాటు చేస్తుంది. ఆపై ఎలక్ట్రో కన్ వల్‌ సివ్ థెరపీ ఇచ్చి వారి అనుమతితో సంబంధం లేకుండా  బలవంతంగా మందులు మింగిస్తుంది. ట్రీట్ మెంట్ పేరుతో చేస్తున్న ఈ కఠోర వ్యాయామం వల్ల టీనెజర్లు మానసిక సమతౌల్యతను కోల్పోయి అది జీవితంపై చాలా కాలం పాటు ప్రభావం పడి నరకాన్ని అనుభవిస్తున్నారు. ట్రీట్ మెంట్‌ సమయంలో ఓ టీనేజర్ చనిపోవడంతో చివరకు క్యాంప్ ముసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ అతి వాడకం సమస్య ఒక్క చైనాదే కాదు అమెరికాలో అయితే మరింత ఘోరం. అక్కడ చిన్న పిల్లలు రోజుకు కనీసం ఆరుకు పైగా గంటలు అలా మొబైల్‌ స్క్రీన్ లకు అతుక్కునే కనిపిస్తున్నారు. అది  లెక్కిస్తే ఏడాదికి దాదాపు 91రోజులు. అంటే 2,190 గంటలు ఫోన్ లోనే ఉంటున్నారు. మనదేశంలో 44 శాతం మందికి స్మార్ట్ ఫోన్లు అడిక్షన్ గా మారాయి.

ఒంటిని, మనసుని దెబ్బతీసే ఫోన్

స్మార్ట్ ఫోన్లు అతిగా వాడితే నలుగురితో కలవడం తగ్గిపోతుంది. అలాగే ఏ అంశంపైనైనా ఏకాగ్రత తగ్గిపోతుంది. మానసిక ఆరోగ్యం దారుణంగా దెబ్బ తింటుంది. నిద్ర కరువవుతుంది. ఎంగ్జైటీ పెరుగుతుంది. నిరాశ కమ్మేస్తుంది. ఏపని చేయలేని నిస్త్రాణ, జీవక్రియ దెబ్బతినడం, గుండె స్పందన తప్పడం, ఒక్కోసారి అకారణంగా ఏడ్వడం, ఎవరైనా కాస్త మనసు విప్పి పలకరిస్తే బోరుమని ఏడవడం లాంటి మానసిక బేలతనం ఆవరిస్తుంది.

కోవిడ్ అంటగట్టిన పాపం ఇది…

స్మార్ట్ ఫోన్ల వాడకం ప్రపంచమంతా ఉన్నప్పటికీ, కోవిడ్‌ పాండమిక్ వచ్చి చేసిన నష్టం ఇంతా అంతా కాదు.ఎవరినీ తాకే అవకాశం లేదు. ఏక్కడికీ వెళ్లే ఛాన్స్ లేదు. దాంతో కాలక్షేపానికి స్మార్ట్ ఫోన్లే దిక్కయ్యాయి. అప్పుడు వచ్చినవే యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్‌ మీడియా ఇంటరాక్షన్. అది కాస్తా శృతి మించి ఇప్పుడు ప్రపంచానికి ప్రమాద సంకేతంగా పరిణమిస్తోంది. ఇది అనేక పరిశోధనల్లో తేలిన నిజం. 2021లో ఓ సంస్థ జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడవడమే కాదు. ముప్పెంత పొంచి ఉందో అలెర్ట్ చేసింది.

37 శాతం చైనా జనాభా కోవిడ్‌ పాండమిక్ సమయంలో ఇంటర్నెట్‌ వాడకాన్ని అమాంతం పెంచేసి వ్యసనంగా మార్చేసుకుంది. దక్షిణాఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాల్లో స్మార్ట్ ఫోన్ల వాడకం ఓరేంజ్ లో పెరిగిపోయింది. ఈ విషయంలో యూరప్ కాస్త నయం. పరిమిత విధానాన్ని పాటిస్తోంది. చైనా,సౌదీ అరేబియా,మలేషియా దేశాలు ప్రపంచంలోకే స్మార్ట్‌ ఫోన్ అడిక్షన్ కు దారుణంగా దెబ్బతిన్న దేశాలుగా రికార్డయ్యాయి. మన దేశంలోనూ టీనేజర్లలో స్మార్ట్ ఫోన్ల వినియోగం వ్యసనంగా మారుతోంది.

ఆండ్రాయిడ్లతో ఎన్నెన్ని నష్టాలో

మానసిక ఆరోగ్యం దెబ్బతినడం, చదువులో వెనకబడటం, నలుగురితో కలవకపోవడం, ఏకాంతాన్ని ఇష్టపడటం, సైకలాజికల్‌గా చాలా బలహీనడిపోవడం జరుగుతుంది. దీనికి తోడు ఒకే చోట గంటల తరబడి కూర్చుని ఫోన్ లో మునిగిపోవడం చివరకి ఒబేసిటీకి దారితీస్తుంది. కదలబుద్ధి కాకపోవడం, కనీసం వ్యాయామాలు లేకపోవడంతో శరీరం మొద్దుబారుతుంది. నలుగురితోను కలవకుండా ఏకాంతంగా ఉండటం వల్ల  సామాజిక సంబంధాలు  దారుణంగా దెబ్బ తింటాయి.

నరాలపై తీవ్ర ప్రభావం…

దీర్ఘకాలం ఆ స్మార్ట్ ఫోన్ బ్లూ లైట్‌ కు అలవాటు పడితే అది నరాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. నరాలపై ఉండే సున్నితమైన కోటింగ్‌ పోయి తిమ్మిర్లు ఎక్కడం, చేతులు వణకడం, నడుస్తుంటే బ్యాలెన్స్ కోల్పోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. గంటల తరబడి ఫోన్ లోనే కాలక్షేపం వల్ల వినికిడి, కంటి చూపు, ఏకాగ్రత అన్నీ సర్వం కోల్పోతాము. వెలుగు చూడలేము. నిరంతరాయంగా కొంత కాలం ఈ టెక్నాలజీకి అలవాటు పడితే చేతిరాత  తప్పిపోతుంది. ఏ అంశాన్ని ఏకాగ్రతతో, సుదీర్ఘ సమయం పరిశీలించే ఓపిక ఉండదు. సహజమైన తెలివి తేటలు దెబ్బతిని మెదడు, జీర్ణశక్తి  మందగిస్తాయి. తిన్నది వంట పట్టదు. రోబోల కన్నా దారుణంగా మనిషి జీవితం తయారవుతుంది. సామాజిక సంబంధాలు దెబ్బతింటాయి. ఎవరితోనూ ఎక్కువ సమయం మాట్లాడే ప్రయత్నం చేయము.

అందుకే ఎలక్ట్రానిక్ సాధనాలేవైనా అవసరమైన మేరకే వాడుకోవాలి. అతి వినియోగం ఏదీ మంచిది కాదు. నిరంతర రేడియేషన్ మన శరీరానికి గొడ్డలి పెట్టు. మన కమ్యూనిటీ రిలేషన్స్ దెబ్బతీస్తూ ఇమ్యూనిటీకి తెచ్చే అతిపెద్ద చేటు. సో బీ కేర్ ఫుల్‌ విత్ స్మార్ట్ ఫోన్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com