చెన్నై మీటింగ్ తీర్మానం ఇదే…
భారతీయ జనతాపార్టీకి చెందిన మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయిని ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనుసరించలేరా? అని చెన్నైలో జరిగిన డీ లిమిటేషన్ జేఏసీ సమావేశంలో పలు పార్టీల నేతలు ప్రశ్నించారు. 2001లో అప్పటి ప్రధాన మంత్రి వాజ్‌పేయి నియోజక వర్గాల సంఖ్యను పెంచకుండానే.. పాత నియోజక వర్గాలతోనే పునర్విభజన పూర్తి చేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మోదీ కూడా అదే మాదిరిగా ముందుకెళ్లాలని సూచించారు.
కేంద్రం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెన్నై సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల్లోని కొన్ని పార్టీలు తీర్మానించాయి. ఒక జేఏసీగా ఏర్పడి పోరాటం చేయాలని నిర్ణయించాయి. ప్రస్తుతానికి జనాభాప్రాతిపదికన జరిగే డీలిమిటేషన్‌తో కొన్ని రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని భావించాయి. అందుకే పాతికేళ్ల పాటు ఈ డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు చేసిన కొన్ని తీర్మానాలను సమావేశానికి హాజరైన నేతలు చర్చించి ఆమోదించాయి.
చెన్నై జేఏసీ మీటింగ్‌లో ఇదే తీర్మానం ఆమోదించారు. మరో 25 యేళ్ల పాటు నియోజకవర్గాల సంఖ్య పెంచొద్దని ఉన్న నిబంధనను మరో 25 సంవత్సరాలు పొడిగించాలని తీర్మానంలో పేర్కొన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం పారదర్శకతను పాటించాలని జేఏసీలో నిర్ణయం తీసుకున్నారు. జేఏసీ తీర్మానాన్ని డీఎంకే ఎంపీ కనిమొళి చదివి వినిపించారు.
కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఏ డీలిమిటేషన్ ప్రక్రియ అయినా ప్రజాస్వామ్యాన్ని మరింత బలపర్చేలా పారదర్శకంగా ఉండాలని చెప్పారు. అన్ని రాష్ట్రాల రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలకు దానిపై చర్చించడానికి వీలు కల్పించాలని అన్నారు.