-
అన్ని రాష్ట్రాలూ తీర్మానం చేయాలని రేవంత్ రెడ్డి పిలుపు
-
దక్షిణాదిని ప్రశంసించాల్సింది పోయి శిక్షిస్తారా?
-
కేంద్రం ముందు మూడు ప్రతిపాదనలు ఉంచిన రేవంత్
-
లోక్‌సభ దక్షిణాది రాష్ట్రాల సీట్లను 33శాతానికి పెంచాలి
లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు ఇప్పుడున్న సీట్లను పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు జనాభా నియంత్రణను విజయవంతం చేసిన దక్షిణాది రాష్ట్రాలను అభినందించడానికి బదులు.. శిక్షించడమేంటని ప్రశ్నించారు. లోక్‌సభలో 24 శాతంగా ఉన్న దక్షిణ భారత రాష్ట్రాల ఎంపీ సీట్లను 33 శాతానికి పెంచాలని రేవంత్ డిమాండ్ చేశారు. పునర్విభజన ప్రక్రియపై తెలంగాణ రాష్ట్ర శాసనసభలో త్వరలోనే తీర్మానం ఆమోదిస్తామని.. తెలంగాణ మాదిరిగానే.. మా రాష్ట్రంలో ఎలా చేస్తున్నామో, మీ మీ రాష్ట్రాల్లోనూ అలానే చేయాలని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నాయకులకు విజ్ఞప్తి చేశారు. దక్షిణ భారతదేశ పౌరుల గళాన్ని బలంగా, ఐక్యంగా మొత్తం భారత దేశానికి వినిపిద్దామన్నారు.
నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీల నాయకులందరినీ ఏకతాటిపై తెచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు సీఎం రేవంత్. పునర్విభజనపై అందరూ ఓపెన్‌గా అభిప్రాయాలను పంచుకోవాలని, ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం దేశం పెద్ద సవాల్‌ను ఎదుర్కొంటోందన్న రేవంత్ రెడ్డి.. బీజేపీ జనాభా జరిమానాల విధానాన్ని కొనసాగిస్తోందన్నారు. 1971లో జనాభాను నియంత్రించాలని దేశం నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి దక్షిణాది రాష్ట్రాలు దాన్ని విజయవంతంగా అమలు చేస్తే.. ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాలు మాత్రం జనాభా నియంత్రణలో విఫలమయ్యాయన్నారు. దక్షిణాది రాష్ట్రాలన్నీ వేగంగా ఆర్థిక వృద్దిని సాధించాయని, జీడీపీ, తలసరి ఆదాయం, వేగంగా ఉద్యోగాల కల్పన, మెరుగైన మౌలిక వసతుల కల్పన, సుపరిపాలన, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో మంచి ప్రగతి సాధించాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
దేశ ఖజానాకు దక్షిణాది నుంచి మనం పెద్ద మొత్తంలో నిధులు ఇస్తున్నా.. తక్కువ మొత్తాన్ని తిరిగి పొందుతున్నామన్నారు. తమిళనాడు పన్నుల రూపంలో కేంద్రానికి రూపాయి చెల్లిస్తే 29 పైసలే వెనక్కి వస్తుంటే… ఉత్తర ప్రదేశ్‌కు మాత్రం రూపాయికి రెండు రూపాయల 73 పైసలు వెనక్కి వెళుతున్నాయన్నారు. ఇక, బీహార్ రూపాయి చెల్లిస్తే 9 రూపాయల 22 పైసలు వెనక్కి తీసుకుంటోందని, కర్ణాటకకు కేవలం 14 పైసలు, తెలంగాణకు 41 పైసలు, కేరళకు 62 పైసలు మాత్రమే వెనక్కి వస్తున్నాయని గణాంకాలతో సహా వివరించారు. అదే సమయంలో మధ్య ప్రదేశ్ రూపాయి పన్ను రూపంలో కేంద్రానికి ఇస్తే వెనక్కి రూ.2.79 పైసలు వెళుతున్నాయన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం కేటాయింపులు, పన్ను చెల్లింపులు క్రమంగా తగ్గిస్తోందన్నారు. చివరకు జాతీయ ఆరోగ్య మిషన్ కేటాయింపుల్లోనూ ఉత్తరాది రాష్ట్రాలకే 60 నుంచి 65 శాతం నిధులు దక్కుతున్నాయన్నారు.
మనది ఒకే దేశమని, మనం దానిని గౌరవిస్తామని.. కానీ, ఈ పునర్విభజనను మాత్రం మనం అంగీకరించ కూడదని ఇతర దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఎందుకంటే ఇది దక్షిణాది రాష్ట్రాల రాజకీయ కుదింపు అని, మంచి ప్రగతి సాధిస్తున్న రాష్ట్రాలను ఈ ప్రక్రియ శిక్షిస్తోందన్నారు. ఈ అసమగ్రమైన పునర్విభజన ప్రక్రియ చేపట్టకుండా మనం బీజేపీని అడ్డుకోవాలని సూచించారు.
ఇప్పుడున్న లోక్‌సభ సీట్లు పెంచొద్దని, ఉన్న సీట్లతోనే పునర్విభజన ప్రక్రియ చేపట్టాలన్నది తన మొదటి పాయింట్ అన్నారు. 1976లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అలాగే పునర్విభజన చేపట్టిందని, లేకుంటే రాష్ట్రాల మధ్య రాజకీయ తేడాలు వచ్చేవన్నారు. 2001లో ప్రధానమంత్రి వాజ్‌పేయీ నేతృత్వంలోని ప్రభుత్వం పునర్విభజన ప్రక్రియను అలానే ప్రారంభించిందన్నారు. లోక్‌సభ సీట్లను అదే సంఖ్యలో ఉంచుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదే విధంగా చేయగలరా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఇక తాను లేవ ెత్తుతున్న రెండో పాయింట్ చూస్తే… జనాభా దామాషా ప్రాతిపదిక పునర్విభజను దక్షిణాది వ్యతిరేకిస్తోందన్నారు. బీజేపీ ప్రతిపాదిస్తున్న జనాభా దామాషా పద్దతిలో పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలు రాజకీయ గళం కోల్పోతాయన్నారు. దక్షిణాది రాష్ట్రారాలను ఉత్తరాది ద్వితీయ శ్రేణి పౌరులుగా తగ్గించివేసే ప్రమాదం ఉందన్నారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేపడితే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు దేశంపై ఆధిపత్యం చలాయిస్తాయని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారన్నారు. ఏ పరిస్థితుల్లోనూ దక్షిణాది రాష్ట్రాలు దీనికి అంగీకరించకూడదన్నారు. బీజేపీ అనుసరిస్తున్న ఈ విధానానికి వ్యతిరేకంగా దక్షిణాది ప్రజలు, పార్టీలు, నాయకులు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు.
ప్రొరేటా విధానాన్ని అంగీకరించలేమని.. ఇది తన మూడో పాయింట్ అన్నారు రేవంత్ రెడ్డి. ప్రొరేటా విధానం కూడా దక్షిణాదికి నష్టమే కలిగిస్తుందన్నారు. ప్రొరేటా ప్రక్రియ కూడా రాజకీయ అంతరాలను పెంచుతుందన్నారు. ప్రొరేటా విధానాన్ని పాటిస్తే సీట్ల మధ్య తేడా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయిస్తుందని, ఒక్క సీటు కూడా తేడాను చూపుతుందన్నారు. ఒక్క సీటుతో కేంద్ర ప్రభుత్వం పడిపోయిన చరిత్ర మన దేశంలో ఉందని గుర్తు చేశారు రేవంత్. కాబట్టి ప్రొరేటా విధానం కూడా దక్షిణాది రాజకీయ ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందన్నారు.
ఇలాంటి అంతరాలు తలెత్తకుండా ఉండాలంటే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయీ విధానాన్ని పాటించాలని సూచించారు. మరో 25 ఏళ్లపాటు లోక్‌సభ సీట్లలో ఎటువంటి మార్పు తీసుకురావద్దన్నారు. సీట్ల సంఖ్యలో మార్పు లేకుండా పునర్విభజన ప్రక్రియ చేపట్టాలన్నారు. పునర్విభజనకు రాష్ట్రాన్ని యూనిట్ తీసుకొని చేయాలని, రాష్ట్రాల్లోని జనాభా ఆధారంగా పునర్విభజన చేపట్టాలని, రాష్ట్రాల్లోని నగరాలు, గ్రామాల్లోని జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్ల హద్దులను మార్పు చేయాలన్నారు. తాజా జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ సీట్ల సంఖ్య పెంచాలన్నారు. ప్రతి రాష్ట్రంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. లోక్ సభ స్థానాల పెంపును మరో 25 ఏళ్లపాటు వాయిదా వేయాలని సూచించారు.
తాను తెలంగాణలోని మల్కాజిగిరి నుంచి ఎంపీగా పని చేశానన్న రేవంత్.. అది ప్రపంచంలోనే అతి పెద్ద నియోజకవర్గం అని.. అక్కడ మొత్తం జనాభా 45 లక్షలైతే ఓటర్లు 32 లక్షలు.. కాబట్టి తాను ఈ సమస్యను పూర్తిగా అర్ధం చేసుకోగలనన్నారు. పార్లమెంట్ దేశానికి విధానపరమైన శాసనాలను రూపొందిస్తుందే తప్ప ప్రజలకు అవసరమైన చిన్న చిన్న సమస్యలపై నిర్ణయాలు చేయదని, ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలను స్థానిక సంస్థలు, రాష్ట్రాలు, శాసనసభ నియోజకవర్గాల పరిధిలోనే పరిష్కారమవుతాయన్నారు.
జనాభా నియంత్రణకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలను శిక్షించే విధానానికి కేంద్రం స్వస్తి చెప్పాలన్నారు రేవంత్ రెడ్డి. దేశ నిర్మాణంలో 1975 నుంచి 2025 వరకు 50 ఏళ్ల పాటు మనం అందించిన సేవలకు మనల్ని అభినందించాలని, మనకు కేంద్రమే వెనక్కి కొంత చెల్లించాలన్నారు. జనాభా దామాషా ప్రాతిపదికన చేసే పునర్విభజన చేపట్టొద్దని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు. లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి దేశంలోని ఇతర రాష్ట్రాలతో సంబంధం లేకుండా చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సీట్లను ఏర్పాటు చేసినట్లే దక్షిణాదికి అవకాశం ఇవ్వాలన్నారు. మంచి ప్రగతి సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ సీట్లలో మంచి వాటా ఇవ్వడం ద్వారా ఇతర రాష్ట్రాలు ఆర్థిక వృద్ది, సుపరిపాలనపై దృష్టి సారించేలా చేయాలన్నారు.
ఒకవేళ.. బీజేపీ పునర్విభజన ప్రక్రియ ఇప్పటికిప్పుడు చేయాలంటే తాను చేస్తున్న ప్రధాన డిమాండ్ ఇదే అని ప్రస్తావించారు రేవంత్ రెడ్డి. 543 సీట్లు ఉన్న లోక్‌సభలో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య 130.. ఇది మొత్తం సీట్లలో 24 శాతం ఉందని, పునర్విభజన తర్వాత ఏర్పడే నూతన లోక్‌సభలో 33 శాతం సీట్లు తమకు ఇవ్వాలనేది దక్షిణాది రాష్ట్రాలుగా తాము చేస్తున్న డిమాండ్ అన్నారు రేవంత్. బీజేపీ 50 శాతం సీట్లను పెంచాలనుకుంటే అలా పెరిగే 272 సీట్లతో మొత్తం లోక్ సభ సీట్ల సంఖ్య 815 అవుతుందని, ఇందులో దక్షిణాది రాష్ట్రాలకు 33 శాతం అంటే 272 సీట్లు ఇవ్వాలని.. ఈ సీట్లను దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలకు ఇప్పుడున్న ప్రొరేటా ప్రాతిపదికన పంచవచ్చన్నారు. దేశంలో మిగిలిన సీట్లను ఉత్తరాది, ఇతర రాష్ట్రాలకు కేంద్రం తమ అభిమతం మేరకు పంచవచ్చన్నారు. అనుకున్న దానికంటే దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్య తగ్గిస్తే అది దేశ రాజకీయ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు మన విభేదాలను విస్మరించి పునర్విభజనలో మన వాటా దక్కించుకునేందుకు ఐక్యంగా పోరాడాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.