26.4 C
Hyderabad
Friday, June 26, 2026

Live Video

spot_img

తెలంగాణలో 133 బెట్టింగ్‌ యాప్స్ పై నిషేధం…

  • జియో ఫెన్సింగ్‌ మెథడ్ తో బ్లాక్ చేసిన అధికారులు
  • గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్ ద్వారా వర్చువల్‌ బౌండరీస్ తో బ్లాక్
  • యాప్స్ ఓనర్లు, నిర్వాహకులు, టెక్నికల్‌ టీములపై గురి

ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్‌ యాప్స్ పై కొరడా ఝుళిపించింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు బెట్టింగ్‌ యాప్స్ ను జియో ఫెన్సింగ్‌ పద్ధతిలో బ్లాక్ చేస్తున్నారు. జియోఫెన్సింగ్‌ టెక్నిక్ తో మన దేశంలో రిజిస్టర్ కానీ విదేశాలనుంచి ఆపరేట్‌ చేస్తున్న చట్ట విరుద్ధమైన యాప్ లను నిషేధిస్తున్నారు.ముందు వాటన్నింటినీ ఐడెంటిఫై చేస్తున్నారని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధిపతి షికా గోయల్‌ తెలిపారు. తెలంగాణలో బెట్టింగ్‌ యాప్స్ ను ప్రమోట్‌ చేస్తున్న యూట్యూబ్‌ ఇన్ ఫ్లుయెన్సర్స్ పై కూడా ఇదే క్రమంలో పోలీసులు కేసులు పెడుతున్నారు. మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్స్, లాప్ టాప్స్, ఇతర కమ్యూనికేషన్ సాధనాలను వినియోగించి జియో ఫెన్సింగ్‌ సిస్టమ్‌ ను అమలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక ఇండియన్ కంపెనీలు నిర్వహిస్తున్న దాదాపు 133 బెట్టింగ్‌ యాప్స్ ను నిషేధించినట్లు షీకా గోయెల్‌ తెలిపారు. రెండు నెలల నుంచే ఈ చర్యలు చేపట్టామని ఆమె చెబుతున్నారు. సోషల్‌ మీడియా వేదికలపై ఈ ఆన్ లైన్ బెట్టింగ్‌ యాప్స్ ఎక్కువగా ప్రచారం అవుతున్నాయని తెలుసుకుని వాటన్నింటినీ జియో ఫెన్సింగ్‌ పద్ధతిలోనే బ్లాక్ చేసి ఈ అంశాన్ని ఒక కొలిక్కి తెచ్చారు.అలాగే అన్ రిజిస్టర్డ్ యాప్స్ ను కూడా పరిశీలిస్తున్నారు. గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్ ద్వారా వర్చువల్‌ బౌండరీస్ సాయంతో జియో ఫెన్సింగ్‌ పద్ధతిలో ఈ యాప్స్ ను పనిచేయకుండా చేస్తున్నారు. గేమింగ్‌ యాక్ట్ లోని పలు సెక్షన్ల ప్రకారం బెట్టింగ్‌ యాప్స్ నిర్వహణ చట్ట విరుద్ధం.ఈ యాప్ ఓనర్లు, వారి నిర్వాహకులను గుర్తించి వారి టెక్నికల్‌ టీములను సైతం అదుపులోకి తీసుకుని చర్యలు చేపడతామని షికా గోయల్‌ అంటున్నారు.

యాప్స్ బాధితులు కోకొల్లలు

ఈజీ మనీ మేకింగ్‌ ఆప్షన్ అనే భావనతో చాలా మంది ఈ యాప్స్ లో బెట్టింగ్‌ లకు సిద్ధపడుతున్నారు. యువత, నిరుద్యోగులు ఈ బెట్టింగ్‌యాప్స్ ద్వారా ఆన్ లైన్ పందాలు కాస్తూ లక్షల్లో నష్టపోతున్నారు. చాలా మంది అప్పుల పాలై, ఆర్థికంగా దివాళా తీసి చివరకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని షికా గోయల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరు ఇదొక వ్యసనంగా మారి ఈ ఊబి నుంచి బయట పడలేక పోతున్నారని, చట్టపరమైన చర్యలకు బలవుతున్నారని అన్నారు. చాలా బెట్టింగ్‌ యాప్స్ రిజిస్టర్ కాని ప్లాట్ ఫామ్స్ పైనుంచి ఆపరేట్‌ అవుతున్నాయి. చట్టపరమైన అనుమతులు లేకుండా నడుస్తున్న ఈ యాప్స్ లో పందేలు కాసినా, డబ్బు పెట్టుబడి పెట్టినా వాటి నుంచి వెనక్కు రాబట్టుకోవడం దాదాపు దుర్లభం. ఇన్‌ ఫ్లుయెన్సర్లు, మరికొందరు సెలబ్రిటీలు చేస్తున్న ప్రచారం నమ్మి బెట్టింగ్‌ స్కాముల్లో చిక్కుకుని అభం శుభం తెలియని యువత ఆత్మహత్యల బాటపడుతున్నారు. 2025లో ఆన్ లైన్ బెట్టింగ్‌లో నష్టపోయి ఆత్మహత్యల బాట పట్టిన వారి సంఖ్య కలవరపెడుతోంది.

-ఫిబ్రవరి 19న మహమ్మద్‌ అజీజుద్దీన్ అనే యువకుడు ఆన్ లైన్ బెట్టింగ్‌ లో మోసపోయి ఖమ్మంలోని తన ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు.

– జనవరి 23న హైదరాబాద్‌ బాలా నగర్‌కు చెందిన డి. తరుణ్ రెడ్డి అనే బీటెక్ చదివిన యువకుడు ఆన్ లైన్ బెట్టింగ్‌ లో 8 లక్షలు నష్ట పోయి ఆత్మహత్య చేసుకున్నాడు.

– జనవరి 13న శంషాబాద్‌ కు చెదిన సి. హెచ్. ప్రశాంత్ అనే యువకుడు ఆన్ లైన్ బెట్టింగ్‌ లో 8.5 లక్షలు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇవి వెలుగులోకి వచ్చిన కొన్ని కేసులు మాత్రమే. బయటకు రాని కేసులు ఎన్నో ఉన్నాయి.
అలాగే 2024 లో కూడా ఆన్ లైన్ బెట్టింగ్‌ లో మోసపోయి ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య ఎక్కువే. ఈ గేమింగ్‌ లో 30 లక్షలు నష్టపోయిన కొడుకు తిరిగి చెల్లించలేక ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబం మొత్తం గత ఏడాది అక్టోబర్ 3న ఆత్మహత్య చేసుకుంది.

-ఆన్ లైన్ మోసాలకు బలయ్యే వెంకటయ్య అనే యువకుడు డిసెంబర్ 28న నారాయణ్ పేట్ లో ఆత్మహత్య చేసుకున్నాడు.

– ఆన్ లైన్ బెట్టింగ్‌ లో నాలుగు లక్షలు పోగోట్టుకున్న సాయి కిరణ్ అనే యువకుడు గతేడాది డిసెంబర్ 22న ఆత్మహత్య చేసుకున్నాడు.

– డిసెంబర్ 18న టి. లింగం అనే వ్యక్తి ఇబ్రహీం పట్నంలో ఇలాగే బెట్టింగ్‌ యాప్స్ ద్వారా మోసపోయి చనిపోయాడు.

బలహీనతలను సొమ్ము చేసుకునేదిలా..
ఇవి వ్యసనంగా మారడానికి ఇన్ స్టాంట్‌ సైన్ అప్స్, బోనస్ లు ప్రధాన కారణం. ఈ ఉచ్చులో పడిన వారు నిరంతరం ఆశ చావక గాంబ్లింగ్‌ కు అలవాటు పడి పెట్టుబడులు పెడుతుంటారు. ఆపై చిల్లి గవ్వ కూడా మిగలక ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వం జియో ఫెన్సింగ్‌ పద్ధతిలో వాటిని బ్లాక్ చేస్తుండటంతో ఈ గాంబ్లింగ్‌ కొంత తగ్గే అవకాశాలున్నాయి. ఆన్ లైన్ బెట్టింగ్‌ అత్యంత ప్రమాదకరమైనదని తెలిపే విధంగా 42,206 అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించామని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు.అందుకే ఇన్‌ ఫ్లుయెన్సర్లపై లీగల్‌ చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. బెట్టింగ్‌ యాప్స్ బాధితులు 871267222 నెంబర్కు వాట్సప్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలంగాణ పోలీసు శాఖ ప్రకటించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com