- హనీ ట్రాపుల్లో నేతలు…
- కర్ణాటకలో 48 ఎమ్మెల్యేలపై వలపు వల
- అధికార,ప్రతిపక్ష, సభ్యులు,కేంద్ర మంత్రులు బాధితులే
- ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న వ్యక్తే ఇదంతా చేస్తున్నాడని బీజేపీ ఆరోపణ
- స్పీకర్ పోడియం చుట్టుముట్టిన బీజేపీ సభ్యులు, 18 మంది సస్పెన్షన్
- గతంలో ఏపీ, తెలంగాణాలలోనేతలపై రూమర్లు
హనీ ట్రాప్.. అందమైన యువతులను ఎరగా వేసి వారితో వలపు కబుర్లు మాట్లాడించి టార్గెట్ చేసిన వారిని అడ్డంగా ఇరికించి, ఆపై వారి ఆడియో, వీడియో సంభాషణలను బయట పెట్టి సమాజంలో వారి పరువును తీసేయడం.. ఇదొక ఎత్తుగడ.. మరికొందరు కింది స్థాయి కిరాయి వాళ్లయితే ఆ వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించడం గత కొంత కాలంగా మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద జాడ్యాలలో ఇదొకటి.
కర్ణాటకలో ఏకంగా 48 మంది రాజకీయనాయకులు ఈ హనీ ట్రాప్ లో పడ్డారన్న వార్తలు ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.ఇటీవల ఇద్దరు మంత్రులపై హనీ ట్రాప్ ప్రయత్నాలు జరిగాయని పీడబ్ల్యూడీ మంత్రి సతీష్ జార్కిహొళి ప్రకటించారు. అంతేకాదు, సీడీలు,పెన్‌డ్రైవ్‌లలో వారి అభ్యంతరకర వీడియోలు, సంభాషణలు ఉన్నాయని బాంబు పేల్చారు. బాధితుల్లో అధికారపక్షం సహా విపక్షసభ్యులు ఉన్నారని ఆయన అన్నారు. అంతేకాదు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు, సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్నపై కూడా రెండు సార్లు హనీట్రాప్ జరిగిందని, దీనిపై హోంశాఖ దర్యాప్తు ప్రారంభించిందని పేర్కొన్నారు.
గత 20 ఏళ్లుగా నాయకుల్ని వలపు వలలో దించడం పరిపాటిగా మారిందన్నారు ఈ తరహా రాజకీయాలు సరికాదని, కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం హనీట్రాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. గతంలో తనపై కూడా రెండుసార్లు హనీట్రాప్‌కి ప్రయత్నించినా.. అవి బెడిసికొట్టాయని పేర్కొన్నారు. ఇది ఇంతటితో ఆగిపోవాలని మంత్రి సతీష్ జార్కి హోళి అభిప్రాయపడ్డారు. కర్ణాటక అసెంబ్లీ ఇవాళ ఇదే అంశంపై దద్ద రిల్లింది. నిందతులపై చర్యలు తీసుకోవాలని ఇలాంటి ఘర్షణలు జరగకుండా నివారించాలన్న డిమాండ్ పెరిగిపోయింది.దాంతో దీనిపై న్యాయపరమైన దర్యాప్తు జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తే ఉన్నత స్థాయి దర్యాప్తు ఇప్పటికే ప్రారంభమైందని, నిందితులు ఎంత పెద్ద వారైనా అధికారంలో ఉన్నా క్షమించేది లేదని హోం మంత్రి బదులిచ్చారు. బీజేపి సభ్యులు సభలో నినాదాలుచేస్తూ చేత సీడీలు పట్టుకుని ఎవరు చేయించారో తమకు ఆధారాలు దొరికాయంటూ ఆందోళన చేశారు.
సభ మధ్యలోకొచ్చి వారు ఆందోళన చేయడం, ముఖ్యమంత్రి ప్రసంగాన్ని అడ్డుకోడంతో సభ ఒక దశలో స్తంభించిపోయింది.సిద్ద రామయ్య సన్నిహితుడు కోపరేషన్ శాఖా మంత్రి రాజన్న మాట్లాడుతూ ఇది దేశ వ్యాప్తంగా విస్తరించిందని, ఏడుగురు కేంద్ర మంత్రులు కూడా ఈ హానీ ట్రాప్ వలలో పడి బాధితులనీ సభకు తెలిపారు. హానీట్రాప్ చేయించడం వెనుక ఓ కీలక రాజకీయ నేత హస్తముందని, సీఎం పదవి కోసం ఆరాట పడుతున్న వ్యక్తే ఇదంతా చేయించారనడానికి ఆధారాలున్నాయంటూ మరికొందరు ఎమ్మెల్యేలు ఆరోపణలు చేశారు. ఇదేవిషయంపై బీజేపీ సభ్యులు పట్టువిడవకుండా పోడియం దగ్గర ఆందోళణ చేయడంతో 18 బీజేపీ శాసనసభ్యులను ఆరు నెలల పాటు స్పెండ్ చేశారు.
జాడ్యంగా మారిన హానీ ట్రాప్
హనీ ట్రాప్ దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా కలవర పెడుతున్న అంశం. మనమే కాదు విదేశాల్లోనూ దేశాధ్యక్షులు, రాజకీయ నేతలను అభిశంసించడానికి, గద్దె దింపడానికి వినియోగిస్తున్న పదునైన ఆయుధం.సెక్స్ స్కాండల్స్ కూడా ఇలాంటివే. టార్గెటెడ్ పర్సన్‌ను సమాజంలో పలుచన చేసేందుకు విదేశాల్లో ఎక్కువగా ఇవి జరుగుతుంటాయి. మన దేశంలోఈ జాడ్యం ఇంకా బాగా ప్రాచుర్యంలోకి రాలేదు కానీ,హానీ ట్రాప్ మాత్రం బాగా పెరిగింది. హానీ ట్రాప్ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లా తయారైంది. ఇది రాజకీయాలకే కాదు పేరొందిన సెలబ్రిటీలు, వ్యాపార వేత్తలు సైతం దీని బారిన పడుతున్నారు.
హనీ ట్రాప్ తో బ్లాక్ మెయిలింగ్
ఏపీలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. అయితే ఈ ఆరోపణలకు గురైన వ్యక్తుల చిత్త చాంచల్యాలపై ప్రజలకు ముందే అవగాహన ఉంటుంది కాబట్టి దాని ఆధారంగా జడ్జి చేయడం పరిపాటిగా మారిపోయింది. రాజకీయ నాయకుల దగ్గర పనులు చేయించుకునే సమయంలోనూ, ఏవైనా లాభం, లబ్ది, ఆర్థిక సహాయం, రాజకీయ పదవులు ఆశించినప్పుడు సాధారణంగా ఇలాంటి వ్యవహారాలు వెలుగు చూస్తాయి. గతంలో ఏపీలో వైసీపీ, టీడీపీ పార్టీలు ఇలాంటి ప్రయోగాలు పరస్పరం చేసుకున్నారన్న ఆరోపణలూ వినిపించాయి. హానీ ట్రాప్ లేదా ఇలాంటి వలపు వలలు వేయవచ్చని కాబట్టి పార్టీ నేతలందరూ అలెర్ట్ గా ఉండాలని అలాంటి ఉచ్చులో పడొద్దని అటు వైసీపీ, టీడీపీలు రెండూ తమ తమ సభ్యులను అలెర్ట్ చేసిన సందర్భాలను చూశాము. అప్పట్లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ , సినీ నటుడు పృథ్వీ, అంబటి రాంబాబు ఇలా మరి కొందరు నేతల బాగోతాలు ఇదే విధంగా వెలుగు చూశాయి. ఆ తర్వాత చిత్తూరులో తెలుగు దేశానికి చెందిన ఒక ఎమ్మెల్యే ఇలాగే అసభ్యకరంగా వీడియోలకు దొరికి పోయాడు. దాంతో టీడీపీ, వైసీపీ ఇలా వల పన్ని వీక్ నెస్ ఉన్న వారిని ట్రాప్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపించాయి.
ఇటు తెలంగాణలోనూ బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వరంగల్ కు చెందిన ఒక సర్పంచ్ స్థాయి మహిళా నేతను బీఆర్ ఎస్ నేత (రాజయ్య) ఒకరు మాయమాటలు చెప్పి మోసగించినట్లు ఆ మహిళా నేత మీడియాకెక్కి ఆరోపణలు చేశారు. ఆ లిస్టులో గండ్ర వెంకట రమణారెడ్డి లాంటి వారు కూడా తనను వేధించారంటూ ఆరోపించారు. అయితే ఆ మహిళ తమకు తెలియనే తెలియదని, సాధారణంగా డబ్బుల కోసం ఇలా ట్రాప్ చేస్తుంటారని బీఆర్ ఎస్ నేతలు వివరణ ఇచ్చుకున్నారు.ఆ అభ్యంతరకర వీడియోలు అప్పట్లో తీవ్రంగా సర్క్యులేట్ కూడా అయ్యాయి. అయితే ఇది హానీ ట్రాప్ కిందకు రాదని, సదరు మహిళా నేతను మోసగించి దానికి ఇలా ముసుగు వేస్తున్నారని అప్పట్లో పెద్ద చర్చగా మారింది.
దేశాలమధ్య హానీ ట్రాప్
ఇక దేశాల మధ్య కూడా హానీ ట్రాప్ లు జరుగుతుంటాయి. పొరుగు దేశ రహస్యాలను తెలుసుకోడానికి, ఆయా రంగాల్లో పనిచేస్తున్న సీనియర్ అధికారులపై హానీ ట్రాప్ వల విసురుతుంటారు. దేశ రక్షణ, ఆయుధాలు, మిలటరీ సంపత్తి, రాజకీయ వ్యూహాలు, సైనిక వ్యూహాల గురించి తెలుసుకోడానికి కౌంటర్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోడానికి ఈ రకమైన ట్రాప్ జరుగుతుంటుంది. భారత, పాకిస్థాన్ దేశాల మధ్య సరిహద్దుల్లో అయితే సైనికులు, అధికార్లపై హానీ ట్రాప్ లు పరస్పరం జరుగుతుంటాయి.
ఏదేమైనా హానీ ట్రాప్ లు ఒక సామాజిక సమస్యగా మారాయి.గతంలో మన నేవీ అధికారులు కూడా అనేక సార్లు పాకిస్థానీ మహిళల హానీ ట్రాప్ వలలో చిక్కుకున్న సందర్భాలున్నాయి. వారి మోజులో పడి కీలక రహస్యాలు, అధికారిక పత్రాలు వారికి అందిస్తే ఇక కొంప కొల్లేరే.