రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద తెలంగాణ ప్రభుత్వానికి రుణాలు అందించాలని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాబార్డ్ చైర్మన్ కేవీ.షాజీని కోరారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో నాబార్డ్ చైర్మన్ షాజీ సీయం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా మైక్రో ఇరిగేషన్ కు నిధులు ఇవ్వాలని సీయం రేవంత్ రెడ్డి నాబార్డ్ చైర్మన్ నికి విజ్ఞప్తి చేశారు. అలాగే కోఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేయాలని, కొత్తగా మరిన్ని కోఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చెయ్యడానికి కృషి చేయాలని సీయం ఈ సందర్భంగా షాజీకి సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపులకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని అడిగారు. ఐకేపీ, గోడౌన్స్, రైస్ మిల్లులను నాబార్డ్ కు అనుసంధానం చేసి రాష్ట్రంలో మిల్లింగ్ కెపాసిటీ పెంచేందుకు సహకరించాలని అడిగారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నాబార్డు స్కీముల నిధులు మార్చి నెలాఖరులోగా ఉపయోగించుకోవాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. స్వయం సహాయాక మహిళా సంఘాలకు అందించే సోలార్ ప్లాంట్ల నిర్వహణను నాబార్డుకు అనుసంధానం చేయాలని అధికారులకు సీయం సూచించారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల్లో డీసీసీబీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నాబార్డ్ చైర్మన్ కేవీ.షాజీ ప్రతిపాదించారు.