తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన పాత్రలు చేసి అన్ని వర్గాలను మెప్పించిన నటుడు శోభన్ బాబు. కుటుంబ కథా చిత్రాలు, ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేసినా మహిళా లోకానికి శోభన్ బాబు హీరోనే. అలాంటి అందాల శోభన్ బాబు వర్ధంతి(మార్చి20). ఈ సందర్భంగా ఆ అందాల నటుని జీవన ప్రస్తానం లో కొన్ని ఆసక్తికరమైన విశేషాలు.
చెన్నై మహానగరంలోని నుంగంబాకంకు దగ్గరలో వుండే రాజారాం మెహతా నగర్ లో ఓపెద్ద లోగిలి. అందులో రెండు ఇళ్లు. ఒకటి ‘శాంతి’ మరొకటి ‘ప్రశాంతి’. శాంతి నిలయంలో నటభూషణుడు, అందాల నటుడు శోభన్ బాబు కుటుంబం ఉంటుంది. ప్రశాంతి నిలయంలో శోభన్ ఆఫీసు గదులు, అతిథి గదులు వుంటాయి. ఇంటి ముందుండే విశాలమైన ఖాళీ స్థలంలో యేపుగా పెరిగిన చెట్లు దర్శనమిస్తాయి. ఆ చెట్ల ఆకుల్ని తుంచినా, కాయల్ని, పూలను కోసినా శోభన్ బాబుకు కోపమొస్తుంది. ఇంతెందుకు ఆయన వ్యక్తిగత ఆఫీసు గదిలో పెద్ద వేపచెట్టు వుంటుంది. దానిచుట్టూ రక్షణ కవచం బిగించి ఆఫీసు గది నిర్మించుకున్నారే తప్ప, ఆ చెట్టును కొట్టివేయలేదు. ఆ విశాల లోగిలిలోనే వర్కర్లకు క్వార్టర్లు వున్నాయి. అక్కడ పనిచేసే కుటుంబాల పిల్లల చదువులు ఖర్చులతోబాటు ఇతర నిర్వహణా ఖర్చులన్నీ శోభన్ బాబే భరిస్తారు. ఇంటి ప్రాకారం ముందు ఇరువైపులా నీడనిచ్చే చెట్లు, ఆ చెట్ల నీడల్లో విశాలమైన అరుగులు వుంటాయి.
వృద్ధ జనం నడకకు వచ్చి అక్కడ సేదతీరుతూ కబుర్లు చెప్పుకుంటూ, పేపర్లు చదువుకుంటూ స్వచ్చమైనగాలి పీల్చుకుంటూ కాలంగడుపుతూవుంటారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే శోభన్ బాబు కు ప్రకృతి అన్నా, తనమీద ఆధారపడినవారన్నా అంత అనురాగం, ప్రేమ, ఆప్యాయత. మరో ఉదంతం…. శోభన్ బాబుని సోలో హీరోగా నిలబెట్టిన చిత్రం ‘వీరాభిమన్యు’ (1965). అందులో దుర్యోదన పాత్రధారి రాజనాల. ఒకసన్నివేశంలో శోభన్ రాజనాలతో గదాయుద్ధం చేయాలి. శోభన్ కొత్త కావడంతో షూటింగులో అతని గద వెళ్లి రాజనాల నుదుటిని తాకి కాస్త రక్తం కారింది. రాజనాల ఆగ్రహోదగ్రుడయ్యాడు. చేతిలో వున్న గదను విసిరేసి “డూండీ గారూ, నేను బిజీ విలన్ ని. ఇలాంటి చేతగానివాడితో హీరో వేషం వేయిస్తారా. వేరే హీరోని పెట్టండి” అంటుండగా శోభన్ బాబు రాజనాలకు క్షమాపణ చెప్పాడు.
అయినా వినలేదు. కట్ చేస్తే… అదే రాజనాల 1980లో అన్నానగర్ లోని ఒక కారు షెడ్డులో దుర్బర జీవితం గడుపుతూ డబ్బు సాయంకోసం శోభన్ బాబు ఇంటికి వచ్చాడు. పాత విషయం ఆయనకు గుర్తొచ్చి ఏమైనా అంటాడేమోనని రాజనాలకు ఒకవైపు సందేహంగానే వుంది. శోభన్ బాబు రాజనాలకు ఆహ్వానం పలికి పలహారం, కాఫీ పెట్టించి ఒక కవరులో డబ్బుతెచ్చి అతని జేబులో పెట్టాడు(అందులో ఇరవైవేలరూపాయలకు పైగానే వున్న సంగతి ఇంటికి వెళ్లి చూసుకుంటే కాని రాజనాలకు తెలియదు). రాజనాల కళ్ళలో నీళ్ళు తిరిగాయి. శోభన్ ఆతణ్ణి గేటుదాకా వచ్చి సాగనంపాడు. అంతటి కరుణా సముద్రుడు శోభన్. ఇలాంటి గుప్తదానాలు అతడు ఎన్నో చేశాడు. ఆ విషయాలను రెండవ కంటికి కూడా తెలియనివ్వలేదు.