చాలా కాలం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో అరుదైన ఘట్టం అవిష్కృతమైంది. మహబూబ్‌నగర్ అభివృద్ధి కోసం కాంగ్రెస్, బిజెపి నేతలు ఒక్కటయ్యారు. మహబూబ్ నగర్ బైపాస్ రోడ్డు నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇవ్వాలని ఎంపి డికె అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిలు గురువారం కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రజల ఇబ్బందులు… బైపాస్ రోడ్డు నిర్మాణంతో ఉపయోగాలను కేంద్ర మంత్రికి వివరించారు.
బైపాస్ రోడ్డుతో మహబూబ్ నగర్ లో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని నేతలు వివరించారు. జాతీయ రహదారులైన NH 176 & NH 176 (N) కనెక్టివిటి మరింత సులభతరం అవుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు, పరిసర ప్రాంత గ్రామాల నుంచి మహబూబ్‌నగర్‌కు ప్రజల రాకపోకలు సులభతరం కానున్నాయి. ఇటు హైదరాబాద్, అటు కర్ణాటక , రాయచూర్ మధ్య రవాణా సౌకర్యవంతం కానుంది.
కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో రెండు పార్టీల మధ్య ఉప్పునిప్పుగా రాజకీయం సాగుతోంది. బిజెపి నుంచి డికె అరుణ ఏ మాత్రం అవకాశం దొరికినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ తరపున యాక్టీవ్‌గా డికె అరుణకు కౌంటర్ ఇస్తున్నారు.
ఈ తరుణంలో మహబూబ్‌నగర్ అభివద్ధి కోసం యెన్నం శ్రీనివాసరెడ్డి చొరవ తీసుకొని కేంద్రమంత్రి వద్దకు వెళ్దామని ఎంపి డికె అరుణను కోరగా వెంటనే అంగీకరించారు. రాజకీయాలు ఎలా ఉన్నా ఇద్దరు నేతలు అభివృద్ధి కోసం కలిసి వెళ్లటంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్, బిజెపిలకు చెందిన ఇద్దరు నేతలు నియోజకవర్గ అభివృద్ధి కోసం పూనుకోవడం ప్రశంసనీయమని రాజకీయ విశ్లేషకులు అభినందిస్తున్నారు. ప్రజాహితం కోసం అధికార, విపక్ష నేతలు కలిసి పనిచేస్తే రాజకీయాలు అదర్శవంతంగా సాగుతాయని ఆశిస్తున్నారు.